Begin typing your search above and press return to search.

రీమేకులనే నమ్ముకుంటున్న అగ్ర నిర్మాత..?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
రీమేకులనే నమ్ముకుంటున్న అగ్ర నిర్మాత..?
X
ఒక భాషలో హిట్టైన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మన కంటెంట్ ఇతర భాషల్లోకి వెళ్తుంటే.. ఇతర భాషల్లో సక్సెస్ అయిన స్టోరీలను తెలుగులోకి రీమేక్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఫ్రెంచ్ - స్పానిష్ - కొరియన్ చిత్రాలను కూడా రీమేక్ చేస్తున్నారు.

రీమేక్ సినిమాల వెనుక ఉద్దేశ్యం మంచి కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాలానేది ఒకటైతే.. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి బిజినెస్ పరంగా రిస్క్ ఉండదని నిర్మాతలు భావించడం మరొక కారణంగా చెబుతుంటారు. అయినప్పటికీ వంద శాతం సక్సెస్ రేట్ ను ఎక్సపెక్ట్ చేయలేం.

కొన్ని రీమేకులు విజయవంతమైతే.. మరికొన్ని విఫలయత్నాలుగా మిగిలిపోతుంటాయి. తెలుగులో ప్రస్తుతం ఎక్కువ రీమేకులు చేస్తున్న నిర్మాతగా దగ్గుబాటి సురేష్ బాబు ని పేర్కొనవచ్చు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇప్పుడు పలు రీమేక్ చిత్రాలను బ్యాంక్ రోల్ చేస్తున్నారాయన.

గతంలో మూవీ మొఘల్ డి. రామానాయుడు కూడా రీమేక్ సినిమాలపై ఆసక్తి కనబరిచేవారు. అదే బాటలో సురేష్ బాబు - రానా కూడా నడుస్తున్నారు. గతేడాది విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' 'దృశ్యం 2' వంటి రెండు రీమేక్స్ చేసి నేరుగా ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో గురు ఫిలిమ్స్ సునీత తాటి తో కలిసి సురేష్ బాబు నిర్మించిన 'శాకిని డాకిని' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 'మిడ్ నైట్ ర‌న్న‌ర్స్' అనే సౌత్ కొరియన్ చిత్రానికి రీమేక్. ఇంతకుముందు వీరు 'మిస్ గ్రానీ' అనే కొరియ‌న్ మూవీని 'ఓ బేబీ' గా రీమేక్ చేసి హిట్టు కొట్టారు. ఇవి కాకుండా మరో నాలుగు కొరియన్ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొరియ‌న్ - ఫ్రెంచ్ సినిమాలు మంచి కంటెంట్ - ప‌రిమిత బ‌డ్జెట్లో గొప్ప క్వాలిటీతో ప్ర‌పంచ స్థాయిలో రూపొందుతుంటాయి. అనేక సినిమాలు మ‌న ద‌గ్గ‌ర ఫ్రీమేక్ అయ్యాయి కూడా. కాపీ కొట్టినా అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు కాబట్టి.. కాపీ రైట్ ప్రాబ్లం కూడా పెద్ద‌గా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత చిన్న సీన్ ని కాపీ కొట్టినా నెటిజన్లు ప‌ట్టేస్తున్నారు. దీంతో ఒరిజిన‌ల్ మేక‌ర్స్‌ కేసులు వేసే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. అందుకే అధికారికంగా రైట్స్ కొనుగోలు చేసి రీమేక్ చేస్తున్నారు. కొందరు ఉన్నది ఉన్నట్టు దింపితే.. మరికొందరు మార్పు6చేర్పులు చేసుకుంటున్నారు.

ఇప్పుడు సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకిని డాకిని' సినిమా ఒరిజినల్ లో ఇద్ద‌రు హీరోలు న‌టిస్తే.. ఇక్క‌డ మాత్రం హీరోయిన్లు ప్రధాన పాత్రలుగా మార్చారు. ఇక త్వరలో సమంత రూత్ ప్రభు తో ఓ రీమేక్ చేయబోతున్నట్లు నిర్మాత సునీత తాటి ఇటీవల వెల్లడించింది.

వచ్చే వారం ఇదే బ్యానర్లలో రాబోయే 'దొంగలున్నారు జాగ్రత్త' కూడా '4×4' అనే స్పానిష్ చిత్రానికి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే సురేశ్ ప్రొడక్షన్స్ లో 'మానాడు' వంటి తమిళ్ రీమేక్ తెరకెక్కనుంది. అలానే 'డ్రీమ్ గర్ల్' అనే హిందీ మూవీ రైట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఇలా టాలీవుడ్ లో సురేశ్ బాబు ఎక్కువ రిమేక్ చిత్రాల నిర్మాణంలో భాగం అవుతున్నారు. రీమేక్ సినిమాలు చేసుకుంటూ పోవడం వలన.. మన వర్ధమాన రచయితలకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నారు.

నిజానికి రీమేక్ వల్ల అనుకూల అంశాలు ఎన్నో.. ప్రతికూల అంశాలు కూడా అన్నే ఉంటాయి. ఆల్రెడీ హిట్ అయిన కంటెంట్ ను మళ్ళీ తెరపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. అదే విధంగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు.. మార్పులు చేర్పులు చేస్తే మంచి కథను చెడ గొట్టారు అంటారు.

అందుకే రీమేక్స్ అనేవి అప్పుడప్పుడు రిస్కీ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. అందుకే చాలా మంది ఫిలిం మేకర్స్ మరియు హీరోలు రీమేకుల జోలికి వెళ్లడం లేదు. అయితే ఈ విషయంలో సురేశ్ బాబు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. ఆయన టేకాఫ్ చేసిన రీమేక్స్ లో ఎక్కువ శాతం హిట్స్ ఉన్నాయి. మరి ప్రస్తుతం హ్యాండిల్ చేస్తున్న చిత్రాల్లో ఎన్ని విజయం సాధిస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.