Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'ది లయన్ కింగ్'

By:  Tupaki Desk   |   19 July 2019 10:59 AM GMT
మూవీ రివ్యూ : ది లయన్ కింగ్
X
చిత్రం: లయన్ కింగ్

నటీనటులు (గాత్రాలు) : నాని - జగపతి బాబు - రవి శంకర్ - బ్రహ్మానందం - ఆలీ తదితరులు
ఛాయాగ్రహణం : సెలెబ్ డెస్ఛానెల్
ఎడిటింగ్ : మార్క్ లివోల్సి - ఆడం గెర్స్టెల్
స్క్రీన్ ప్లే : జెఫ్ నాథన్సన్
సంగీతం : హాన్స్ జిమ్మర్
దర్శకత్వం : జాన్ ఫావ్రీ

యాంత్రికమైన నగర జీవనానికి దూరంగా జంతువుల మధ్య ఓ అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలు ఒకప్పుడు బాగా వచ్చేవి కానీ ఈ మధ్యకాలంలో తగ్గిపోయాయి. తెలుగులో చిరంజీవి లాంటి మెగాస్టార్ సైతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడవి దొంగ- మృగరాజు లాంటి సినిమాలు చేశారంటేనే ఈ జానర్ కు ఎంత ప్రత్యేకత ఉందో చెప్పొచ్చు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మనకు చాలా పరిమితులు ఉంటాయి కాబట్టి ఎవరూ ఈ మధ్య ఇలాంటి సబ్జెక్టులను టచ్ చేయడం లేదు. అందుకే ఇంగ్లీష్ సినిమాలంటే మనవాళ్లకు ప్రత్యేకమైన మోజు. ఈ క్రమంలో ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ డిస్నీ పిక్చర్స్ నుంచి లయన్ కింగ్ సిరీస్ లోని కొత్త సినిమా రావడంతో అందరికి దీని మీద ఆసక్తి రేగింది. లైవ్ మోషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ సింహం బొమ్మ ఆకట్టుకునేలా ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ:

అదొక దట్టమైన విశాలమైన అడవి. దానికి మకుటం లేని మహారాజు సింహం ముఫాసా(రవి శంకర్). తనకు దక్కని అధికారం అన్నయ్య నుంచి లాక్కోవడానికి ఎదురు చూస్తుంటాడు స్కార్(జగపతి బాబు). ఈ క్రమంలో పిల్లాడిగా ఉన్న ముఫాసా కొడుకు సింబ(నాని)ని మాయమాటలుతో మచ్చిక చేసుకుని అక్కడి జంతువులకు శత్రవులుగా చీకటి గుహలో బ్రతికే హైనా జాతిని రెచ్చగొట్టి ముఫాసాని పధకం ప్రకారం చంపేస్తాడు. దీనికి కారణం తనేనని భావించిన సింబ మళ్ళీ సార్క్ మాటలు నమ్మి అక్కడి నుంచి ఇంకో అడవికి పారిపోతాడు.

హైనాల అండతో స్కార్ రాజవుతాడు. సింబ ఓ ఎడారికి దగ్గర్లో ఉండే వేరే అడవిలో నివసించే అడవి పంది పుంబ(బ్రహ్మానందం)టిమోన్( ఆలీ) పంచన చేరి అక్కడే పెరిగి పెద్దవాడు అవుతాడు. కొంత కాలం తర్వాత శింబ చిన్ననాటి స్నేహితురాలు నాలా తనను కలుస్తుంది. అప్పటిదాకా తన వల్లే నాన్న చనిపోయాడని అమ్మకు అడవికి దూరంగా ఉంటున్న సింబ దాని వెనుక ఉన్నది చిన్నాన్న సార్క్ అని తెలుసుకుని ప్రతీకారాన్ని బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగేది మీరు ఊహించిందే

కథనం - విశ్లేషణ:

ఇలాంటి జంతువుల కథలు చెప్పేటప్పుడు స్వేచ్ఛతో కూడిన సృజనాత్మకత చాలా ఉంటుంది. హద్దులు ఉండవు. లాజిక్స్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. పిల్లలను పెద్దలను ఆకట్టుకునేలా ఉర్రుతలూగించే కథా కథనాలు - గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడని నిర్మాత దొరికితే చాలు. జంగల్ బుక్ - మొగ్లీ - టార్జాన్ - లయన్ కింగ్ లాంటి యానిమేషన్ మూవీస్ ఎంటర్ టైన్మెంట్ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకోవడానికి కారణం ఇదే. అందులోనూ ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించిన కార్టూన్ మూవీగా లయన్ కింగ్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. అలాంటి కథను లైవ్ మోషన్ టెక్నాలజీ సహాయంతో మనుషులే నటించారా అన్నంత సహజంగా తీశారన్నప్పుడు దాని మీద విపరీతమైన ఆసక్తి కలగడం సహజం. అందుకే డబ్బింగ్ చెప్పడం కోసం షారుఖ్ ఖాన్ నుంచి నాని దాకా ఎందరో స్టార్లు కదిలి వచ్చారు.

