Begin typing your search above and press return to search.

వారి ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి: చిరంజీవి

By:  Tupaki Desk   |   19 Nov 2021 12:35 PM GMT
వారి ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి: చిరంజీవి
X
తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించి పోవడమే కాకుండా.. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం తన మనసును కలచి వేస్తోందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

చిరంజీవి ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేస్తూ.. ''గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను'' అని పేర్కొన్నారు.

మంచు లక్ష్మి సైతం తిరుపతి వరదలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తిరుపతి, తిరుమలలో పరిస్థితులు అతలాకుతలంగా మారాయని.. ఇప్పట్లో తిరుపతికి వెళ్లొద్దని ఆమె ప్రజలను కోరారు. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలియజేసే ఓ వీడియోని ఫొటోలను షేర్ చేసింది. 'ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోండి. పరిస్థితులు చక్కబడే వరకూ దయచేసి కొన్నిరోజులపాటు ఎవరూ బయటకు రావద్దు. అక్కడ రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించారు' అని మంచు లక్ష్మి తెలిపారు.

ఇకపోతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని విధాలా సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. వర్షాలతో తిరుపతిలో చిక్కుపోయిన భక్తులకు శ్రీనివాసం - మాధవరం వంటి సత్రాల్లో అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. దర్శన టికెట్లు ఉండి, వర్షాల కారణంగా రాలేకపోయిన వారికి పరిస్థితులు చక్కబడిన తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఈఓ తెలిపారు.