Begin typing your search above and press return to search.

ఏపీలో టిక్కెట్టు పెంపు కాయా పండా? ప్ర‌భుత్వంతో నేటి భేటీ ఏం తేల్చింది?

By:  Tupaki Desk   |   26 July 2021 1:30 PM GMT
ఏపీలో టిక్కెట్టు పెంపు కాయా పండా?  ప్ర‌భుత్వంతో నేటి భేటీ ఏం తేల్చింది?
X
నిశ్చ‌లంగా ఉన్న త‌టాకంలోకి రాయి విసిరితే ఎలా ఉంటుందో ఇప్పుడు టిక్కెట్ పైకి ఏపీ సీఎం జ‌గ‌న్ విసిరిన రాయి అలానే త‌గిలింది. ఏపీలో మొద‌లైన ప్ర‌కంప‌నం పొరుగున ఉన్న తెలంగాణను ఊపేస్తోంది. ఏపీలో పెంచ‌క‌పోతే ప‌రిశ్ర‌మ దిశాళా తీస్తుంద‌న్న ఆందోళ‌న తెలంగాణ ఛాంబ‌ర్ లోనూ నెల‌కొంది. దీంతో ఏపీ సీఎం జ‌గ‌న్ కి లేఖ‌ను కూడా రాశారు. కానీ ఏం లాభం.. ప్ర‌భుత్వంతో ప‌లుమార్లు సంప్ర‌దింపుల పేరుతో క‌ల‌వాల‌ని చూసినా అయ్య‌వారు క‌నిక‌రించ‌లేద‌నే గుస‌గుస వినిపిస్తోంది.

కానీ టిక్కెట్టు రేటు పెంచ‌క‌పోతే ఎగ్జిబిష‌న్ రంగం దారుణ ప‌రిణామాల్ని చ‌వి చూడ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త‌గ్గించిన టిక్కెట్టు రేట్లు పెంచేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌సేమిరా అంటోంది. ఇదే క్ర‌మంలో 26 జూలై ఎగ్జిబిట‌ర్లు ఏపీ ప్ర‌భుత్వానికి విన్న‌వించేందుకు విజ‌య‌వాడ‌లో తిష్ఠ వేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం అపాయింట్ మెంట్ దొరికిందో లేదో.. అస‌లు వీళ్ల‌ను అక్క‌డ ప‌ట్టించుకున్నారో లేదో! అంటూ చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే ఏపీ సీఎం సంగ‌తి తెలిసిన కొంద‌రు నిర్మాత‌లు మాత్రం పూర్తిగా నిరాశ‌లో ఉన్నార‌ట‌. అందుకే రిలీజ్ మోడ‌ల్ ని మార్చి ఏపీలో కొన్నిటికి రిలీజ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. మ‌ల్టీప్లెక్సులు అలాగే ప్రైమ్ ఏరియాలోని కొన్ని సింగిల్ థియేట‌ర్ల‌ను మాత్ర‌మే ఓపెన్ చేసి ఊరికి దూరంగా ఉన్న వాటిని తెర‌వ‌కుండా వ‌దిలేస్తున్నార‌ని ఏపీ వ్యాప్తంగా ఇది అమ‌లవుతోంద‌ని తెలిసింది.

ఇక‌పై థియేట‌ర్ల‌కు జ‌నం వ‌చ్చే తీరును బ‌ట్టే థియేట‌ర్లు ర‌న్ అవుతాయి. అస‌లు రెవెన్యూ ఎలా ఉంది? మినిమంగా గిట్టుబాటు అవుతోందా లేదా థియేట‌ర్ల మెయింటెనెన్స్ కి అయినా వ‌స్తుందా లేదా? ఇలా లెక్క‌లు వేసుకుని ఈ థియేట‌ర్ల‌ను తెరుస్తున్నార‌ట‌.

