Begin typing your search above and press return to search.

'కాశ్మీర్ ఫైల్స్' త‌ర్వాత‌ 'వ్యాక్సిన్ వార్' బీజేపీ కోస‌మేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
కాశ్మీర్ ఫైల్స్ త‌ర్వాత‌ వ్యాక్సిన్ వార్ బీజేపీ కోస‌మేనా?
X
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం తన 534వ చిత్రం `ది వ్యాక్సిన్ వార్`ను ప్రకటించారు. అత్యంత‌ స్ఫూర్తిదాయకమైన సినిమా చేస్తున్నాం! జై హింద్! అంటూ ఆయ‌న ఈ సినిమాని ప్ర‌క‌టించగానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్లో కోలాహాలం మొద‌లైంది. ఇప్ప‌టికే అనుపమ్ ఖేర్ క్లాప్ బోర్డ్ పట్టుకుని ఉన్న ఫోటో కూడా వైర‌ల్ అయ్యింది. దాంతో పాటే సెట్స్ లో వ‌ర్కింగ్ స్టిల్స్ కి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

బుడ్డా ఇన్ ఎ ట్రాఫిక్ జామ్-ది తాష్కెంట్ ఫైల్స్-ది కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాల తర్వాత వివేక్ అగ్నిహోత్రి -అనుపమ్ ఖేర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ జోడీ వ‌రుస చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేస్తున్నారు. `ది వ్యాక్సిన్ వార్` హిందీ- ఇంగ్లీష్- గుజరాతీ- పంజాబీ- భోజ్ పురి- బెంగాలీ- మరాఠీ- తెలుగు- తమిళం- కన్నడ- ఉర్దూ - అస్సామీ అనే 11 భాషల్లో 15 ఆగస్ట్ 2023న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా విడుదల కానుంది. ఈ ఫీచర్ సినిమాను అగ్నిహోత్రి - పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (టాలీవుడ్ బ్యాన‌ర్) ప‌తాకంపై నిర్మిస్తున్నారు.

ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని ప్ర‌క‌టించ‌గానే ప్ర‌జ‌ల్లో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదలైంది. వివేక్ అగ్నిహోత్రి సినిమాలు హిందూయిజానికి భాజ‌పా సిద్ధాంతాల‌కు కొంత‌యినా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు `ది వ్యాక్సిన్ వార్` లో ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది? అంటూ చిన్న‌పాటి డిబేట్ మొదలైంది. నెగెటివ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుందా? అంటూ ఒక సెక్ష‌న్ సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. దీనిపై అగ్నిహోత్రి కానీ న‌టుడు కం న‌ట‌గురువు అనుప‌మ్ ఖేర్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

కొత్త సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించ‌గానే.. అనుపమ్ జీపై ప్ర‌శంస‌లు కురిసాయి. ఈరోజుల్లో సీనియ‌ర్ న‌టుడు సినిమా క‌థ‌ల‌ను చాలా చక్కగా ఎంచుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ అభిమాని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీని కోసం ఎదురుచూస్తున్నాను.... టీమ్ కు శుభాకాంక్షలు. రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ మ‌రోసారి విజ‌యం సాధిస్తాడు! అంటూ అభిమానులు పాజిటివ్ ట్వీట్ల‌తో స్పందించారు.

నిజానికి 2022 ముగింపులో (డిసెంబర్‌)లో ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. అప్ప‌ట్లోనే ఇన్ స్టాగ్రామ్ లో వివేక్ అగ్నిహోత్రి ఒక హింట్ ఇచ్చారు. ``మేం కొత్త సంగ‌తుల‌ను క‌నుగొనేందుకు జీవిస్తున్నాం. కొత్త ఆనందం.. కొత్త నవ్వులు.. కొత్త సవాళ్లు.. ఎన్ని ఉన్నా మేం పాత ప‌ద్ధ‌తిలో మాలో స్థిరపడిన భావ‌జాలానికి కట్టుబడి ఉన్నాము. ఈ వైరుధ్యం బాధను ఇస్తుంది. ఆనందాన్ని కనుగొనడానికి వేగవంతమైన క‌చ్చితమైన మార్గం చూపిస్తుంది. అనిశ్చితిలోకి వెళ‌దాం. తెలియని అలౌకిక‌ ఆనందం పొందుదాం`` అని వ్యాఖ్యానిస్తూ #CreativeConsciousness హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివ‌రాల‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఇంతకుముందు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ-``COVID19 లాక్ డౌన్ సమయంలో కాశ్మీర్ ఫైల్స్ వాయిదా పడిన క్ర‌మంలో తీరిక స‌మ‌యం చిక్కింది. నేను ఈ కొత్త కాన్సెప్టుపై పరిశోధించ‌డం ప్రారంభించాను. ఆపై మ‌న దేశంలో సొంత‌ వ్యాక్సిన్ ను సాధ్యం చేసిన ICMR & NIV శాస్త్రవేత్తలతో క‌లిసి పరిశోధన ప్రారంభించాం.

వారి పోరాటాల స్ఫూర్తి కథను.. త్యాగాల‌పై పరిశోధన చేస్తున్నప్పుడు మ‌న‌ శాస్త్రవేత్తలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్ర‌భావితం చేసే విదేశీ ఏజెన్సీల ఒత్తిళ్ల‌తోను.. దేశంలోని సొంత అధికారులు ప్రజలతో కూడా ఎలా యుద్ధం చేశారో మాకు అర్థమైంది. ఏం జ‌రిగినా కానీ అత్యంత వేగవంతమైన చౌకైన సురక్షితమైన వ్యాక్సిన్ ని తయారు చేయడం ద్వారా మ‌నం అగ్రరాజ్యాలపై గెలిచాం. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌ కథను తప్పక చెప్పాలని నేను అనుకున్నాను. తద్వారా ప్రతి భారతీయుడు తమ దేశాన్ని చూసి గర్వపడతారు`` అని వ్యాఖ్యానించారు. వివేక్ అగ్నిహోత్రి మరోసారి విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు తెర‌తీసే కాన్సెప్టును ఎంచుకున్నారు. ఇది క‌చ్ఛితంగా పాన్ ఇండియా కంటెంట్ అన‌డంలో సందేహం లేదు. తెలుగు న‌టుడు రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేసేందుకు ఆశీర్వ‌దించాల‌ని అగ్నిహోత్రి ఆకాంక్షించారు. మ‌రి ది వ్యాక్సిన్ వార్ లో చ‌ర‌ణ్ క‌నిపిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.