లయన్ కింగ్ కథ పాతదే. చిన్న చిన్న మార్పులు మినహాయించి అంతా తెలిసిందే. మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో పునఃసృష్టి చేశారు. అంతే. ఇంకా చెప్పాలంటే సినిమా ప్రారంభంలో సింబ సింహం పసిగుడ్డుగా పుట్టినప్పుడు ఓ కోతి దాన్ని జంతువులకు పరిచయం చేయడం చూస్తే మనకు చటుక్కున బాహుబలిలో రమ్యకృష్ణ బుల్లి బాహుబలిని పైకెత్తి జనానికి చూపించే సీన్ వెంటనే మైండ్ లోకి వచ్చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అన్నదమ్ముల మధ్య అధికారం కోసం పోరు రెండింటిలో కామన్ పాయింట్. కాకపోతే ఈ థీమ్ ని పదే పదే కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు అవకాశం లేదు కాబట్టి అదే వాడుకోక తప్పలేదు. లయన్ కింగ్ నెరేషన్ లో దర్శకుడు జాన్ ఫెరేవు సంగీతానికి పెద్ద పీఠ వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుమారుగా ఆరేడు పాటలు ఉండటం మాములుగా ఇలాంటి సినిమాల్లో చూసేది కాదు. కానీ వాటిని సింక్ అయ్యేలా సెట్ చేసిన తీరు మరీ బోర్ కొట్టించకుండా సాగుతుంది

అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుని థీమ్ గా తీసుకున్న జాన్ ఫెరేవు అందుకు తగ్గ టెంపోని సినిమా మొత్తం కొనసాగించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో సింబ చీకటి గుహలోకి స్నేహితురాలితో వెళ్ళినప్పుడు హైనాల గుంపు చుట్టముట్టిన తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిసినా ఉత్కంఠను కలిగిస్తూ ముఫాసాను ఎంట్రీ చేయించడం లాంటివి అద్భుతంగా పేలాయి. ముఫాసా చనిపోయే ఎపిసోడ్ కూడా టెర్రిఫిక్ అని చెప్పొచ్చు కానీ ఆ తర్వాత గ్రాఫ్ తగ్గుతూ పోతుంది. సింబ పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎలాంటి ఎగజైటింగ్ ఎపిసోడ్స్ ని పొందుపరచలేదు. పుంబా-టిమోన్ పాత్రల మధ్య కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మైండ్ బ్లోయింగ్ యానిమల్ యాక్షన్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఇది కొంత నిరాశ కలిగించేదే. సింబ తన గతం వెతికే ప్రయత్నాలు చేయకపోవడం వెలితిగా అనిపిస్తుంది. పైగా ఈ పాత్ర గంట తర్వాత ఎంట్రీ ఇవ్వడం కూడా కొంత మైనస్సే.

అటు స్కార్ చేసే అరాచకాలను చక్కగా ప్రజెంట్ చేసిన జాన్ అదే స్థాయిలో సింబ సింహాన్ని సూపర్ హీరోగా చూపించడంలో మాత్రం తడబడ్డాడు. అందులోనూ అవసరానికి మించి పాటలు పెట్టడం కొంత మైనస్ అయ్యింది. క్లైమాక్స్ కూడా మాములుగా రీచ్ అయిపోతుంది. సార్క్ తో సింబా తలపడే సీన్ ని మాత్రం జాన్ తెరకెక్కించిన తీరు అప్పటిదాకా ఆవహించిన నీరసాన్ని కొంత పోగొడుతుంది. సెకండ్ హాఫ్ లో మొదటి సగం చాలా టైం వేస్ట్ చేసిన జాన్ దాని స్థానంలో సార్క్ కు సింబాకు మధ్య క్లాష్ అయ్యే ట్రాక్స్ ఏమైనా పొందుపరిచి ఉంటే బాగుండేది. పిల్లలకు ఇవన్నీ పట్టవు కాబట్టి వాళ్ళను సంతృప్తి పరచడంలో మాత్రం జాన్ ఫెయిల్ కాలేదు

తెలుగు వెర్షన్ వరకు డబ్బింగ్ విషయంలో డిస్నీ తీసుకున్న శ్రద్ధ వావ్ అనిపిస్తుంది. జగపతి బాబు -రవి శంకర్ గొంతులు ఒకదానికి మరొకటి పోటీ పాడగా సింబగా నాని పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించాడు. వీళ్లందరినీ మరిపిస్తూ తమకు మాత్రమే సాధ్యమయ్యే కామెడీ టైమింగ్ లో బ్రహ్మానందం ఆలీ ఇచ్చిన డబ్బింగులు అదరహో అనిపిస్తాయి. సంభాషణల రచయితలు తీసుకున్న శ్రద్ధ వల్ల పదాలు కూడా తేలిగ్గా ఉండి మంచి కామెడీ పండింది. ఒకవేళ వీళ్లిద్దరు కాకుండా రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో వెళ్లుంటే ఖచ్చితంగా వెయిట్ తగ్గేది అన్నది మాత్రం నిజం.

