Begin typing your search above and press return to search.

తూ.గో. జిల్లాలో ఈ నెల 16న థియేటర్స్ బంద్..?

By:  Tupaki Desk   |   14 April 2021 5:30 PM GMT
తూ.గో. జిల్లాలో ఈ నెల 16న థియేటర్స్ బంద్..?
X
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఏదైనా పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా టికెట్లు పెంచుకోవడం అలవాటుగా వస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ పేరు చెప్పి సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్న విధానాన్ని అడ్డుకుంటూ జీవో జారీ చేసింది. కొత్త సినిమాల విడుదల సమయంలో ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకోవడాన్ని ప్రభుత్వం నిరాకరిస్తూ.. టికెట్ రేట్లు పెంచితే కఠిన చర్యలు తప్పవని తేల్చేసింది. ఏపీ హైకోర్టు సైతం టికెట్ రేట్స్ పెంచడాన్ని అనుమతించలేదు. దీంతో ఇకపై రిలీజ్ అయ్యే సినిమాలు సినిమాటోగ్రఫీ యాక్ట్ కు లోబడి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు టికెట్స్ అమ్మాల్సి వుంటుంది. అయితే ప్రభుత్వ జీవోకి నిరసనగా తూర్పు గోదావరి జిల్లాల్లోని థియేటర్స్ మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా థియేటర్ యాజమాన్యాలు ఏప్రిల్ 16న సినిమా హాళ్లు మూసేయలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో సినిమాలను ప్రదర్శిస్తే విద్యుత్ చార్జీలు - వీపీఎఫ్ ఖర్చులు కూడా తిరిగి పొందలేమని వారు అంటున్నారట. ఈ జీవో వల్ల చాలా నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని, అందుకే దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న థియేటర్లను మూసి వేస్తున్నారట. కాగా, ఏపీలో టికెట్ రేట్ల పెంపును నియంత్రిస్తూ విడుదల చేసిన జీవో ప్రకారం.. గ్రామ పంచాయితీలు - నగర పంచాయితీయులు - మున్సిపాలిటీలను బట్టి ఏసీ - నాన్ ఏసీ థియేటర్లలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించిందనే విషయం తెలిసిందే.