Begin typing your search above and press return to search.

స్టార్స్ బిజీ బిజీ.. ప‌క్క చూపులు చూస్తున్న డైరెక్ట‌ర్స్‌!

By:  Tupaki Desk   |   20 Nov 2022 11:30 AM GMT
స్టార్స్ బిజీ బిజీ.. ప‌క్క చూపులు చూస్తున్న డైరెక్ట‌ర్స్‌!
X
టాలీవుడ్ లో డైరెక్ట‌ర్స్ ప‌రిస్థితి విచిత్రంగా మారింది. ఒక ద‌శ‌లో హీరోలు ఫ్రీగా వుంటే డైరెక్ట‌ర్స్ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండే వారు. కానీ ప్ర‌స్తుతం కొంత మంది ద‌ర్శ‌కుల ప‌రిస్థితి చిత్రంగా మారింది. హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడికి కూడా ఏ హీరో అందుబాటులో లేడంటే మ‌న హీరోలు ఎంత బిజీగా వున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో చాలా మంది ద‌ర్శ‌కులు ఏ హీరోతో సినిమా చేయ‌లేక‌.. అంగీక‌రించిన సినిమా ముందుకు వెళ్ల‌కు ప‌క్క‌దారులు చూస్తున్నార‌ట‌.

యంగ్ హీరోల ద‌గ్గ‌రి నుంచి సీనియ‌ర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ, విక్ట‌రీ వెంక‌టేష్‌, కింగ్‌ నాగార్జున వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్నారు. ఇక స్టార్ హీరోలు ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌వితేజ‌, రామ్‌, గోపీచంద్‌ వంటి స్టార్ లు పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా వున్నారు. చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`తో పాటు భోళా శంక‌ర్‌` మూవీలోనూ న‌టిస్తున్నారు.ఇక బాల‌య్య `వీర‌సింహారెడ్డి`తో సంక్రాంతి బ‌రిలో పోటీకి సై అంటున్నాడు.

త‌రువాత అనిల్ రావిపూడితో మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`తో పాటు మ‌రో రెండు రీమేక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌భాస్ ఇప్ప‌టికే ఆది పురుష్‌`ని పూర్తి చేసి `స‌లార్‌`, ప్రాజెక్ట్ కె తో పాటు మారుతి తెర‌కెక్కిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తుండ‌టంతో ప్ర‌భాస్ డైరీ కూడా ఖాలీ లేదు. ఇక రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ తో, ఎన్టీఆర్ .. కొర‌టాల శివ‌తో సినిమాలు చేస్తున్నారు.

ఇక మ‌హేష్ ..త్రివిక్ర‌మ్ తో, ర‌వితేజ ధ‌మాకా, రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు వంటి సినిమాల‌తో బిజీ అయ్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ `ఖుషీ`తో పాటు గౌతమ్ తిన్న‌నూరితో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. రామ్ - బోయ‌పాటి శ్రీ‌నుతో ...ఇలా ప్ర‌తీ హీరో, కొండ మంది డైరెక్ట‌ర్లు బిజీ బిజీగా వుంటే హిట్ సినిమా ఇచ్చి కూడా మ‌రో హీరో ల‌భించ‌క‌పోవ‌డంతో మ‌న తెలుగు ద‌ర్శ‌కులు ఇత‌ర భాష‌ల హీరోల కోసం వెతుకుతూ వారితో సినిమాలు చేస్తున్నారు.

వంశీ పైడిప‌ల్లి.. త‌మిళ హీరో విజ‌య్ తో `వార‌సుడు` చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో చాలా మంది స్టార్స్ ని ప్ర‌య‌త్నించిన త‌రువాత ఇక్క‌డ ఏ హీరో ఖాలీగా లేడ‌ని త‌మిళ హీరోని ప‌ట్టుకుని సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి త‌మిళ హీరో ధ‌నుష్ తో `సార్‌`ని చేస్తున్నాడు. ఇర నీసెంట్ గా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ కెవి .. త‌మిళ హీరో శివ కార్తీకేయ్ తో `ప్రిన్స్‌` మూవీ చేసిన విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ కోసం ఎదురుచూస్తున్న‌ హ‌రీష్ శంక‌ర్ స‌ల్మాన్ ఖాన్ తో సినిమా కోసం ప్ర‌య‌త్నించ‌డం తెలిసిందే. `ల‌వ్ స్టోరీ` త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల కూడా ధ‌నుష్ తో సినిమాకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇలా మ‌న వాళ్లు బిజీ కావ‌డంతో తెలుగు ద‌ర్శ‌కులు ఇలా ప‌క్క చూపులు చూస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.