Begin typing your search above and press return to search.

గుండె పగిలి ఏడుస్తున్న మందిర కంటే.. ఆమె వేసుకున్న జీన్స్.. టీషర్టులే కనిపించటమా?

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 AM GMT
గుండె పగిలి ఏడుస్తున్న మందిర కంటే.. ఆమె వేసుకున్న జీన్స్.. టీషర్టులే కనిపించటమా?
X
మహిళ అంటే ఇలానే ఉండాలన్న ఆలోచన ఏమిటి? ఇదెక్కడి దుర్మార్గం? పుట్టెడు శోకంలో ఉన్న వారిని అయితే సానుభూతి చూపించాలి.. లేదంటే నోరు మూసుకొని ఉండాలి. అంతేకానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. ఎవరూ పూడ్చలేని విషాదం విరుచుకుపడిన వేళలో.. ఆమె వేసుకున్న దుస్తులపై చర్చ జరగటానికి మించిన దారుణం ఇంకేం ఉంటుంది.

గుండెపోటు కారణంగా ప్రముఖ నటి మందిరాబేడీ భర్త కమ్ ఫిలిం మేకర్ రాజ్ కౌశల్ (49) మరణించటం తెలిసిందే. దీంతో.. మందిర తీవ్రమైన షాక్ లో ఉండిపోయారు. అప్పటివరకు బాగానే ఉన్న భర్త ఇక లేరన్న షాకింగ్ నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు అంతా బాగానే ఉండి.. రాత్రి వేళ కాస్త నలతగా ఉండటం.. అర్థరాత్రి వేళ పరిస్థితి విషమంగా మారటం తెలిసిందే. హటాత్తుగా ఆరోగ్యం దారుణంగా దిగజారిపోయిన వేళ.. హడావుడిగా ఆసుపత్రికి తీసుకెళుతుంటే.. మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాల్ని విడిచారు.

ఈ షాకింగ్ ఉదంతాన్ని మందిర అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె శోకాన్ని నిలువరించలేకపోతున్నారు. తన భర్త అంత్యక్రియల్ని తానే స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జీన్స్.. టీషర్టు.. చేతికి వాచీ.. చెప్పులు ధరించిన వైనాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యం అంటూ అమ్మలక్కలకు మించిన మాటల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ అజ్ఞానాన్ని చాటుకున్నారు. భర్త అంతిమ సంస్కారాల వేళ ఆమె డ్రెస్సింగ్ ను తప్పు పడుతున్న వారిపై మరికొందరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించిందంటూ మందిరను ట్రోల్ చేస్తున్న వారిపై మరికొందరు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. భర్తపై ఆమెకున్న ప్రేమను చూడాలే కానీ.. ఇలాంటి మాటలు సరికాదని హితవు పలుకుతున్నారు. తీవ్రమైన శోకంలో ఉన్న ఆమెను టార్గెట్ చేయటానికి మించిన పిచ్చితనం మరొకటి ఉండదంటున్నారు. ‘తన భర్త అంత్యక్రియల సందర్భంగా మందిరాబేడీ ధరించిన దుస్తుల గురించి విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. మన ప్రపంచంలో ఇలాంటి స్టుపిడిటీకి మించింది మరింకేం ఉంటుంది’ అని సింగర్ సోనా మొహాపాత్ర కాస్తంత ఘాటుగా రియాక్టు అయ్యారు. మందిరకు అండగా నిలిచారు.

సోనా వ్యాఖ్యల్ని పలువురు సమర్థిస్తున్నారు. అనుకోని విషాదం విరుచుకుపడినప్పుడు సానుభూతిని ప్రదర్శించాలే కానీ.. ఆమె ఎలాంటి దుస్తులు ధరించారు? ఆమె ఎలా రెఢీ అయ్యారు? లాంటివి చూడటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. గెండు పగిలి ఏడుస్తున్న వేళ.. ఆమె కట్టూబొట్టు కావాల్సి వచ్చిందా? జనాల పిచ్చ పీక్స్ కు చేరిందని మండిపడుతున్నారు. మారిన కాలానికి తగ్గట్లుగా.. మారాల్సింది పోయి.. పాత కాలంలో మాదిరి మహిళ అంటే ఇలానే ఉండాలన్న ఇరుకు ఆలోచన ఏ మాత్రం సరికాదు.