Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'ది వారియర్'

By:  Tupaki Desk   |   14 July 2022 5:59 PM GMT
మూవీ రివ్యూ : ది వారియర్
X
చిత్రం : 'ది వారియర్'

నటీనటులు: రామ్ పోతినేని-కృతి శెట్టి-ఆది పినిశెట్టి-నదియా-బ్రహ్మాజీ-లాల్-శరణ్య ప్రదీప్-జయప్రకాష్-అక్షర గౌడ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లింగుస్వామి

తెలుగులో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న యువ కథానాయకుడు రామ్.. తొలిసారిగా నటించిన ద్విభాషా చిత్రం 'ది వారియర్'. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి రూపొందించిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించని ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సత్య (రామ్) హైదరాబాదులో ఎంబీబీఎస్ అయ్యాక.. హౌస్ సర్జన్ పూర్తి చేయడం కోసం తన తల్లితో కలిసి కర్నూలుకు వస్తాడు. అక్కడ గురు (ఆది పినిశెట్టి) అనే రౌడీదే ఆధిపత్యం. తన తండ్రిని చంపిన వ్యక్తిని 14 ఏళ్ల వయసులో హత్య చేసి జైలుకెళ్లిన అతను.. తిరిగొచ్చాక సిటీని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. తన కళ్ల ముందు గురు మనుషులు హత్య చేయడం చూసిన సత్య.. వాళ్ల మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దీని వల్ల అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురు చేతిలో చావు దెబ్బలు తిన్న సత్య ఆ ఊరే విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ స్థితిలో అతనేం నిర్ణయం తీసుకున్నాడు.. దాని పర్యవసానాలేంటి.. గురు అఘాయిత్యాలకు అతను అడ్డుకట్ట వేయగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

యువ కథానాయకుడు రామ్ గురించి ఎవరు మాట్లాడినా.. తన ఎనర్జీ గురించి ప్రస్తావిస్తారు. మామూలు పాత్రలను కూడా తన ఎనర్జీతో ఒక స్థాయికి తీసుకెళ్లగల నైపుణ్యం అతడి సొంతం. 'ఇస్మార్ట్ శంకర్' నిజానికి అంత పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా కాదు. కానీ రామ్ యువతకు కిక్కెక్కించేలా శంకర్ పాత్రను పోషించి ఒక యుఫోరియా సృష్టించాడు. సినిమాను ఒక రేంజికి తీసుకెళ్లాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న 'రెడ్' సినిమా సైతం బాగా ఆడిందంటే అందులో రామ్ విన్యాసాలు ఒక కారణం. ఇలా చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయి.. పాత్రను.. సినిమాను తమ ఎనర్జీతో వేరే స్థాయికి తీసుకెళ్లే హీరోలు తక్కువ మంది ఉంటారు. వాళ్లకు సరైన క్యారెక్టర్ పడడం కీలకం. రామ్ కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్ర చేయడం.. తమిళంలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకర్షించిన లింగుస్వామి అతణ్ని డైరెక్ట్ చేయడంతో 'ది వారియర్' మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి.. అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ఆసక్తిని ఈ సినిమా ఎంతో సేపు నిలబెట్టకపోయింది. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది.

తన దగ్గరికి వచ్చిన పోలీస్ కథలన్నీ ఒకే రకంగా ఉండడంతో వాటి పట్ల వ్యతిరేకత పెంచుకుని.. లింగుస్వామి చెప్పిన కథ మాత్రం తెగ నచ్చేసి పోలీస్ సినిమా అంటూ చేస్తే ఇలాంటిదే చేయాలి అని ఎగ్జైట్ అయినట్లుగా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు రామ్. కానీ 'ది వారియర్' చూస్తున్నంతసేపు ఇందులో ఏం కొత్తదనం.. ప్రత్యేకత ఉందని రామ్ అంత ఎగ్జైట్ అయ్యాడో అన్న సందేహం వెంటాడుతుంది. అనగనగా ఒక పట్టణం.. ఆ పట్టణాన్ని గుప్పెట్లో పెట్టుకున్న రౌడీ.. ఎదురే లేకుండా సాగిపోతున్న ఆ రౌడీకి చెక్ పెట్టే ఒక పోలీస్.. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న పోరు.. చివరికి హీరో పైచేయి.. దశాబ్దాల నుంచి చూసి చూసి అరిగిపోయిన లైన్ ఇది. 'ది వారియర్' కూడా సరిగ్గా ఆ లైన్లోనే నడుస్తుంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ట్విస్టుంది. హీరో నేరుగా మనకు పోలీసుగా కనిపించడు. ముందు డాక్టర్ గా మనకు పరిచయం అవుతాడు. ఆ అవతారంలోనే విలన్ చేతిలో దెబ్బలు తిని.. ఆ కసితో పోలీస్ అయి తిరిగొస్తాడు. విలన్ భరతం పడతాడు. ఈ పాయింట్ దగ్గర రామ్ కొత్తదనాన్ని ఫీలయ్యాడేమో కానీ.. తెర మీద ఈ విషయాన్ని ప్రెజెంట్ చేసిన తీరు పేలవం.

