Begin typing your search above and press return to search.

ఒక్కటే సినిమా.. ఒక్కడే హీరో.. 13 పాత్రలు

By:  Tupaki Desk   |   30 Dec 2022 5:44 AM GMT
ఒక్కటే సినిమా.. ఒక్కడే హీరో.. 13 పాత్రలు
X
ఏదైనా సినిమాలో హీరో డబుల్‌ రోల్‌ చేస్తేనే ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ హడావుడి చేస్తూ ఉంటారు. ఇక ట్రిపుల్ రోల్‌ చేస్తే మామూలుగా ఉండదు. ఈ మధ్య కాలంలో ట్రిపుల్‌ చేసేంత సాహసం ఏ హీరో కూడా చేయడం లేదు. ప్రస్తుత యంగ్‌ హీరోల్లో ట్రిపుల్‌ రోల్‌ చేసిన హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఒకే సినిమాలో అంతకు మించి పాత్రలు చేయడం అంటే మామూలు విషయం కాదు.

దశావతారం సినిమాలో కమల్‌ హాసన్ ఏకంగా 10 పాత్రల్లో నటించాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కమల్‌ హాసన్ ను పది అవతారాల్లో చూడాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటి వరకు అదే రికార్డ్‌. దశావతారం సినిమాకు ముందు నవరాత్రి అనే సినిమాలో శివాజీ గణేషన్ 9 పాత్రల్లో నటించారు.

కమల్‌ మరియు శివాజీ గణేషన్ ల రికార్డులను ఏ ఒక్కరు బ్రేక్‌ చేయలేరు అనుకుంటున్న సమయంలో తమిళ స్టార్‌ హీరో సూర్య ఏకంగా 13 పాత్రల్లో నటించేందుకు సిద్ధం అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సూర్య 42 సినిమాలో కథానుసారంగా ఏకంగా 13 పాత్రల్లో కనిపించబోతున్నాడట.

శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ మరియు స్టూడియో గ్రీన్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ను ఖరారు చేయలేదు. భారీ చారిత్రాత్మక సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. 3డి వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సూర్య 13 పాత్రల్లో నటిస్తున్నాడట.

భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశా పటానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో యోగిబాబు.. కోవై సరళ.. ఆనంద్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

తెలుగు మరియు తమిళంతో పాటు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారట. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను భారీ ఎత్తున బిజినెస్ చేసే విధంగా ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.

ఒకే హీరో ఒక సినిమాలో 13 పాత్రల్లో నటించాడు అంటే కచ్చితంగా అది పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి ప్రమోషనల్‌ పాయింట్‌ అవుతుంది. తద్వారా జనాల్లో ఆసక్తి పెరిగి పాజిటివ్ బజ్ తో డీసెంట్‌ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.