Begin typing your search above and press return to search.

మరో పెద్ద సినిమాని దెబ్బేసిన 'కాశ్మీర్ ఫైల్స్'

By:  Tupaki Desk   |   22 March 2022 7:30 AM GMT
మరో పెద్ద సినిమాని దెబ్బేసిన కాశ్మీర్ ఫైల్స్
X
"ది కశ్మీర్ ఫైల్స్" సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.

1990లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీపై ఇప్పుడు కాశ్మీరు నుంచీ కన్యాకుమారి వరకు చర్చ జరుగుతోంది. అయితే చిన్న సినిమాగా విడుదలైన 'కాశ్మీర్ ఫైల్స్'.. రెండు పెద్ద చిత్రాలను దెబ్బేసింది.

పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' సినిమా రిలీజైన రోజునే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ సినిమాకున్న క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ రాగా.. ఎలాంటి ప్రమోషన్స్ లేని కశ్మీర్ ఫైల్స్ కు ఫస్ట్ డే తక్కువ వసూళ్ళు వచ్చాయి.

అయితే ఊహించని విధంగా "ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం రెండో రోజు నుంచి భారీ వసూళ్ళు అందుకుని అపూర్వమైన విజయాన్ని సాధించింది. దీని దెబ్బకు 'రాధే శ్యామ్' సినిమా పరాజయం పాలైంది.

'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ఇప్పుడు 'బచన్ పాండే' సినిమాపై కూడా అదే ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం విడుదలైన అక్షయ్ కుమార్ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఓపెనింగ్ డేలో 13 కోట్లకు పైగా వసూలు చేసింది.

కాకపోతే ఆ తర్వాత వారాంతంలో బచ్చన్ పాండే సినిమా పెద్దగా రాబట్టలేకపోయింది. రివ్యూలను వీకెండ్ లో మరింత కలెక్ట్ చేస్తుందని భావించగా.. శని వారం 12 కోట్లు మరియు ఆదివారం 12 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వసూళ్లపై 'ది కాశ్మీర్ ఫైల్స్' ఎఫెక్ట్ పడిందని స్పష్టంగా కనిపిస్తోంది.

వచ్చే శుక్రవారం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో బచ్చన్ పాండే వసూళ్లకు ఈ నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ నుంచి పోటీ ఎదుర్కోక తప్పదు.

కాగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాశ్మీరీ పండిట్లపై లోయలో జరిగిన అమానుష దాడుల్ని 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించారు.

దీనిపై సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా వాస్తవాలకు దూరంగా ఉందని విమర్శించారు. ఏదైతేనేం 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా రెండు పెద్ద సినిమాలను తట్టుకుని కూడా బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచిందని చెప్పవచ్చు.