మన ప్రేక్షకులకు అలవాటైన ప్రకారం మాస్ సినిమాల్లో ఒక హడావుడి కనిపించాలి. హీరో ఎంట్రీ అయినా.. ఇంట్రో సాంగ్ అయినా.. ఫైట్ అయినా.. అలాగే యాక్షన్ బ్లాక్స్ అయినా.. ఎలివేషన్ సీన్లయినా ఒక హంగామా కనిపించాలి. డైలాగులు పవర్ ఫుల్ గా ఉండాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఒక అలజడి సృష్టించాలి. కానీ 'ది వారియర్'లో అవన్నీ మిస్సయ్యాయి. సినిమా ఆద్యంతం ఏ హడావుడి.. హంగామా లేకుండా డల్లుగా నడుస్తూ.. ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. నిజానికి లింగుస్వామి స్టయిల్ ఎప్పుడూ కూడా ఇలా ఉండదు. మన తెలుగు ప్రేక్షకులు ఆదరించిన అతడి సినిమాలు రన్.. పందెం కోడి.. ఆవారా లాంటి సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ సినిమాల కథలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అంత కొత్తగా కూడా కనిపించవు. కానీ స్క్రీన్ ప్లే కొంచెం భిన్నంగా.. రేసీగా తీర్చిదిద్దుకుని.. సన్నివేశాలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడం ద్వారా మెప్పించేవాడు లింగుస్వామి. కానీ గత దశాబ్ద కాలంలో అతను టచ్ కోల్పోయాడు. సికిందర్.. పందెంకోడి-2 లాంటి చిత్రాల్లో లింగుస్వామి మార్కే కనిపించలేదు. ఇప్పుడు 'ది వారియర్'లోనూ లింగుస్వామి ఒకప్పటి ముద్ర కొరవడి నిస్సారంగా తయారైంది.

హీరో ఇంట్రో సన్నివేశాలతోనే సాదాసీదాగా కనిపించే 'ది వారియర్'.. విలన్ పాత్ర రంగప్రవేశంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. 14 ఏళ్ల వయసులోనే.. తన తండ్రిని చంపినోడి తల తీసుకొచ్చి జైలుకు పోయి.. ఆ తర్వాత తిరిగి రాగానే తన ఆస్తులన్నీ కొట్టేసిన వాడిని వణికించి అవన్నీ సొంతం చేసుకునే వ్యక్తిగా విలన్ బ్యాక్ స్టోరీని బాగానే చూపించాడు లింగుస్వామి. తాను ఒక మనిషిని చంపగానే అందుకు బదులుగా ఒక మొక్క నాటే అతడి స్టైల్ కూడా ఆకట్టుకుంటుంది. ఇలా విలన్ని కొంచెం కొత్తగా.. శక్తివంతంగా చూపించేసరికి హీరోతో అతడి పోరు మీద చాలా ఆశలు పెట్టుకుంటాం. కానీ హీరో వైపు నుంచి మాత్రం కథ నిస్సారంగా నడుస్తుంది. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ నీరసం తెప్పించేస్తే.. అతను డాక్టర్ నుంచి పోలీస్ గా మారే క్రమాన్ని కూడా చాలా సాధారణంగా చూపించాడు లింగుస్వామి. ఇక ద్వితీయార్ధంలో హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులు కూడా రసవత్తరంగా ఏమీ లేవు. చాలా సినిమాల్లో చూసిన సీన్లే ఇక్కడా చూస్తాం. ప్రేక్షకులను ఉద్రేక పరిచే బలమైన ఎపిసోడ్ ఒక్కటీ లేకపోయింది. ఏం జరుగుతుందనే ఉత్కంఠకు అవకాశమే లేక.. చివరికి హీరో-విలన్ మధ్య ఒక మామూలు యాక్షన్ సీన్ తో ముగుస్తుంది 'ది వారియర్'. పోలీస్ పాత్రలో రామ్ అనగానే హై ఓల్టేజ్ యాక్షన్-ఎమోషన్.. లింగుస్వామి సినిమా అనగానే బలమైన హీరో-విలన్ పోరు ఆశించిన వారికి 'ది వారియర్' నిరాశనే మిగులుస్తుంది.

