Begin typing your search above and press return to search.

క‌రెప్ష‌న్ లేని ఏకైక రంగం సినీరంగం - మెగాస్టార్

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:30 AM GMT
క‌రెప్ష‌న్ లేని ఏకైక రంగం సినీరంగం - మెగాస్టార్
X
గోవాలో IFFI 2022 ముగింపు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ సంచ‌ల‌న వ్యాఖ్య ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. క‌రెప్ష‌న్ లేని ఒకే ఒక్క రంగం సినీరంగం. ఈ రంగంలోకి యువ‌త‌రం వెల్లువ‌లా రావాలి. ఇంకా ఇంకా రావాలి!! అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక్క‌డ నిజాయితీగా ప‌ని చేసే న‌టులు సాంకేతిక నిపుణుల‌కు ఎదిగేందుకు ఆస్కారం ఉంద‌ని భ‌రోసానిస్తూ మాట్లాడారు.

ఆ స‌మ‌యంలో ఆయ‌న ఆ మాట‌ను చెబుతూ ఎంతో ఉద్వేగానికి లోన‌య్యారు. నిజానికి టాలీవుడ్ లో అగ్ర హీరోగా హ‌వా సాగిస్తున్న రోజుల్లోనే మెగాస్టార్ సినీప‌రిశ్ర‌మ‌ను విడిచి రాజ‌కీయాల్లోకి వెళ్లారు. ప్ర‌జారాజ్యం పార్టీతో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని భావించారు. కానీ ఆయ‌న సున్నిత మ‌న‌స్త‌త్వానికి నిజాయితీకి కుయుక్తుల రాజ‌కీయ రంగం అస్స‌లు సెట్ కాలేద‌ని నాటి రాజ‌కీయ రంగ‌ ప్ర‌త్య‌ర్థులే స్వ‌యంగా వెల్ల‌డించారు. తెలుగు దేశం పార్టీ ప‌త్రిక‌కు చెందిన ప్ర‌ముఖ ఎడిట‌ర్ చిరంజీవి రాజ‌కీయాల్లోని లోపాల‌ను ఎత్తి చూపుతూ ఆయ‌న ఈ రంగానికి ఎలా సూట్ కారో కూడా వ‌ర్ణించారు.

అందుకు త‌గ్గ‌ట్టే రాజ‌కీయాల్లో ఆయ‌న ఇమ‌డ‌లేక‌పోయార‌న్నది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. చివ‌రికి ఆయ‌న నిజాయితీగా ప‌ని చేసే బ్ల‌డ్ బ్యాంక్ - ఐబ్యాంక్ సేవ‌ల్లో సైతం అవినీతి ఉంద‌ని రాజ‌కీయ‌ శ‌త్రువ‌ర్గం ప్ర‌చారం చేసిందంటే దానికి చిరు ఎంత‌గా హ‌ర్ట‌య్యారో అర్థం చేసుకోవాలి. అలాగే రాజ‌కీయ నాయ‌కుల ద్వంద్వ వైఖ‌రి.. క్రూర‌ మ‌న‌స్త‌త్వాలతో త‌న‌పై ఎటాక్ ల‌ను ప‌త్రిక‌ల్లో చెడు రాత‌ల‌ను కూడా ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా అనుభ‌వించారు. ఇక రాజ‌కీయ రంగంలో క‌రెప్ష‌న్ ని ప్ర‌త్య‌క్షంగా చూసిన చిరంజీవి దానిని గోవా ఇఫీలోను ఎత్తి చూపిన‌ట్టు వీక్ష‌కుల‌కు అనిపించింది. తాను సినీరంగంలోకి కంబ్యాక్ అయ్యాక కూడా అభిమానుల అండ‌తో ఆద‌ర‌ణ పొందుతున్నాన‌ని ఈరోజు ఫ్యాన్స్ లేక‌పోతే తాను లేన‌ని నిజాయితీగా అంగీక‌రించారు. అస‌లు క‌రెప్ష‌న్ అన్న‌ది లేని ఏకైక‌ రంగం సినీరంగ‌మ‌ని ఇక్క‌గ గొప్ప అభిమానం సంపాదించ‌వ‌చ్చ‌ని అన్నారు.

రాజకీయాల కోసం సినిమాలను ఎప్పటికీ వదులుకోనని చిరంజీవి మరోసారి ఇఫీలో ప్రతిజ్ఞ చేశారు. నేను తెలుగు సినిమా అభిమానుల ప్రేమకు బానిసను! అని కూడా వ్యాఖ్యానించారు. IFFI 2022 ముగింపు వేడుకలో తెలుగు స్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమకు అశేషంగా ఉన్న మెగాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

"నేను చిత్ర పరిశ్రమలో 45 ఏళ్లుగా ఉన్నాను. ఈ నాలుగైదు దశాబ్దాలలో నేను ఒక దశాబ్దం రాజకీయాల్లోనే గడిపాను. కొన్ని కారణాల వల్ల మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహం ఉండేది. కానీ నేను ఆశ్చర్యపోయాను. వారు నాపై అదే రకమైన ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తారా? అనుకున్నాను. తరం మారిపోయింది కాబట్టి నాకు అనుమానం వచ్చింది. వారి హృదయాలలో ప్రేమ - ఆప్యాయత ల ప‌రంగా నా స్థానం చెక్కుచెదరకుండా ఉన్నాయి. వాస్తవానికి అవి నాలో ఆశ్చ‌ర్యాన్ని రెట్టింపు చేశాయి. నా అభిమానులతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను సినిమా పరిశ్రమను ఎప్పటికీ (మళ్లీ) వదిలిపెట్టనని నా అభిమానులకు హామీ ఇస్తున్నాను" అని అన్నారు. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానుల ప్రేమకు నేను బానిసను. ఆ ప్రేమ వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అలాంటి అవార్డులతో గౌరవం అందుకున్నాన్నాను. మీ ప్రేమకు నేను కృతజ్ఞుడనై ఉంటాను" అని ఇఫీ- సుదీర్ఘ ప్ర‌సంగంలో చిరు ఎమోష‌న‌ల్ అయ్యారు.

చిరంజీవి తన ప్రసంగంలో వేదిక ముందు ప్రేక్షకులలో కూర్చున్న అక్షయ్ కుమార్ ను త‌న స్నేహితుడు అంటూ ప్ర‌స్థావించారు. త‌న వార‌సుడు చ‌ర‌ణ్ కి ధీటుగా అక్షయ్ ఫిట్ నెస్ ఎనర్జీతో ఉన్నార‌ని ప్ర‌శంసించారు. "ఇటీవల నా కొడుకు (రామ్ చరణ్) - అక్షయ్ కుమార్ ఒక టీవీ షోలో క‌లిసి డ్యాన్స్ చేసారు. అతను నా స్నేహితుడు కానీ ఇప్పుడు నా కొడుకుతో పోటీ పడుతున్నాడు. అదే అక్షయ్ కుమార్ లోని చరిష్మా... బలం .. శక్తి"అని ప్ర‌శంస‌లు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య సంక్రాంతి 2023 బ‌రిలో విడుదల కానుంది. వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. తాజా రీమేక్ మూవీ `గాడ్ ఫాద‌ర్` తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని చిరు రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.