తెరిచిన వాటిలో ముందుగా చిన్న సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఇష్క్.. తిమ్మ‌రుసు చిత్రాల‌తో ప్ర‌యోగం మొద‌లు పెట్టారు. ఈ సినిమాల‌కు వ‌చ్చే రెవెన్యూ ఆధారంగా ఇతర మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల విడుదల తేదీలు నిర్ణ‌యిస్తార‌ట‌. ప్ర‌స్తుతానికి తెలంగాణ‌లో ఫుల్ గా అన్ని థియేట‌ర్లు అందుబాటులో ఉన్నాయి కాబ‌ట్టి ఇక్క‌డ ఈ చిన్న సినిమాలు రిలీజై ఆడ‌తాయి. ఏపీలో అందుబాటులో ఉన్నంత వ‌ర‌కూ స‌రిపెట్టుకుంటార‌ట‌. ఇష్క్ సినిమా కోసం ఎన్వీ ప్ర‌సాద్ లాబీయింగులు చేసి థియేట‌ర్ల‌ను తెరిపించుకోవాల్సొచ్చింది. రెవెన్యూ షేరింగ్ మోడల్ ను కూడా మార్చారట‌. ఉత్త‌రాంధ్ర‌.. సీడెడ్ లో అవ‌కాశాన్ని బ‌ట్టి రిలీజ్ చేసి రెవెన్యూ మోడ‌ల్ ని మారుస్తున్నార‌ట‌.

ఎస్.ఆర్. క‌ళ్యాణ మంట‌పం .. మ‌రో మూడు నాలుగు చిన్న సినిమాలు వెయిటింగులో ఉన్నాయి. తొలిగా తిమ్మ‌రుసు- ఇష్క్ చిత్రాల రిజ‌ల్ట్ ని ప‌రిశీలించి వీటికి సంబంధించిన‌ నిర్ణ‌యం తీసుకుంటారు. ఇక ఈ సినిమాల రిజ‌ల్ట్ ని బ‌ట్టి ఆడియెన్ మైండ్ సెట్ ఎలా ఉందో ప‌రిశీలించి మ‌రీ మీడియం రేంజు చిత్రాల‌ను రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ తో ఉన్నారు.

జ‌నం ఇంకా థ‌ర్డ్ వేవ్ భ‌యాల‌తో ఉన్నారా లేదా? అన్న‌ది వీటితో తేల్తుంది. త‌దుప‌రి నాని టక్ జగదీశ్,.. నాగ‌చైత‌న్య‌ లవ్ స్టోరీ లాంటి సినిమాలు థియేటర్లలోకి వస్తే ఊపు ఎలా ఉంటుందో కూడా చూస్తారు. ఆచార్య- రాధేశ్యామ్ ఈ సీజ‌న్ లో రిలీజ్ కి రావాల్సి ఉన్న క్రేజీ చిత్రాలు. అక్టోబ‌ర్ లో ఆర్.ఆర్.ఆర్ వ‌స్తుంది. వీటితో పాటే కేజీఎఫ్ రిలీజ్ కూడా ఉంటుంది. వీటితో పూర్తిగా జ‌నాల్ని థియేట‌ర్ల‌కు త‌ర‌లించాల‌న్న‌ది ప్లాన్.

అయితే ఆర్డ‌ర్ బావుంది కానీ.. థ‌ర్డ్ వేవ్ ముప్పు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఒక పెనుస‌వాల్ కాగా.. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు వ్య‌వ‌హారం అంత‌కుమించి అన్న‌ట్టుగా ఉంది. క‌నీసం టిక్కెట్టు ధ‌ర‌ల వెసులుబాటు క‌ల్పించినా పాన్ ఇండియా సినిమాలు బ‌య‌ట‌ప‌డేందుకు ఛాన్సుంటుంది. కానీ ఆ దిశ‌గా చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం అయ్యేదెప్పుడు? అన్న‌దే స‌స్పెన్స్ ఎలిమెంట్ గా మారింది. ఏపీలో టిక్కెట్టు పెంపు కాయా పండా? ప్ర‌భుత్వంతో నేటి భేటీ ఏం తేల్చింది? అన్న‌దానికి కాల‌మే స‌మాధాన‌మివ్వాలి.

ఇప్ప‌టికైతే ఏపీలో సింగిల్ థియేట‌ర్ల‌లో రూ.20.. రూ.30 టిక్కెట్టు ధ‌ర‌ల‌తో సినిమాల్ని ఆడించ‌డం చాలా ఇబ్బందిక‌రం అన్న‌ది ఎగ్జిబిట‌ర్లు చెబుతున్న మాట‌. సీఎం జ‌గ‌న్ ని బ‌తిమాలేందుకు అస‌లైన సినీపెద్ద‌లు క‌దిలి వెళితేనే కానీ ... ఏదీ తేల‌ద‌ని భావిస్తున్నారు.