నటీనటులు:

ఇందులో నిజమైన ఆరిస్టులు ఎవరూ లేరు కాబట్టి ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం పడటం లేదు. నిజమైన మనుషుల ముఖకవళికలను తీసుకుని వాటినే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా నిజంగా జంతువులతోనే నటింపజేశారా అని భ్రమింపజేసేలా తీర్చిద్దిద్దిన తీరు అమోఘం. మూడు సింహాలు కీలక పాత్రలు కాబట్టి వాటి మధ్య వ్యత్యాసం కనిపించేలా తీసుకున్న శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇచ్చింది.వీళ్ళ తో సమానంగా పుంబా టిమోన్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. హైనా నాయకురాలి ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నారు. చిన్నపిల్లలు చూస్తే ఇదంతా నిజంగా తీశారేమో అనుకునేలా షూట్ చేసిన తీరుని మాత్రం మెచ్చుకోవలసిందే

సాంకేతిక వర్గం:

దర్శకుడు జాన్ ఫావ్రూ తీసుకున్న ప్లాట్ ను ఎక్కడా డీవియేట్ కాకుండా రిస్క్ తీసుకోకుండా తెరకెక్కించిన తీరు బాగుంది కానీ రెండు గంటల లయన్ కింగ్ ప్రయాణంలో ఇంకాస్త థ్రిల్ కలిగించే ఛేజులు కానీ జంతువుల మధ్య భీకరమైన యుద్ధాలు కానీ జోడించి ఉంటే ఇది ఇంకో లెవెల్ లో ఉండేది. కానీ కేవలం కథలోని సింగల్ పాయింట్ కే కట్టుబడాలని దానికి తగ్గట్టే రాసుకున్న స్క్రీన్ ప్లే వల్ల లయన్ కింగ్ ఫెంటాస్టిక్ అనిపించుకోలేదు కానీ నిరాశ పరిచే ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇప్పటికే యానిమేషన్ మూవీని చూసినవాళ్లకు జంగల్ బుక్ లాంటి సినిమాలను విపరీతంగా ఫాలో అయ్యేవాళ్ళకు లయన్ కింగ్ లో మైమరిపించే అంశాలు మరీ ఎక్కువగా లేకపోయినా ఉన్నంతలో ఓ డీసెంట్ వాచ్ అనిపించడంలో జాన్ సక్సెస్ అయ్యాడు

ఇక సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కష్టం కూడా చిన్నది కాదు. ఏకంగా ఇన్నేసి పాటలను జోప్పించినా క్యాచీ ట్యూన్స్ తో అవి మరీ ప్రతిబంధకంగా అనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టేశాడు. మళ్లి మళ్ళి పాడుకునే ట్యూన్స్ లేకపోయినా హకూనా మటాటా పాట మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఛాయాగ్రాహకుడు కలెబ్ డెస్చానెల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లేని లోకాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని దాన్ని తన కెమెరా కంటితో తెరకెక్కించిన తీరు అన్ని పొగడ్తలకు అర్హమే. మార్క్ ఆడంల ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది కాని సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనిపించెందుకు కారణం కథనం కాబట్టి ఇతన్ని తప్పుబట్టడానికి లేదు. డిస్నీ సంస్థ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు. 260 మిలియన్ డాలర్ల ఖర్చు కంటి ముందు కనిపిస్తుంది

చివరిగా చెప్పాలంటే పిల్లలను టార్గెట్ చేసుకుని వచ్చిన లయన్ కింగ్ తన బాధ్యతను దాదాపుగా నెరవేర్చింది. ఇలాంటి సినిమాలను ఇష్టపడే పెద్దలకు ఇందులో మరీ కొత్తగా విభిన్నంగా ఎగజైటింగ్ గా అనిపించే అంశాలు లేకపోవడం కొంత అసంతృప్తికి లోను చేసినా కొత్త అనుభూతి పొందటం ఖాయమే. ఏది ఆశిస్తామో అది అవసరమైన మోతాదులోనే ఇచ్చిన లయన్ కింగ్ ని ఓ సజీవ అడవి ప్రయాణం కోసం ఆస్వాదించాలి తప్పించి రెగ్యులర్ సినిమాలతో ఎక్కువ పోల్చకుండా చూస్తే అడవి రాజు మనల్ని నవ్వించి భయపెట్టి మురిపించి సాగనంపుతాడు

చివరగా - పిల్లల మనసులు గెలిచే అడవిరాజు

రేటింగ్ : 3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre