Begin typing your search above and press return to search.

100 కోట్ల క్ల‌బ్ లోకి `ది ల‌య‌న్ కింగ్`

By:  Tupaki Desk   |   23 July 2019 9:28 AM GMT
100 కోట్ల క్ల‌బ్ లోకి `ది ల‌య‌న్ కింగ్`
X
50 కోట్లు .. 60 కోట్లు.. 80 కోట్లు.. 100 కోట్లు.. ఇదీ `ది ల‌య‌న్ కింగ్` స్పీడ్. భార‌త‌దేశంలో రిలీజైన తొలి మూడు రోజుల‌కే 50కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టేందుకు ఇంకెన్నో రోజులు ప‌ట్ట‌ద‌ని చెబుతున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ 54కోట్లు వ‌సూలు చేసింది. అయితే నాలుగో రోజుకు 30 శాతం డ్రాప్ అయినా మ‌రో 8కోట్ల వ‌సూళ్ల‌తో ఇప్ప‌టికే 62 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది. డిస్నీ సంస్థ నుంచి వ‌చ్చిన ఈ సినిమా కేవ‌లం నాలుగు రోజుల్లో 62 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గాక తొలి వారంలోనే 80 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టేందుకు దూసుకెళుతోంది. ఇక రెండో వారంలో ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్ లో అడుగు పెట్టే వీలుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్ త‌ర్వాత ఇండియాలో `ది ల‌య‌న్ కింగ్` చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ 3డి యానిమేష‌న్ సినిమా అంద‌రికీ న‌చ్చుతోంది. అందుకే స్ట‌డీగా వ‌సూళ్లు సాధిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. ది ల‌య‌న్ కింగ్ హైద‌రాబాద్ స‌హా మిగిలిన ఏరియాల్లోనూ చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంది.

1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం `ది లయన్ కింగ్` కి రీమేక్ ఇది. భార‌త‌దేశంలో ఇంగ్లీష్‌- తెలుగు, తమిళ్- హిందీ భాషల్లో రిలీజైంది. స్థానిక భాష‌ల్లో లోక‌ల్ హీరోలు చెప్పిన డ‌బ్బింగ్ పెద్ద ప్ల‌స్ అయ్యింది. తెలుగు వెర్షన్ లో ప్రధాన పాత్ర సింబా అనే సింహానికి నాని.. సింబా తండ్రి ముఫాసాకు రవి శంకర్‌, స్కార్ (విల‌న్)కు జగపతిబాబు వాయిస్ అందించారు. టిమోన్‌ అనే ముంగిస పాత్ర‌కు అలీ.. పుంబా అనే అడవి పందికి బ్రహ్మానందం డబ్బింగ్‌ చెప్పారు. డిస్నీ నుంచి వ‌చ్చిన ది జంగిల్ బుక్ భార‌త‌దేశం నుంచి 300 కోట్లు వ‌సూలు చేసింది. అంత‌కుమించి `ది ల‌య‌న్ కింగ్` వ‌సూలు చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.