Begin typing your search above and press return to search.

'పూరీ మాటల్లో ధర్మం ఉంది'

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:30 AM GMT
పూరీ మాటల్లో ధర్మం ఉంది
X
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో నష్టపోయిన బయ్యర్లు మరియు దర్శక నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. పూరీ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్న ఓ సందేశం చక్కర్లు కొడుతుండగా.. ఎగ్జిబిటర్లను ఉద్దేశిస్తూ పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో 'లైగర్' సెటిల్ మెంట్ వ్యవహారంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ''ఆ ఆడియోలో పూరీ మాట్లాడింది ధర్మమే. ఆయన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కొనమన్నారు?. ఆయన ఎవరి ఇంటికి వెళ్లి సినిమాను కొనుగోలు చేయాలని బ్రతిమాల లేదు కదా. అధిక రేట్లకు సినిమా కొనుక్కుంటారు.. ఆ తర్వాత డబ్బులు పోయాయని అనుకుంటారు. హీరో విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఎంత మొత్తంలో వసూళ్లు రాబట్టాయో లెక్కలు చూసుకొని.. సినిమాని తీసుకోవాలి. అదేమీ లేకుండా అంతంత రేట్లు పెట్టి సినిమా కొని.. ఇప్పుడు పోయాయని అంటే ఎవరు బాధ్యులు?'' అని ప్రశ్నించారు.

''ఇక్కడ ఎక్కువ రేటు పెట్టి సినిమాను కొనుక్కున్న వాళ్లదే తప్పు. ఒక ప్రోడక్ట్ ని అమ్మేవాడు ఇంతకు ఇస్తానని అంటాడు. ఇష్టం లేకపోతే మానేయాలి. అంతేకానీ ఇష్టపడి కొనుక్కున్నాక, మేము నష్టపోయాం తిరిగి డబ్బులు ఇవ్వమనడం ఎందుకు?. డబ్బులు వస్తే నువ్వేం ఇవ్వవు కదా?. రిస్క్ చేసావ్. అంత మొత్తంలో సినిమాను కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి'' అని తమ్మారెడ్డి అన్నారు.

''లాభాలు వస్తాయని అందరూ పెద్ద సినిమాలనే కొనుక్కుంటారు. కొన్నప్పుడు నష్టం వచ్చినప్పుడు భరించాలి కదా. నష్టం వస్తే వెంటబడటం ఎందుకు?. మనం కొనకపోతే వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. రిలీజ్ చేసుకోలేని పరిస్థితి వాళ్లకు లేద. ఏదో వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. సినిమాని తీసుకునేప్పుడు ఆబ్లిగేషన్.. మళ్ళీ డబ్బులు అడిగేటప్పడు బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా?. ఇది ఒకరకంగా బ్లాక్ మెయిలే. అడిగే హక్కు లేదు కాబట్టి అది బ్లాక్ మెయిలే అవుతుంది''

''రికవరబుల్ అడ్వాన్స్ అయితే అడగకపోయినా ఆటోమేటిక్ ఇవ్వాలి. నాన్ రికవరబుల్ అడ్వాన్స్ ఐతే అంత వరకూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆపైన వస్తే షేరింగ్ ఉంటుంది. కమిషన్ తీసుకొని బ్యాలెన్స్ ఇస్తారు. అంతకంటే తక్కువ వస్తే రికవర్ ఉండదు. ఇక్కడ ఎక్కువ రేటును నాన్ రికవరబుల్ అడ్వాన్స్ గా ఇవ్వడం తప్పు. మనం తప్పు చేసి ఎదుటివాడిని అడగడం కరెక్ట్ కాదు. మామూలుగా థియేటర్ ఓనర్ కు డైరెక్టర్ కు నేరుగా సంబంధం ఉండదు. థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ ఇస్తారు. అందంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ థియేటర్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలియడం లేదు''

''ఏదేమైనా ఇది మోరల్ - ఎథిక్స్ కు సంబంధించిన ఇష్యూ.. డిమాండ్ చేసే సమస్య కాదు. లీగల్ అయితే ఈయన ఇవ్వక్కర్లేదు.. వాళ్ళు అడక్కూడదు. కాకపోతే నన్ను నమ్మి సినిమా కొన్నారు.. ఎంతో కొంత ఇవ్వాలని అనుకోవడం ఇతని మొరాలిటీ. అన్నాడు కాబట్టి అతను ఇచ్చింది తీసుకోవడం ధర్మం. సరిపోదు ఇంకొంచం ఇవ్వండని అడగడంలో తప్పులేదు. అంతేకానీ ధర్నాలు చేస్తాం.. స్ట్రైకులు చేస్తాం.. ఆఫీస్ లో కూర్చుంటాం అనడం కరెక్ట్ కాదు. అది తప్పు'' అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

అంతకముందు పూరీ జగన్నాథ్ తీసిన 'నేనింతే' సినిమా విషయంలో కూడా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ధర్నాకు దిగారని.. ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేసి హడావిడి చేసారని భరద్వాజ తెలిపారు. 'ఆచార్య' సినిమా విషయంలోనూ కొందరికి తిరిగి చెల్లింపులు చేసినట్లుగా తెలిసిందని అన్నారు. మొత్తం మీద 'లైగర్' విషయంలో చట్టప్రకారం చూసుకుంటే బయ్యర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరీకి లేదని సీనియర్ ఫిలిం మేకర్ స్పష్టం చేశారు.

కాగా, పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని 'లైగర్' సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లు హెచ్చరించిన నేపథ్యంలో.. పూరీ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. తన సినిమా కారణంగా నష్టపోయారులే అని కొంత మేర ఇవ్వాలని అనుకున్నానని పూరీ అన్నారు. కానీ ఇస్తానని చెప్పినా తనను బ్లాక్‌ మెయిల్ చేస్తే, ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదని.. ధర్నా చేసిన వాళ్లను మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులు చెల్లిస్తానని పూరి ఆగ్రహం వ్యక్తం చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.