Begin typing your search above and press return to search.

జమున బయోపిక్ కచ్చితంగా ఓ సాహసమే!

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 AM GMT
జమున బయోపిక్ కచ్చితంగా ఓ సాహసమే!
X
తెలుగు తెరపై తిరుగులేని కథానాయకులుగా ఎన్టీఆర్ - ఏఎన్నార్ పేర్లు కనిపిస్తే, కథానాయికలుగా సావిత్రి - జమున పేర్లు వినిపిస్తాయి. అప్పట్లో వెండితెరపై వెలిగిన నిండు చందమామలు ఈ ఇద్దరే. మహానటిగా సావిత్రి మార్కులు కొట్టేస్తే, ఆంధ్ర డ్రీమ్ గాళ్ గా .. హంపి శిల్పంగా జమున ప్రశంసలు అందుకున్నారు.పోటాపోటీగా కెరియర్ ను నడిపించే ఇద్దరి హీరోయిన్ల మధ్య సహజంగానే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా మసలుకోవడం .. ఆత్మీయానురాగాలతో నడచుకోవడం విశేషం.

నిజానికి ఈ ఇద్దరిలో ఎవరి బయోపిక్ తీసినా మరొకరి ప్రస్తావన లేకుండా చేయడం ఒక లోపంగానే అనిపిస్తుంది. కానీ 'మహానటి' పేరుతో వచ్చిన సావిత్రి సినిమా జమున ఊసు లేకుండానే కొనసాగింది. అందుకు ఆమె కొంత నొచ్చుకున్న విషయం ఆ తరువాత జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంది. ఇప్పుడేమో జమున బయోపిక్ రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. జమున బయోపిక్ లో సావిత్రి పాత్రను చూపిస్తారా లేదా? అనే విషయాన్ని అలా ఉంచితే, అసలు జమున బయోపిక్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎంతవరకూ సాధ్యమవుతుంది? అనే ప్రశ్న కూడా కొంతమందిలో తలెత్తుతోంది.

ఒక బయోపిక్ భారీస్థాయిలో ప్రేక్షకులను మెప్పించాలంటే, భారీ వసూళ్లను రాబట్టాలంటే అందుకు తగిన కంటెంట్ ఉండాలి. కారణాలేవైనా సావిత్రి జీవితంలో అనేక కష్టాలు .. కన్నీళ్లు .. బాధలు ఉన్నాయి. వృత్తిపరమైన .. వ్యక్తిగతమైన సంఘర్షణను ఆమె అనుభవించారు. 'మహానటి' చూసినవాళ్లలో 'అయ్యో నా తల్లి' అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకోని మహిళా ప్రేక్షకులు లేరు. ఎన్నో ప్రశంసలు .. మరెన్నో సంపదలు పొందిన సావిత్రి, చివరిదశలో అవమానాలు .. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యారు. సావిత్రి జీవితంలోని ఆ మలుపులే ఆమె బయోపిక్ ను బలంగా నడిపించాయి.

కానీ జమున జీవితం అలా కాదు .. ఆమె వ్యక్తిగత జీవితం చాలా అందంగా .. ఆహ్లాదంగా సాగింది. వృత్తిపరంగా ఎదురైన ఒక సమస్య కారణంగా ఆమె కొంతకాలం పాటు ఎన్టీఆర్ - ఏఎన్నార్ లతో సినిమాలు చేయలేకపోయారు. ఆ సమయంలో జగ్గయ్య .. హరనాథ్ లాంటివారితో సినిమాలు చేస్తూ వెళ్లారు. ఆ తరువాత ఆ సమస్య సర్దుకుంది. అయితే అప్పటి ఆ సమస్య చిన్నదే అయినా ఆ విషయాన్ని తెరపై చూపించడం అంత వీజీ కాదు .. అదో పెద్ద సాహసమే అవుతుంది. ఈ ఒక్క సమస్య తప్ప కెరియర్ పరంగా ఆమెకి ఎప్పుడూ తిరుగులేదు. సాఫీగా సాగిపోయిన జమున కెరియర్ ను బయోపిక్ గా తీస్తే అది ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆర్ధికపరమైన అంశాల పరంగా ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేదే ఆమె లైఫ్ గురించి తెలిసినవారి సందేహం.