Begin typing your search above and press return to search.
స్పైడర్ మ్యాన్ కొత్త ట్రైలర్ వచ్చేసింది
By: Tupaki Desk | 10 Dec 2016 11:00 AM GMTమనిషికి అద్భుత శక్తులు వచ్చేసి.. ఎక్కడెక్కడో విహరించేసినట్లు సినిమాల్లో చూపిస్తే.. జనాలకు భలే ఆనందం. దశాబ్దాలుగా ఈ ఫార్ములాతో హాలీవుడ్ వాళ్లు వందలు వేల కోట్లు కొల్లగొట్టారు. హలీవుడ్లో ఈ తరహా ఫ్రాంఛైజ్ మూవీస్ చాలా వచ్చాయి. అందులో ‘స్పైడర్ మ్యాన్’ కూడా ఒకటి. స్పైడర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్-2.. స్పైడర్ మ్యాన్-3.. అమేజింగ్ స్పైడర్ మ్యాన్.. ఇలా ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఈ సినిమాలు రిలీజైనపుడల్లా బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. చివరగా 2014లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్-2 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ‘స్పైడర్ మ్యాన్- హోమ్ కమింగ్’ త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయిందంతే. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది.
జాన్ వాట్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత సిరీస్ చిత్రాల కంటే అద్భుతమైన విన్యాసాలతో ప్రేక్షకులను అలరించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో స్పైడర్ మేన్ పాత్రలో 20 ఏళ్ల కుర్రాడు టామ్ హాలండ్ నటిస్తున్నాడు. స్పైడర్ మ్యాన్ చిత్రాలకు అతను కొత్త. ఇంతకు ముందు టామ్ హాలండ్ ది హార్ట్ ఆఫ్ ది సీ.. కెప్టెన్ అమెరికా-సివిల్ వార్ చిత్రాల్లో నటించాడు. ‘ఐరన్ మ్యాన్’ ఫేమ్.. రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మార్వెల్ స్టూడియోస్.. కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కొత్త ఏడాదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.