Begin typing your search above and press return to search.

'ఆపద్బాంధవుడు' విషయంలోనే టైటిల్ సెంటిమెంట్ కుదర్లేదట!

By:  Tupaki Desk   |   24 April 2021 4:30 PM GMT
ఆపద్బాంధవుడు విషయంలోనే టైటిల్ సెంటిమెంట్ కుదర్లేదట!
X
తెలుగులో కళాత్మక చిత్రాలకు ఆశ్రయం కల్పించిన బ్యానర్ గా 'పూర్ణోదయా క్రియేషన్స్' కనిపిస్తుంది. అభిరుచి కలిగిన నిర్మాతగా ఏడిద నాగేశ్వర రావు ఈ బ్యానర్ పై ఆణిముత్యాల వంటి సినిమాలను నిర్మించారు. 'గంగిగోవుపాలు గరిటైడను చాలు' అన్నట్టుగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన అందించిన చిత్రాలు, తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మణిపూసలుగా మెరుస్తాయి. ఏడిద నాగేశ్వరరరావు జయంతి సందర్భంగా, ఆయన కుమారులు రాజా .. శ్రీరామ్ స్పందించారు.

ఏడిద నాగేశ్వరరావు కుమారులుగా జన్మించడం మేము చేసుకున్న అదృష్టం. మా నాన్నగారు నిర్మించిన సినిమాలు ఇప్పటికి కూడా మాకు గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతున్నాయి. నటుడు కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, నిర్మాతగా మారి ఇంతటి గొప్ప చిత్రాలను నిర్మించడం నిజంగా విశేషం. అవార్డుల కోసం నాన్నగారు సినిమాలు తీయలేదు .. ఆయన తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కళాత్మక చిత్రాలకు కమర్షియల్ అంశాలను జోడించినవారాయన.

అప్పట్లోనే నాన్నగారు కొత్తగా ఆలోచించడం వలన .. కథలను ఎంచుకునే విషయంలో ప్రయోగాలు చేయడం వలన మా బ్యానర్ కి ఇంతటి గౌరవం దక్కింది. అప్పట్లో చిరంజీవి గారు ఓ సందర్భంలో పూర్ణోదయా బ్యానర్ పై వచ్చేవి ఆర్టు సినిమాలు కాదు .. హార్టు సినిమాలు అన్నారు. అంతకు మించిన గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది? డబ్బుకోసం కాకుండా పేరు కోసం నాన్నగారు సినిమాలు తీశారు. ఆ సినిమాలు ఆయనకు పేరుతో పాటు డబ్బు కూడా తెచ్చిపెట్టాయి. విశ్వనాథ్ గారితో నాన్నగారు తీసిన అన్ని సినిమాలు 'స' అనే అక్షరంతోనే మొదలయ్యాయి. కానీ ఒక్క 'ఆపద్బాంధవుడు' విషయంలోనే టైటిల్ సెంటిమెంట్ కుదరలేదు. ఆ కథకు ఆ టైటిల్ కరెక్ట్ అని భావించి అదే పెట్టాము" అని చెప్పుకొచ్చారు.