Begin typing your search above and press return to search.

RRR కి APలో బెనిఫిట్ షోలు టికెట్ పెంపు లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   15 March 2022 4:30 AM GMT
RRR కి APలో బెనిఫిట్ షోలు టికెట్ పెంపు లేన‌ట్టేనా?
X
2022 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాషల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా చిక్కులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో రాజ‌మౌళి- దాన‌య్య బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇటీవ‌లే టికెట్ రేట్ల‌ను పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం జీవోని ఇచ్చింది. కానీ దాని వ‌ల్ల కూడా ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రానికి క‌లిసి రాదు. పంపిణీదారులు భారీ మొత్తాల్ని వెచ్చించి కొనుక్కున్నారు కాబ‌ట్టి ఆ మొత్తాన్ని ప్ర‌జ‌ల నుంచి రాబ‌ట్టాలి అంటే క‌చ్ఛితంగా తొలి రెండు వారాలు టికెట్ రేట్ల‌ను పెంచుకునే వెసులుబాటు ఉండాలి. బెనిఫిట్ షోలు అద‌న‌పు షోలు వేస్తేనే రిక‌వ‌రీ పాజిబుల్ అన్న చ‌ర్చ సాగుతోంది.

అయితే ఇంత‌కుముందు రాజ‌మౌళి - దాన‌య్య ఇద్ద‌రూ నేరుగా ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ని విడిగా క‌లిసి ఇదే విష‌య‌మై ముచ్చ‌టించార‌ని దానికి సీఎం ఏమ‌ని స్పందించారో తెలియ‌డం లేద‌ని కూడా టాక్ వినిపించింది. విమానాశ్ర‌యం నుంచి వెళుతూ రాజ‌మౌళి ఒకే ఒక్క మాట అన్నారు. సీఎం త‌మ‌ను బాగా రిసీవ్ చేసుకున్నార‌ని మాత్ర‌మే చెప్పారు. అంటే టికెట్ రేట్ల‌ను తామే పెంచుకునేందుకు కానీ .. బెనిఫిట్ షోల‌కు అనుమ‌తించార‌ని కానీ రాజ‌మౌళి ఎక్కడా చెప్ప‌లేదు.

అయితే ఆ త‌ర్వాత మంత్రి పేర్ని నాని నేరుగా బ‌రిలోకి దిగి.. టికెట్ రేట్ల విష‌యంలో కానీ షోల విష‌యంలో కానీ .. రాజ‌మౌళికి ఒక రూలు.. ఇత‌రుల‌కు ఇంకో రూలు ఉండ‌ద‌ని ఖ‌రాకండిగా తేల్చి చెప్పేశారు. ఆయ‌న నేరుగా మీడియా ముందే ఇది ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ షాక‌య్యారు.

రాజమౌళి- దానయ్య జీవోపై కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చారని ఆయ‌న చెప్పారు. ఐదో షో వేసినా అది చిన్న సినిమాకి మాత్ర‌మేన‌ని కూడా తేల్చేశారు. సీఎంతో ఆర్.ఆర్.ఆర్ బృందాలు క‌లిసిన‌ప్పుడు తాను లేన‌ని చెప్ప‌క‌నే చెప్పారు మ‌రోవైపు.

రాధేశ్యామ్ కు ఒక్క రోజు ముందు పాతిక వ‌ర‌కూ పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అదే త‌ర‌హాలో ఆర్.ఆర్.ఆర్ కి స్పెష‌ల్ కేట‌గిరీలో టికెట్ పెంపు అవ‌కాశం క‌ల్పిస్తారేమో అన్న ఆశ అలానే ఉంది. భారీ బెట్టింగ్ నుంచి బ‌య్య‌ర్లు బ‌య‌ట‌ప‌డాలంటే టిక్కెట్ రేట్ల‌ను త‌మ‌కు న‌చ్చిన‌ట్టు నిర్ణ‌యించుకుంటేనే సాధ్య‌మ‌ని ఆర్.ఆర్.ఆర్ టీమ్ భావిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. కానీ అందుకు ఏపీలో అనుమ‌తుల్లేవ్.