Begin typing your search above and press return to search.

SVP షూటింగ్ టైంలో మహేష్ తో గొడవపై పరశురామ్ స్పందన..!

By:  Tupaki Desk   |   4 May 2022 3:30 AM GMT
SVP షూటింగ్ టైంలో మహేష్ తో గొడవపై పరశురామ్ స్పందన..!
X
'యువత' సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయమైన పరశురామ్ పెట్లా (బుజ్జి).. ఆ తర్వాత 'ఆంజనేయులు' 'సోలో' 'సారొచ్చారు' 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు - కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ''సర్కారు వారి పాట''. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా.. సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

మహేష్ బాబుతో సినిమా అనేది తన లైఫ్ టైం అచీవ్మెంట్ అని.. 'సర్కారు వారి పాట' కథ ఆయన కోసం పుట్టినదే అని పరశురాం అన్నారు. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవడం తన ఛాయిస్ అని.. మహేష్ కు చెబితే వెంటనే ఓకే అన్నారని తెలిపారు. అలానే సినిమాకు ఒకే టైటిల్ అనుకున్నామని.. టైటిల్ డిజైన్ మహేష్ కు బాగా నచ్చిందని తెలిపారు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు మరియు పరశురాం మధ్య గొడవలు వచ్చాయనే విషయం పై దర్శకుడు స్పందించారు.

"ఓ పెద్ద సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా ఏవేవో చిన్న చిన్న చిరాకులుంటాయి. అలాంటివేమీ లేవు.. ఈ సినిమా నాకు కేక్ వాక్ అని చెబితే అది నన్ను నేను మోసం చేసుకున్నట్టు ఉంటుంది. మూడు దశల కరోనా వచ్చింది. మహేష్ గారు మూడేళ్లు 'సర్కారు వారి పాట' స్క్రిప్టును తన మైండ్ లో మోయాల్సి వచ్చింది. అది చాలా కష్టమైన పని. ఆ ప్రెజర్ లో ఒకట్రెండు ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు కానీ.. ప్రతి రోజూ ఆయన మేసేజ్ లేదా ఫోన్లు చేయడం.. నన్ను ఒక బ్రదర్ లా చూసుకుంటారు'' అని పరశురాం తెలిపారు.

'సర్కారు వారి పాట' టైంలో మా నాన్నకు కోవిడ్ వచ్చింది. నాకు ధైర్యం చెప్పడానికి పదిసార్లు ఫోన్ చేశారు. ఏం కాదు.. బయపడకండి అని చెప్పేవారు. మధ్యలో మా వైఫ్ కి హెల్త్ ఇష్యూ వస్తే.. మహేష్ గారే డాక్టర్ తో మాట్లాడి.. ఆయనతో నాకు ఫోన్ చేయించారు. మా మధ్య అంత మంచి రిలేషన్ ఉంది. షూటింగ్ టైమ్ లో ప్రాక్టికల్ గా వచ్చే ఇబ్బందుల వల్ల చిన్న చిన్న చిరాకులు ఉండొచ్చు కానీ.. అంతకుమించి ఏమీ లేదు అని అన్నారు.

"అన్నపూర్ణలో చేయాల్సిన షూటింగ్ ను ఆర్ఎఫ్సీలో చేయాల్సి వచ్చినప్పుడో.. ఒక చోట చేయాల్సిన సీన్ ను 20 కిలోమీటర్ల అవతల ప్లాన్ చేసినప్పుడో.. ఇలా ప్రతి హీరోకి ప్రతి సినిమాకు ఉండే ప్రాక్టికల్ ఇబ్బందులే అవి. వాటి వల్ల 'సర్కారు వారి పాట' సినిమాకు కానీ.. నాకు మహేష్ తో ఉన్న అనుబంధానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మహేష్ గారు ఒక్కసారి ఓకే అన్నారంటే దాని గురించి మళ్లీ ఏమీ అడగరు. మహేష్ బంగారమండీ. ఆయన ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు.., దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంతే. మనం దాన్ని ఉపయోగించుకుంటే మనకే మంచిది. ఫైనల్ గా ఆయనకు కూడా హ్యాపీ'' అని దర్శకుడు చెప్పారు.

'సర్కారు వారి పాట' టైటిల్ డిజైన్ పూరీ జగన్నాథ్ కు విపరీతంగా నచ్చేసిందని.. ఏ కంటెంట్ రిలీజ్ అయినా ఎలా ఉందనేది మెసేజ్ రూపంలో చెబుతూ ఉంటారని పరశురాం చెప్పారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని.. తన చేతిలో సూపర్ స్టార్ అనే పవర్ ఫుల్ ఆయుధం ఉందని.. అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉండవని పరశురామ్ చెప్పుకొచ్చారు.