Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 5' కోసం రెండింతల బడ్జెట్.. ప్రైజ్ మనీ కూడా డబుల్..?

By:  Tupaki Desk   |   9 July 2021 1:30 PM GMT
బిగ్ బాస్ 5 కోసం రెండింతల బడ్జెట్.. ప్రైజ్ మనీ కూడా డబుల్..?
X
ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో లలో 'బిగ్ బాస్' ముందు వరుసలో ఉంటుంది. పలు భారతీయ భాషల్లో ప్రజాదరణ పొందిన ఈ షో.. 2017లో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయింది. 'స్టార్ మా' నిర్వహణలో ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి మూడు సీజన్లు జూన్ లేదా జూలై నెలల్లో ప్రారంభం అయ్యాయి. అయితే గతేడాది మాత్రం కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 4' సెప్టెంబర్ నెలలో మొదలై 106 రోజుల పాటు ఎంటర్టైన్ చేసింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ - జూలై లలోనే నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడి మళ్ళీ గతేడాది పరిస్థితులు పునరావృతం అయ్యేలా చేసింది.

ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ 5' ని సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈసారి కూడా సినిమా తారలు - టీవీ యాంకర్లు - సోషల్ మీడియా సెలబ్రిటీలు 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు కాబోతున్నారని తెలుస్తోంది. కాకపోతే ఐదో సీజన్ ను మరింత స్పెషల్ గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ 'బిగ్ బాస్' సెట్ వేయడమే కాకుండా.. ఈ సీజన్ కోసం రెట్టింపు బడ్జెట్ ను కేటాయిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో ఈసారి పాపులర్ స్టార్స్ తో పాటుగా గ్లామర్ కూడా ఎక్కువ ఉంటుందట. బిగ్ బాస్ థీమ్ తో పాటుగా టాస్క్ లు కూడా సరికొత్తగా ఉంటాయట.

అలానే 'బిగ్ బాస్' విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ని కూడా పెంచుతున్నారని.. గతేడాదికి డబుల్ ఉండొచ్చని టాక్. అంతేకాదు శని ఆది వారాలు జరిగే ఎలిమినేషన్ ఎపిసోడ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. పూణే లో జరిగిన మొదటి సీజన్ మినహా.. ప్రతి సీజన్ లోనూ ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం ఒకరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతూ వచ్చింది. దీని వల్ల ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పోతుంది. అందుకే 'బిగ్ బాస్ 5' కోసం స్పెషల్ టీమ్ పెట్టి లీకు రాయుళ్లకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా 'బిగ్ బాస్ 5' కోసం 'స్టార్ మా' బృందం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని సమాచారం. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ నుంచి దాదాపు వంద మందిని ఫిల్టర్ చేయగా.. సెకండ్ రౌండ్ కి సుమారు 50 మంది క్వాలిఫై అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారి హోస్ట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. గత రెండు సీజన్స్ కు సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున ఐదో సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా ఉంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు కూడా అదే ఫిక్స్ అయ్యారు. కానీ గత కొన్ని రోజులుగా నాగ్ సీజన్-5 కి అందుబాటులో ఉండటం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'భల్లాల దేవుడు' రానా దగ్గుబాటి పేరు తెర పైకి వచ్చింది. ఇప్పటికే రానా హోస్టుగా పలు షో లు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు 'బిగ్ బాస్ 5' ను కూడా రానా నడిపించగలడని నిర్వాహకులు భావిస్తున్నారట. మరి త్వరలోనే బిగ్ బాస్ హోస్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.