Begin typing your search above and press return to search.

పాట వలన సినిమా ఎప్పటికీ హిట్ కాలేదు: ఆర్పీ పట్నాయక్

By:  Tupaki Desk   |   24 April 2021 11:30 PM GMT
పాట వలన సినిమా ఎప్పటికీ హిట్ కాలేదు: ఆర్పీ పట్నాయక్
X
ఒకప్పుడు ఒక సినిమాలో 6 పాటలు ఉంటే వాటిలో కనీసం మూడు నాలుగైనా హిట్ సాంగ్స్ ఉండేవి. ఒక్కోసారి అన్ని పాటలూ బాగుండి మ్యూజికల్ హిట్స్ గా నిలబడిన సినిమాలూ ఉన్నాయి. అలాంటిది ప్రస్తుతం ఒక సినిమాలో ఒక పాట హిట్ కావడమనేది కష్టంగా మారింది. పాట బాగుండటమంటే తెరపై వస్తున్నంత సేపు కాకుండా ఆ తరువాత కూడా అది గుర్తుండాలి. ఈ మధ్య ఒక పాట హిట్ అయినా .. ఆ పాట కోసం జనం థియేటర్లకు వెళుతున్నారు.

తాజా ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ .. "నాకు తెలిసి ఒక సినిమా హిట్ కావడమనేది పాటపై ఆధారపడి ఉండదు. సినిమా బాగుంటేనే జనం చూస్తారు .. సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది. మంచి పాట సినిమా ఓపెనింగ్స్ కి హెల్ప్ కావొచ్చునేమోగానీ, సినిమా హిట్ ను పాట డిసైడ్ చేయలేదు. పాట బాగుందని సినిమాకి వెళ్లిన వాళ్లని ఆ సినిమా నిరాశపరచకూడదు.

ఉదాహరణకి చెప్పుకోవాలంటే '3' సినిమాలో 'వై దిస్ కొలవరి ..' అనే పాట చాలా పెద్ద హిట్. జాతీయస్థాయిలో ఆ పాట ఊపేసింది. ఆ తరువాత సినిమా రిలీజ్ అయింది .. ఫ్లాప్ అయింది. పాట అంత హిట్ అయినప్పుడు సినిమా కూడా హిట్ కావాలి కదా అనుకోవడానికి లేదు. సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది .. ఆ హిట్ కి మంచి పాట హెల్ప్ కావొచ్చు అంతే. ఈ మధ్య వచ్చిన 'శశి' సినిమాను కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 'ఒకే ఒక లోకం నువ్వే' పాట మంచి హిట్ .. కానీ సినిమా ఆడలేదు" అని చెప్పుకొచ్చారు.