Begin typing your search above and press return to search.

'విరాట‌ప‌ర్వం' చివ‌రి 30 నిమిషాలు..మామూలుగా వుండ‌దా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 8:30 AM GMT
విరాట‌ప‌ర్వం చివ‌రి 30 నిమిషాలు..మామూలుగా వుండ‌దా?
X
కొన్ని క‌థ‌లు క‌లంలోంచి పుడితే.. కొన్ని క‌థ‌లు జ‌నం లోంచి.. జ‌న జీవితంలోంచి పుట్టుకొస్తాయి. అలాంటి క‌థ‌ల్లో ఓ సోల్ వుంటుంది. ఓ ఆర్థ్ర‌త వుంటుంది. అలాంటి సోల్ వున్న క‌థే 'విరాట‌పర్వం'. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణలో న‌క్స‌ల్ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసింది. తెలంగాణ ప‌ల్లెల్లో అత్య‌ధిక శాతం ఈ ఉద్య‌మానికి అండ‌గా నిలిచారు. ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఉద్య‌మం చాలా మంది జీవితాల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఆనాటి య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఓ యువ‌తి చుట్టు సాగే అంద‌మైన క‌థ‌గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌ ఉద్య‌మంతో ముడిపెట్టిన ప్రేమ‌క‌థ‌గా మ‌లిచి తెర‌కెక్కించాడు.

న‌క్స‌ల్స్ నేప‌థ్యంలో సాగే సీరియ‌స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. సినిమాలో హీరో రానా నే అయినా సినిమా అంతా సాయి ప‌ల్ల‌వి చుట్టే తిరుగుతుంది. ఇంత వ‌ర‌కు త‌ను ఏ సినిమాలో న‌టించినా ఆ పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ని పెంచి మ‌రీ త‌న‌దైన పంథాలో పాత్ర‌ని ఎలివేట్ చేస్తూ హీరోల‌కు మించి క్రెడిట్ ని సొంతం చేసుకుంటూ వ‌స్తోంది సాయిప‌ల్ల‌వి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల‌కు 'విరాట‌ప‌ర్వం'లో త‌ను పోషించిన వెన్నెల పాత్ర చాలా భిన్న‌మైన‌ది.

ప్ర‌త్యేక‌మైన‌ది కూడా. ఇలాంటి రియ‌లిస్టిక్ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌డం ఇదే తొలిసారి. జ‌నం లోంచి వ‌చ్చిన యాద‌ర్ధ పాత్ర కావ‌డం సాయి ప‌ల్ల‌వికి వెన్నెల పాత్ర నిజంగా ఓ స‌వాల్ అని చెప్పొచ్చు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌, టీజ‌ర్ ల‌లో సాయి ప‌ల్ల‌వి క‌నిపించిన తీరు, ఆమె ప‌లికిన సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. బ‌రువైన పాత్ర‌లో క‌నిపించ‌డంతో ఆమెని అమితంగా ఇష్ట‌ప‌డే ప్ర‌తీ ఒక్క‌రూ ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ నిర్మాణ సంస్థ‌లు ఈ చిత్రానికి తోడ‌వ్వ‌డం కూడా ఈ మూవీకి బాగా ప్ల‌స్ అయింది. అయితే సాయి ప‌ల్ల‌వి లాంటి న‌టి వెన్నెల పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు సినిమాకు మ‌రింత హైలైట్ గా నిలుస్తోంది. సాధార‌ణ ప‌ల్లెటూరి యువ‌తిగా .. అర‌ణ్యంలో త‌ను మ‌న‌సుప‌డిన వ్య‌క్తి కోసం అడ‌వి బాట ప‌ట్టి.. అత‌ని కోసం బందూకు ఎక్కుపెట్టి గుళ్ల వ‌ర్షం కురిపించే యువ‌తిగానూ సాయి ప‌ల్ల‌వి పాత్ర‌ని తీర్చి దిద్దిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటూ సినిమాపై బ‌జ్ ని క్రియేట్ చేసింది.

ఈ శుక్ర‌వారం.. జూన్ 17న మ‌రి కొన్ని గంట‌ల్లో ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో వార్త సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా 'ది బ‌ర్త్ ఆఫ్ వెన్నెల' పేరుతో విడుద‌ల చేసిన నాలుగు నిమిషాల వీడియో హైలైట్ గా నిల‌వ‌గా... ఈ మూవీకి క్లైమాక్స్ ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌తీ ఒక్క‌రినీ క్లైమాక్స్ స‌న్నివేశాలు భావోద్వేగానికి గురిచేసి కంట‌నీరు పెట్టిస్తాయ‌ని చెబుతున్నారు. చివ‌రి 30 నిమిషాలు సాయి ప‌ల్ల‌వి పాత్ర‌, ఆమె న‌ట‌న నెక్స్ట్ లెవెల్ లో వుండి సినిమాకు హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.