Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' పై థియేటర్ యజమానుల ఆగ్రహం..!

By:  Tupaki Desk   |   20 Aug 2021 12:20 PM GMT
టక్ జగదీష్ పై థియేటర్ యజమానుల ఆగ్రహం..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదల అవుతున్న సెప్టెంబర్ 10వ తేదీనే నాని చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' నిర్ణయంపై ఎగ్జిబిటర్లు థియేటర్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

'టక్‌ జగదీష్‌' ఓటీటీ రిలీజ్‌ పై చర్చించేందుకు ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం థియేటర్ల యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'లవ్‌స్టోరీ' సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్న రోజే 'టక్ జగదీష్' ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని.. దీని వల్ల నిర్మాతలు ఎగ్జిబిటర్స్ అందరూ నష్టపోతామని అన్నారు. భవిషత్తులో ఇలానే చేస్తే నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని హెచ్చరించారు.

అలానే పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయొద్దని.. దీనిపై నిర్మాతలు ఆలోచించుకోవాలని సూచించారు. 'టక్‌ జగదీశ్‌' నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ.. 'లవ్ స్టోరీ' విడుదలకు థియేటర్ల యజమానులు మద్దతు పలికారు. 'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ సినిమా లేకుండా మనం లేమని.. సినిమా మన సంస్కృతిలో భాగం అని నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీలో సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా థియేటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ నోట్ ని మీడియాకు విడుదల చేసింది. ''OTT సమస్యపై చర్చించడానికి తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈరోజు (20-08-2021) జనరల్ బాడీ మీటింగ్‌ కు పిలుపునిచ్చింది. ఓటీటీ రిలీజ్ చేసుకునే నిర్మాతలు అక్టోబర్ 2021 వరకు వేచి ఉండమని మేము అభ్యర్థించాము. ఆ తర్వాత కూడా థియేటర్లు తెరవకపోతే వారు మా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా OTT విడుదల చేసుకోవచ్చు. దీన్ని హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాము''

'లవ్ స్టోరీ' చిత్ర నిర్మాతలు తమ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 'టక్ జగదీష్' చిత్ర నిర్మాతలు తమ చిత్రాన్ని అదే తేదీన అమెజాన్ ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు మా అసోసియేషన్ దృష్టికి వచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలందరూ మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. పండుగలు మరియు వారాంతాల్లో కనీసం OTT లో సినిమాలను విడుదల చేయకూడదు. లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ తమ భవిష్యత్తు కార్యాచరణను ప్లాన్ చేస్తారు అని థియేటర్ అసోసియేషన్ ప్రకటనలో పేర్కొన్నారు.