Begin typing your search above and press return to search.

పారితోషికాల‌పై కీల‌క భేటీ ముగిసింది!

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:30 PM GMT
పారితోషికాల‌పై కీల‌క భేటీ ముగిసింది!
X
ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు త‌ల‌పెట్టిన షూటింగ్ ల బంద్ పాక్షికంగా జ‌ర‌గుతున్న విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 1 నుంచి మొద‌లైన బంద్ నేటికి మూడ‌వ రోజుకు చేరింది. అచితే షూటింగ్ ల బంద్ కు అత్యంత కీల‌కంగా నిలిచిన స‌మ‌స్య స్టార్ హీరోల పారితోషికాలు.

దీనిపై చాలా మంది స్టార్ లు దిగొస్తున్నారంటూ వార్త‌లు వినిపించినా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. బండ్ల గ‌ణేష్ , అశ్వ‌నీద‌త్ లాంటి ప్రొడ్యూస‌ర్స్ ఇప్ప‌టికే దీనిపై ఘాటుగా స్పందించారు.

స్టార్స్ డిమాండ్ ని బ‌ట్టి పారితోషికాలు ఇస్తూ ఇప్ప‌డు త‌గ్గించుకోమ‌ని చెప్పే అధికారం మ‌న‌కు లేద‌ని బండ్ల‌న్న‌, అశ్వ‌నీద‌త్ బాహాగంటానే దీనిపై కౌంట‌ర్లు వేశారు. అయితే టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ కు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా చెబుతున్న స్టార్స్ పారితోషికాల‌పై బుధ‌వారం యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ `మా` అసోసియేష‌న్ తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. నిర్మాత దిల్ రాజు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో దిల్ రాజు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, ర‌ఘుబాబు, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సినిమా షూటింగ్ ల నిలుపుద‌ల‌, ఆర్టిస్ట్ ల పారితోషికాల‌పై చ‌ర్చించారు. కాగా పారితోషికం త‌గ్గింపు విష‌యంలో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఇదివ‌ర‌కే ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఇదే విష‌య‌మై ఫిలింఛాంబ‌ర్ ఆధ్య‌ర్యంలో 33 మందిలో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. సినిమా బ‌డ్జెట్ హ‌ద్దులు దాట‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా స్టార్ల పారితోషికాలు మారాయి. అయితే వీటిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ త‌గ్గించాల్సిందేన‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వాదిస్తోంది.

ఇది ఎంత వ‌ర‌కు సాధ్యం అన్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ‌గా మారింది. బుధ‌వారం జ‌రిగిన కీల‌క భేటీలో స్టార్ హీరోలు ఎవ‌రూ పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బుధ‌వారం జ‌రిగిన మీటింగ్ లో కేవ‌లం మా స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వీళ్లు చెబితే స్టార్స్ వింటారా? .. విని దిగొస్తారా? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే రానున్న రోజుల్లో స్టార్ హీరోలంద‌రితో గిల్డ్ స‌భ్యులు పారితోషికాల‌పై కీల‌క భేటీని నిర్వ‌హించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.

ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు చాలా వ‌ర‌కు రోజు వారి పారితోషికాలు వ‌సూలు చేస్తున్నార‌ట‌. దానికి తోడు వారి అసిస్టెంట్ ల జీత‌భ‌త్యాలు, డైలీ ఖ‌ర్చులు కూడా నిర్మాతమీదే రుద్దేస్తున్నార‌ట‌. దీనిపై కూడా బుధ‌వారం చ‌ర్చ జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. క్యార‌వాన్ ఖ‌ర్చులు కూడా ప్ర‌ధాన చ‌ర్చ‌లో వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌ధానంగా ఏం తేల్చారు? `మా` ఆర్టిస్ట్ ల నుంచి ఎలాంటి హామీని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ కి ఇచ్చింది అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది.