Begin typing your search above and press return to search.

అతి హీరోయిజం తగ్గించే పనిలో ప్రశాంత్ నీల్?

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:45 AM GMT
అతి హీరోయిజం తగ్గించే పనిలో ప్రశాంత్ నీల్?
X
'బాహుబలి' తర్వాత సౌత్ సినిమా సత్తా చాటింది కన్నడ ఫిలిం 'కె.జి.ఎఫ్: చాప్టర్ 1'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో భారీ కలెక్షన్లు నమోదు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా 'కె.జి.ఎఫ్: చాప్టర్ 2' తెరకెక్కుతోంది. మొదటి సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోగలుగుతుందా అనేది ఆసక్తికరమైన అంశం. మొదటి భాగం విడుదలైనప్పుడు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో జనాలకు వెంటనే నచ్చింది. అయితే ఇప్పుడు 'కె.జి.ఎఫ్' ను అందరూ చూశారు కాబట్టి సెకండ్ పార్ట్ లో కూడా అవే సీన్లు ఉంటే పెదవి విరిచే ప్రమాదం ఉంది. అందుకే 'కె.జి.ఎఫ్' టీమ్ పై అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఓ ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ భాగంలో హీరో ఇంట్రడక్షన్.. ఎలివేషన్ సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. అవసరాన్ని మించిన ఈ హీరోయిజం సీన్లు నార్త్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని అలాగే మల్టిప్లెక్స్ ఆడియన్స్ కూడా వీటిని బోర్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఆ హీరోయిజం సీన్ల డోసును కొంతమేర తగ్గించి సినిమాలో అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసే పనిలో పడ్డారట.

మొదటి భాగం భారీ విజయం సాధించినందువల్ల 'కె.జి.ఎఫ్: చాప్టర్ 2' కు పెద్దగా కష్టపడకుండానే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అయితే సినిమా ఏమాత్రం అటుఇటుగా ఉన్నా సరే కన్నడలో తప్ప మిగతా భాషలలో రెండో ఆట నుంచే థియేటర్లు ఖాళీ అయిపోతాయని ఫిలిం నగర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే భారీ అంచనాలు ఉండడం అనేది ఎప్పుడూ కత్తి మీద సాము. అంచనాలు అందుకోగలిగితే భారీ విజయం దక్కుతుంది.. తేడా కొడితే రిజల్ట్ అంతే రివర్స్ గా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.