Begin typing your search above and press return to search.

కూతురి కోసం 'గెస్ట్'గా మారిన సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 5:30 AM GMT
కూతురి కోసం గెస్ట్గా మారిన సూపర్ స్టార్..!
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కోలీవుడ్లో అయితే రజనీకాంత్ పేరు చెబితే అభిమానులకు పూనకాలొస్తాయి. అంతలా ఆయనపై అక్కడి ప్రజలు ప్రేమాభిమానాలు చాటుతుంటారు. అయితే రజనీకాంత్ తాజాగా తన కూతురి కోసం ఒక సినిమాలో 'గెస్ట్'గా మారబోతున్నారనే టాక్ కోలీవుడ్లో నడుస్తోంది.

రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు, విలన్ వేషాలు వేశారు. తన మ్యానరిజంతో స్టార్ హీరోగా, తమిళ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇలాంటి సమయంలోనూ తన స్నేహితులు, ఇతర హీరోల కోరిక మేరకు అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో కన్పించారు. తెలుగులో మంచు మోహన్ బాబు సూపర్ హిట్ మూవీ 'పెద్దరాయుడు'లో రజనీకాంత్ చేసిన గెస్ట్ రోల్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'రా వన్' మూవీలో నటించారు. 2011లో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ 'చిట్టి రోబో' పాత్రలో కన్పించి అభిమానులను అలరించారు. ఇక తాజాగా మరోసారి ఇలాంటి పాత్ర చేసేందుకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ అతిథి పాత్రలో నటించే సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ కు కోలీవుడ్లో దర్శకురాలిగా మంచి గుర్తింపు ఉంది. తండ్రికి తగ్గ తనయురాలిగా ఐశ్వర్య నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య అధ్వర్య మురళీ హీరోగా ఓ మూవీని ప్లాన్ చేశారు.

ఈ మూవీలోనే రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారట. ఈమేరకు ఐశ్వర్య రజనీకాంత్ స్క్రీప్ట్ ను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ తన కూతురి సినిమాలో గెస్ట్ రోల్ చేయనుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

మరోవైపు రజనీకాంత్ 'జైలర్' మూవీలో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాపులతో రజనీకాంత్ 'జైలర్' మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ భారీ విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.