నటీనటులు:

రామ్ పోలీస్ పాత్ర కోసం మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. కానీ లుక్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. ఆ పాత్రలో అతను ఆశించినంత పవర్ ఫుల్ గా కనిపించలేదు. రామ్ ఎనర్జీని దర్శకుడు ఎంతమాత్రం ఉపయోగంచుకోకపోవడంతో పోలీస్ పాత్ర నిస్సారంగా తయారై రామ్ ఇందులో మిస్ ఫిట్ అయ్యాడేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందుకు రామ్ ను నిందించడానికేమీ లేదు. డాక్టర్ పాత్రలో అయితే రామ్ మరీ మామూలుగా కనిపించాడు. డ్యాన్సులు.. ఫైట్ల వరకు రామ్ ఎనర్జీ కనిపించినా.. ఓవరాల్ గా అతడి పాత్రలో ఉండాల్సినంత ఫైర్ లేకపోయింది. హీరోయిన్ కృతి శెట్టిలో నటన పరంగా ఉన్న బలహీనతలు సినిమా తర్వాత సినిమాకు బయటికి వచ్చేస్తున్నాయి. ఆమె ముఖంలో అసలు హావభావాలే పలకలేదు. తెరపై ఆమె చాలా డల్లుగా కనిపించింది. గ్లామర్ పరంగా కూడా ఆమె అంతగా ఆకట్టుకున్నది లేదు. సినిమాలో పాత్ర-నటన పరంగా కొంచెం ప్రత్యేకత చాటుకున్నది ఆది పినిశెట్టి ఒక్కడే. విలన్ పాత్రలు చేయడంలో తనకున్న నైపుణ్యాన్ని అతను మరోసారి చూపించాడు. తన లుక్.. ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఆ పాత్ర కూడా పెద్ద బిల్డప్ తో మొదలై.. తర్వాత చల్లబడిపోయింది. నదియా హీరో తల్లి పాత్రలో అలవాటైన రీతిలో నటించింది. బ్రహ్మాజీ.. జయప్రకాష్.. లాల్.. శరణ్య ప్రదీప్.. వీళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

'ది వారియర్' లాంటి మాస్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. మాస్.. యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయాల్సింది.. సినిమాలో ఒక హడావుడి ఉండేలా చూడాల్సింది నేపథ్య సంగీతంతోనే. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓవైపు తమన్.. మరోవైపు అనిరుధ్ లాంటి సంగీత దర్శకులు బీజీఎంతో మామూలు సినిమాలను కూడా నిలబెడుతుంటే.. దేవిశ్రీ ప్రసాద్ 'ది వారియర్'లో కాస్త విషయం ఉన్న సీన్లను కూడా డల్ బీజీఎంతో నిస్సారంగా తయారు చేశాడు. పాటలు కూడా ఉండాల్సిన స్థాయిలో లేవు. బుల్లెట్ సాంగ్ ఓ మోస్తరుగా అనిపిస్తుంది తప్ప.. మిగతావి ఏవీ హుషారు తెప్పించవు. సుజీత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగుల్లో మెరుపులు కనిపించలేదు. ఆయన ఎగ్జైట్ అయ్యే స్క్రిప్టును లింగుస్వామి ఇవ్వలేదన్నది స్పష్టం. కథ పరంగా చూసినా.. స్క్రీన్ ప్లే విషయంలో చూసినా లింగుస్వామి ఒకప్పటి మెరుపులు ఇందులో ఏమాత్రం కనిపించలేదు. ఆయన ఫాంలో లేని విషయం అడుగడుగునా కనిపిస్తుంటుంది. ఏవో కొన్ని సీన్లలో మినహాయిస్తే లింగుస్వామి రచయితగా.. దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయాడు.

చివరగా: ది వారియర్.. నో పవర్

రేటింగ్-2.25/5