Begin typing your search above and press return to search.

ఓటీటీలకూ తప్పని మనోభావాల గోల..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 2:00 PM GMT
ఓటీటీలకూ తప్పని మనోభావాల గోల..!
X
సినిమాల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వివాదం చేయడం ఈ మధ్య బాగా ఎక్కువైంది. స్టోరీ విషయంలోనో.. టైటిల్ విషయంలోనో.. పాత్రల విషయంలోనో.. పాత్రధారి పేరు విషయంలోనో.. షూటింగ్ జరిగే ప్లేస్ విషయంలోనో ఇలా ఏదొక విధంగా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి వివాదాలు అన్ని బాషల సినిమాలకి ఎదురవుతున్నప్పటికీ మన సౌత్ సినిమాల విషయంలో కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే ఇన్నాళ్లూ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలు జరిగితే ఇప్పుడు ఓటీటీలకు కూడా మనోభావాల సెగ తగులుతోంది. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'మకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) సినిమా కారణంగా తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయని.. సినిమా విడుద‌ల ఆపాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి.

'అమ్మోరు తల్లి' సినిమాలో నయనతార టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు. నయన్ పోషించిన అమ్మవారి పాత్ర ద్వారా హిందూ భక్తులని తిట్టించడం హిందువుల మనోభావాలు కించపరిచడమే అని కొందరు ఆందోళన చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని.. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీని కోసం లీగల్ గా వెళ్లడానికి కూడా రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇంటర్నేషనల్ ఓటీటీల మీద కేసులు వేయాలంటే అంత ఈజీ కాదనే చెప్పాలి.

ఏదేమైనా మనోభావాల విషయంలో సౌత్ వాళ్లకి నార్త్ వాళ్లకి కాస్త తేడా ఉంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో 'పీకే' సినిమాలో హిందూ మ‌తంలో ఉన్న మూఢ నమ్మ‌కాలు.. బాబాల మోసాలు పై ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తే ఆ సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేశారు. అలానే ఇటీవల క్రైస్త‌వ మతంలో ఉన్న పాస్ట‌ర్ల మోసాల‌ను కామెడీ చేసి చూపించిన మలయాళ సినిమా 'ట్రాన్స్' అన్ని భాష‌ల్లో విశేష స్పంద‌న తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో సినిమాని సినిమాగా చూసి.. సినిమా నుంచి మంచిని మాత్రమే గ్రహించే రోజులు వస్తాయేమో చూడాలి.