Begin typing your search above and press return to search.

రాబోయే 6 నెలలు యువ హీరో కెరీర్ కి చాలా క్రూషియల్..!

By:  Tupaki Desk   |   20 Sep 2022 12:30 AM GMT
రాబోయే 6 నెలలు యువ హీరో కెరీర్ కి చాలా క్రూషియల్..!
X
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. 'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. మంచి ఈజ్ తో నటిస్తూ తనకంటూ ఓ వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఓ స్థాయికి ఎదగడం అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటుగా నిరంతర కృషి వల్లే అది సాధ్యమవుంటుంది. ఇప్పుడు కిరణ్ కూడా ఇదే కోవకు చెందుతాడు. అయితే సక్సెస్ ట్రాక్ ని కొనసాగించే క్రమంలో సరైన స్టోరీలను ఎంచుకోకపోవడం వల్ల యువ హీరో కొన్ని ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో 'సెబాస్టియన్ PC524' మూవీతో హీరోగా తొలి పరాజయం చవిచూసిన కిరణ్.. ఆ తర్వాత 'సమ్మతమే' సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఓపెనింగ్ డే పర్వాలేదనిపించినా తరువాత రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

రెండు వరుస విజయాల తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ రావడంతో.. యంగ్ హీరో ఇకపై కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడతాడనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఇటీవల ప్లాప్ అయిన సినిమాలు.. 'ఎస్ఆర్ కల్యాణ మండపం' కంటే ముందు లాక్ చేయబడిన సినిమాలని తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం చేతిలో ప్రస్తుతం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 'SR కళ్యాణ మండపం' విడుదల తర్వాత కిరణ్ లాక్ చేసుకున్న సినిమాలు. తనను ఆడియన్స్ ఎలాంటి సినిమాల్లో రిసీవ్ చేసుకుంటున్నారనేది దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలను డిజైన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల కిరణ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు.

''నేను చేసే కమర్షియాలిటీ కానీ.. నా మీటర్ మరియు నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఎస్ ఆర్ రిలీజ్ తర్వాత నాకు అర్థమైంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను ఓకే చేసిన ప్రతీ స్క్రిప్ట్ కూడా ప్రాపర్ గా డిజైన్ చేసుకొని.. దర్శకులతో కూర్చొని ఎలా చేద్దామని డిస్కస్ చేసి చేసుకున్న సినిమాలే. ఇప్పుడు వచ్చినవన్నీ SR ముందు ఓకే చేసిన సినిమాలు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి మనం సినిమా చేయడమే గొప్ప విషయం అనుకోని చేశాను'' అని కిరణ్ అన్నారు.

కిరణ్ చెప్పిన దాన్ని బట్టి రాబోయే సినిమాలన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని సెట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అని అర్థమవుతుంది. ఇవి హిట్ అయి యువ హీరో మళ్లీ సక్సెస్ ట్రాక్ అందుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు.

అబ్బవరం కిరణ్ ప్రస్తుతం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమా చేస్తున్నాడు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ లో రూపొందే 'మీటర్' మూవీలోనూ కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అలానే సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో 'రూల్స్ రంజన్' అనే సినిమా చేస్తున్నాడు. రత్నంకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ లైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దివ్యాంగ్ లవానియా - వి. మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏషియన్ వారి బ్యానర్స్ లో కిరణ్ సినిమాలు కమిట్ అయినట్లు సమాచారం.

కిరణ్ లైనప్ చూస్తుంటే అతని కెరీర్ కు రాబోయే కొన్ని నెలలు చాలా క్రూషియల్ అని అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం మీద కిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాల ఫలితాన్ని బట్టి కొత్తవాటిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

''నా కెరీర్ లో రాబోయే ఆరు నెలలు ఎవరికీ లేనంత క్రూసియల్ అనుకుంటా. వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు నేను నటించే నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. నేను నా ఎనర్జీని ఆ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. తర్వాత ఏంటనేది ఈ 4 సినిమాలు డిసైడ్ చేస్తాయి. అందుకే ఎన్ని కొత్త స్క్రిప్ట్స్ వస్తున్నా.. అందరికీ అదే చెప్తున్నాను. అప్ కమింగ్ సినిమాలను బట్టిజ్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. నేను పదేళ్ల తర్వాత చేయాలనుకున్న సినిమాలు ఆల్రెడీ చేసేశాను. అందుకే ఈ సినిమాల ఫలితాన్ని బట్టి తదుపరి ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకుంటాను'' అని కిరణ్ చెప్పుకొచ్చారు.