Begin typing your search above and press return to search.

'శేఖర్' సినిమా వెనుక ఎన్నో కలలు.. కష్టాలు ఉన్నాయి: జీవిత

By:  Tupaki Desk   |   18 May 2022 2:59 AM GMT
శేఖర్ సినిమా వెనుక ఎన్నో కలలు.. కష్టాలు ఉన్నాయి: జీవిత
X
జీవితకి కథాకథనాలపై మంచి పట్టుంది .. దర్శకత్వంలో మంచి అనుభవం ఉంది. గతంలో రాజశేఖర్ చేసిన కొన్ని సినిమాలకి ఆమె దర్శకత్వం వహించారు. అలాగే ఈ సారి కూడా ఆయన 'శేఖర్' సినిమాకి ఆమెనే దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లకు రానుంది. మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. రాజశేఖర్ సరసన ముస్కాన్ .. ఆత్మీయరాజన్ కథానాయికలుగా నటించారు. ఒక కీలకమైన పాత్రను సముద్రఖని పోషించారు.

నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత మాట్లాడుతూ .. "అందరూ కూడా జీవిత అంటే ఐరన్ లేడీ అనుకుంటారు .. కానీ నిజానికి అలాంటిదేం లేదు. ఇక్కడున్న మీ అందరి మాదిరిగానే నేను కూడా.

నాకు ఊహతెలిసిన దగ్గర నుంచి జీవితంలో పోరాడుతూనే వచ్చాను. ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. నేను ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు .. నాకు చేతనైతే సాయం చేశాను. అలాగే నాక్కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఒకరికి ఒకరు చేయూతనిస్తే ఈ ప్రపంచంలో అందరం బాగుంటాం.

ఎంతో మంచి మనసుతో మీరంతా ఇక్కడికి వచ్చారు. మీరందరి రాక .. మీ అందరి మంచి మాటలు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. కోవిడ్ తరువాత సినిమాలకు జనాలు రావడం, లేదని చాలామంది భయపెట్టేస్తున్నారు.

సినిమా తీయడం ఒక ఎత్తయితే ఆ సినిమాను రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఆ తరువాత ఆ సినిమా ఆడుతుందా లేదా .. మనం పెట్టిన డబ్బులు మనకి వస్తాయా? అనేది మరో టెన్షన్. కానీ ఒకటి చెప్పగలను .. ఇది చాలా మంచి సినిమా.

మంచి సినిమాలను మీరు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. టికెట్ల రేటు విపరీతంగా పెంచడం వలన చాలామంది థియేటర్లకు రావడం లేదని నేను విన్నాను. పెద్ద సినిమాలకి టికెట్ల రేటు పెంచుకోక తప్పదు. మాది చిన్న సినిమా .. మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడం లేదు. టికెట్ రేట్లు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ సినిమా వెనుక ఎన్నో కలలు ఉన్నాయి .. ఎన్నో కష్టాలు ఉన్నాయి. మీరంతా వచ్చి ఈ సినిమాను సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.