Begin typing your search above and press return to search.

సోనూకు సంబంధించి షాకింగ్ నిజం బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   14 Jun 2021 12:30 AM GMT
సోనూకు సంబంధించి షాకింగ్ నిజం బయటకొచ్చింది
X
సమస్యలో ఉన్నా.. సాయం కావాలన్నంతనే వెనుకా ముందు చూసుకోకుండా ముందుకొచ్చే వారెవరన్న మాట ఈ దేశంలో అడిగితే.. వారు చెప్పేది సోనూసూద్. కొవిడ్ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలు.. లాక్ డౌన్ వేళ వలసకూలీలు పడుతున్న కష్టాలకు కరిగిపోయిన సోనూ.. వారికి సాయం అందించటంలో మొదలైన సేవా పరంపర.. అంతకంతకు ఎక్కువ అవుతోంది. అప్పటివరకు సినిమాల్లో విలనీ క్యారెక్టర్లు వేసుకొని బండి లాగించే అతడిలోని రియల్ హీరో బయటకు వచ్చాడు.

సోనూ సక్సెస్ వెనుకా అతడి సతీమణి సపోర్టు కూడా ఉందన్నది తెలిసిందే. తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్న సోనూ పంజాబీ. వారిద్దరి పరిచయం నాగపూర్ లో జరిగింది. వీరి ప్రేమకథ గురించి తాజాగా రివీల్ చేశారు ఆయన సతీమణి. తన తండ్రి రిజర్వు బ్యాంకు ఉద్యోగి కావటంతో తమకు నాగపూర్ కు బదిలీ అయ్యిందని.. తాను అక్కడ మీడియా కమ్యునికేషన్ లో డిగ్రీ చేసే దానినని.. ఆ టైంలో సోనూ ఇంజనీరింగ్ చేసేవాడని చెప్పారు.

తమది టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్పిన ఆమె.. ‘‘మా ఇంట్లో వారందరికి నా స్నేహితుడిగా తెలుసు. ఇంట్లో వారు కూడా అతన్ని ఇష్టపడే వారు. తను పంజాబీ.. మేం తెలుగువాళ్లం. నేపథ్యాలు వేరు. అయినా పెళ్లికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. తను చదువు పూర్తి అయి మోడలింగ్ చేయటానికి ముంబయి వస్తే.. నాకో కంపెనీలోజాబ్ రావటంతో ముంబయి వచ్చేశా. పెళ్లి చేసుకున్నాం. తను కెరీర్ లో సెటిల్ కాకపోవటంతో ఆదాయం ఉండేది కాదు. దీంతో.. నా జీతం మీదనే ఇద్దరం బతకాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.

ముంబయిలో తన స్నేహితురాలికి డబుల్ బెడ్రూం ఇల్లు ఉండేదని.. దాన్లో ఉండటానికి ఆమె ఓకే చెప్పటంతో అందులో తాము కూడా ఉండేవాళ్లమన్నారు. ‘అలా రెండేళ్లు గడిచాయి. మా తల్లిదండ్రులు ఎగువ మధ్యతరగతి వారు. సోనూ ఫ్యామిలీ వారు సంపన్నులు. సాయం అడిగితే చేసేవారు. ఇష్టపడి పెళ్లి చేసుకొని సాయం అడగబుద్ది కాలేదు. అందుకు కష్టమైనా భరించాం కానీ సాయం అడగలేదు. రెండేళ్లకు సోనూకు నెమ్మదిగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకవైపు మోడలింగ్.. మరోవైపు సినిమాలతో ఆదాయం పెరిగింది. అప్పుడు మాకో కొడుకు పుట్టాడు. వాడి గురించి చూసుకోవటానికి జాబ్ మానేశా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజున వేలాది మందికి సాయం చేస్తున్న సోనూ.. ఒకప్పుడు ఉన్న పరిస్థితిని దాచకుండా చెప్పిన వైనం వింటే.. ఏదో సినిమా కథ వింటున్నట్లుగా అనిపించట్లేదు?