Begin typing your search above and press return to search.

సామ్ లో రంగు రాళ్ల సెంటిమెంట్ అనూహ్యం?!

By:  Tupaki Desk   |   9 Nov 2022 3:37 PM GMT
సామ్ లో రంగు రాళ్ల సెంటిమెంట్ అనూహ్యం?!
X
శాస్త్రాన్ని న‌మ్మేవాళ్ల‌ను ఆప‌లేం. న‌మ్మ‌నివాళ్ల‌ను న‌మ్మించ‌లేం! చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తార‌లు సెంటిమెంట్ల గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎన్టీఆర్- బాల‌కృష్ణ‌- ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా చాలా మంది స్టార్లు శాస్త్రాల‌ను న‌మ్ముతారు. బాల‌య్య బాబు.. టి.సుబ్బ‌రామిరెడ్డి వంటి ప్ర‌ముఖుల మంత్రోచ్ఛార‌ణ‌లతో వేదిక‌ల‌పైనే అద‌ర‌గొడ‌తారు. ఇక్క‌డ ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. ఎవ‌రి ఆచ‌ర‌ణ వారిది.

ఇప్పుడు ఇదే కేట‌గిరీలోకి మరొక పేరు వ‌చ్చి చేరింది. ఆమెనే స‌మంత‌. ఇటీవ‌ల వైద్య చికిత్స‌తో ఆటో ఇమ్యూన్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత సామ్ ఊహ‌కంద‌ని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు త‌న ఒంటిపై మూడు విభిన్న‌మైన రంగు రాళ్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ మార్పు య‌శోద మూవీ ప్ర‌మోష‌న్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్క‌డ జ‌ర్న‌లిస్టులు ప‌దే ప‌దే స‌మంత చేతి వేళ్ల‌కు ఉన్న‌ రంగు రాళ్ల వైపే చూపులు సారించారు. ఫోటోగ్రాఫ‌ర్లు వ‌రుస‌గా క్లిక్ ల‌తో హోరెత్తించారు. దీంతో ఇప్పుడు స‌మంత చేతి వేళ్ల‌కు ఉన్న ఆ మూడు ర‌కాల రంగు రాళ్లపైనా ఆరాలు కొన‌సాగుతున్నాయి. క్లాసీగా క‌నిపిస్తున్న‌ ఉంగ‌రాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇంతకీ ఉన్న‌ట్టుండి సామ్ లో ఈ మార్పున‌కు కార‌ణ‌మేమిటి? అస‌లు ఈ రంగు రాళ్ల క‌థేమి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. స‌మంత‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా ఆటుపోట్లు ఎదుర‌వుతున్నాయి. వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ఆరోగ్యం ప‌రంగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. దీంతో త‌న‌లో చాలా మార్పు క‌నిపిస్తోంది. ఆలోచ‌నా విధానం అమాంతం మారింది. ఇక‌ తన రెండు చేతులకు మూడు ఉంగరాలు ధరించింది. అవి డిజైనర్ రింగ్ లు కావు.. హిందూ సంస్కృతి ప్రకారం అదృష్టాన్ని ప‌రీక్షించుకుని విజేత‌గా నిలిచేందుకు ఆరోగ్యంగా జీవించేందుకు ఇలాంటి వాటిని శాస్త్రం తెలిసిన వారు సూచిస్తుంటారు.

సమంత క‌న‌క పుష్య రాగం అనే ఉంగరాన్ని ధరించింది. కనక పుష్యరాగం (పసుపు నీలమణి) సమృద్ధిగా సంపద- ఆరోగ్యం- కీర్తి- ఫలవంతమైన సంబంధాలను ఇస్తుందని విస్తృతంగా నమ్ముతారు. అలాగే సమంత గోమేధకం (హెస్సోనైట్) రాయితో ఉంగరాన్ని ధరించి క‌నిపించింది. ఇది ఈవిల్ ఐ నుంచి కాపాడుతుంది. రాహు గ్రహం చెడు ప్రభావాలను తగ్గించడం ద్వారా ధరించినవారికి మంచి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. అలాగే ఆమె ముత్యం (ముత్యం) ఉంగరాన్ని ధరించింది. ఎందుకంటే జ్యోతిష్యం ప్ర‌కారం.. చంద్రుడు ఓ క్షణంలో చాలా బలహీనంగా మారాడు. దాని ప్ర‌భావం ఆరోగ్యంపై బ‌లంగా ప‌డుతుంది. దానికోసం ఈ మార్పు అని తెలిసింది.

సమంతా క్రిస్టియన్ గా జన్మించినా కానీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు. నిరంత‌రం తిరుమ‌లేశుని సంద‌ర్శించ‌డం కాళ‌హ‌స్తీశ్వ‌రుని వ‌ద్ద పూజ‌లాచ‌రించ‌డం త‌న‌కు అల‌వాటు. ఇటీవల సికింద్రాబాద్ లోని ఒక వేద పాఠశాలకు వెళ్లి తన శ్రేయస్సు కోసం కొన్ని పూజలు స‌హా హోమం నిర్వహించింది. ఇక ప‌వ‌న్-ర‌కుల్ - సునీల్ లాంటి స్టార్ల‌కు రంగు రాళ్ల‌పై న‌మ్మ‌కం పెద్ద‌దే. క‌న‌క‌పుష్య‌రాగం ఉంగ‌రాల‌ను వీళ్లు కూడా ధ‌రించారు.

వాటాలు అడిగే రేంజుకి చేరుకుందా?

స‌మంత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో రాజీ పాత్ర‌తో పాటు పుష్ప‌లో `ఊ అంటావా...` పాట‌తో త‌న పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. బాలీవుడ్ అంత‌టా త‌న డ్యాషింగ్ స్టైల్ గురించి చ‌ర్చ సాగింది. అదే క్ర‌మంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను క్రేజీగా అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి.

ఓవైపు తెలుగులో నాయికా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తున్న స‌మంత లాభాల్లో వాటాలు కోరుతోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టించిన య‌శోద‌- శాకుంత‌లం చిత్రాలు విడుద‌ల‌కు రానున్నాయి. య‌శోద ఇప్ప‌టికే భారీ బిజినెస్ చేసింది. నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. త‌దుప‌రి గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం పైనా భారీ అంచ‌నాలున్నాయి. వ్యాపార ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇవి రెండూ త‌న కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పుతాయ‌ని స‌మంత బ‌లంగా న‌మ్ముతోంది.

ఒక‌వేళ ఈ రెండిటితో థియేట‌ర్ల‌లో వ‌సూళ్ల హ‌వా కొనసాగితే త‌దుప‌రి స‌మంత ఎక్కువ నాయికా ప్ర‌ధాన‌ సినిమాలు చేయాల‌ని భావిస్తోంద‌ట‌. నిర్మాత‌ను లాభాల‌లో వాటా కోరాల‌నుకుంటోంద‌ట‌. నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో హీరోల‌కు ధీటుగా ఎద‌గాల‌ని స‌మంత క‌ల‌లు గంటోంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.