Begin typing your search above and press return to search.

‘జంగిల్ బుక్’ను కొట్టేవారున్నారా?

By:  Tupaki Desk   |   8 May 2016 1:30 PM GMT
‘జంగిల్ బుక్’ను కొట్టేవారున్నారా?
X
ఓ హాలీవుడ్ సినిమా ఇండియాలో వంద కోట్ల మార్కును టచ్ చేయడానికే చాలా కాలం పట్టింది. ‘అవతార్’ లాంటి సినిమాకు కూడా ఆ ఘనత సాధ్యం కాలేదు. ఐతే గత కొన్నేళ్లలో మారిన మార్కెట్ లెక్కల నేపథ్యంలో గత ఏడాది ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ రూ.100 కోట్ల మార్కును టచ్ చేసిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఐతే అది ఓ యాక్షన్ సినిమా. బడా బడా స్టార్లు నటించారు. మామూలుగానే ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల్ని బాగా ఆదరిస్తారు. హాలీవుడ్ సినిమాల్ని ప్రధానంగా ఆదరించేది యూతే. వాళ్లు ఆ సినిమాతో బాగా కనెక్టయ్యారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ రికార్డును బద్దలు కొట్టాలంటే అలాంటి యాక్షన్ సినిమానో లేదంటే.. ‘అవతార్’ తరహా సినిమానో రావాల్సిందే అనుకున్నారంతా.

కానీ ఓ చిన్న పిల్లాడు ప్రధాన పాత్రలో నటించిన ‘జంగిల్ బుక్’ అలవోకగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ రికార్డును దాటేయడమే కాదు.. ఇంకే హాలీవుడ్ సినిమా కూడా సమీప భవిష్యత్తులో టచ్ కూడా చేయలేని రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

దీని నెట్ కలెక్షన్లు రూ.173 కోట్లు. ఇండియన్ స్టార్ హీరోల సినిమాలకు సైతం చాలా కష్టంగా అనిపించే కలెక్షన్లు ఇవి. ‘జంగిల్ బుక్’కు పోటీగా రిలీజైన షారుఖ్ ఖాన్ మూవీ ‘ఫ్యాన్’ వంద కోట్లు కూడా టచ్ చేయలేని పరిస్థితి. అలాంటిది జంగిల్ బుక్ కలెక్షన్లు చూస్తే కళ్లు తిరిగేలా ఉన్నాయి. విడుదలై నాలుగు వారాలవుతున్నా ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఫుల్ రన్లో రూ.300 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.