Begin typing your search above and press return to search.

సమంత వదులుకోగా హిట్ కొట్టిన సినిమాలివే!

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:35 AM GMT
సమంత వదులుకోగా హిట్ కొట్టిన సినిమాలివే!
X
ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది .. ఉండాలి కూడా. పోటీ ఉన్నప్పుడే పోరాడాలనే పట్టుదల పెరుగుతుంది. విజయాన్ని సాధించాలనే కసి పెరుగుతుంది. ఇక సినిమా పరిశ్రమలో ఈ పోటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందునా హీరోయిన్ల విషయంలో చెప్పవలసిన అవసరమే లేదు. దేశంలోని నలుమూలల నుంచి హీరోయిన్ కావాలనే ఆశతో ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. ఇక ఆల్రెడీ ఇతర భాషల్లో క్రేజ్ తెచ్చుకున్నవారు ఇక్కడ కూడా పాగా వేయాలనే ఆలోచనతో వస్తుంటారు.

ఇంతపోటీ ఉన్నప్పుడు అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లడం సవాలుగా మారుతుంది. సవాళ్లను స్వీకరించినప్పుడే ఎవరి సత్తా ఎంత అనేది తెలుస్తుంది. అలా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అమాయకంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత, ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని బాగానే పసిగట్టింది. అప్పటి నుంచి ఆమె తనని తాను మలచుకుంటూ ముందుకు వెళ్లింది. కథలను .. పాత్రలను ఎంచుకోవడంలో పూర్తి శ్రద్ధ పెట్టింది. అదృష్టం బాగుండి ఆ సినిమాలు హిట్ కావడంతో కెరియర్ పరంగా ఆమె దూసుకుపోయింది.

అయితే ఒకసారి ఒక సినిమాను ఒప్పుకుని డేట్స్ ఇచ్చేసిన తరువాత .. అడ్వాన్స్ పుచ్చేసుకున్న తరువాత, అది కాదని వేరే ప్రాజెక్టు మీదకు వెళ్లడం అంత తేలికైన విషయమేం కాదు. అలా చేయడం వలన మున్ముందు కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుంటుంది కూడా. ఒక్కోసారి కొన్ని కారణాల వలన కథల ఎంపికలో ఎంతటివారైనా పొరపాట్లు చేస్తుండటం జరుగుతూ ఉంటుంది. అలా చేయడం వలన కొన్నిసార్లు హిట్లను వదులుకోవలసి వస్తుంది. మరికొన్ని సార్లు 'హమ్మయ్య ఆ సినిమాలను చేయనని చెప్పడమే మంచిదైందని అనిపిస్తూ ఉంటుంది.

అలా సమంత కెరియర్లోనూ కొన్ని సినిమాలు కనిపిస్తాయి. మణిరత్నం సినిమా 'కడల్' చేసే ఛాన్స్ ముందుగా సమంతకు వచ్చింది. కార్తీక్ తనయుడు గౌతమ్ కి ఇది ఫస్టు సినిమా. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకోవడం వలన సీనియర్ హీరోయిన్ రాధ చిన్న కూతురును తీసుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక శంకర్ - విక్రమ్ సినిమా 'ఐ' కూడా పెద్ద ప్రాజెక్టు. ఆ సినిమాలో కూడా కథానాయికగా ముందుగా సమంతనే అడిగారు. అయినా ఆమె కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేకపోయింది.

ఇక చరణ్ సరసన ఆమె 'ఎవడు' .. 'బ్రూస్ లీ' సినిమాలు చేయవలసి వచ్చింది. కానీ వ్యక్తిగత కారణాల వలన ఆమె ఆ సినిమాలు చేయలేదు. రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకోలేకపోయాయి. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలోను ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ పాత్రను చేయమనే ఆఫర్ వచ్చినవుప్పటికీ సమంత తిరస్కరించింది. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఇలా ఇంట్లోకి అడుగుపెడదామనుకున్న ఫ్లాపులకు ఆమె వాకిట్లోనే బై చెప్పేసింది. ఇక బాలీవుడ్ లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా కోసం కరణ్ జొహార్ ముందుగా సమంతనే అడిగారట. అయితే ఆమె అంతగా ఆసక్తి చూపకపోవడం వలన, ఆ ఛాన్స్ అలియా భట్ కి వెళ్లింది. ఆమెకి భారీ విజయం దక్కింది.

ఇక నాని సరసన 'నిన్ను కోరి' .. తమిళంలో నయన్ చేసిన 'మాయ' (మయూరి) సినిమాలు ముందుగా సమంత దగ్గరకే వచ్చాయి. ఆల్రెడీ నానీతో రెండు సినిమాలు చేశాను కదా అని సమంత లైట్ తీసుకుంటే, ఆ హిట్ నివేదా థామస్ కి హెల్ప్ అయింది. ఇక 'మాయ' నయనతార కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఇలా సమంత వదులుకున్న కొన్ని సినిమాలు హిట్ కొట్టగా, ఎక్కువ సినిమాలు పరాజయాలనే అందుకున్నాయి. కనుక కథల ఎంపికలో సమంత చాలా వరకూ సక్సెస్ అయిందనే అనుకోవాలి. తనంతట తాను స్టార్ డమ్ ను సంపాదించుకున్న తీరును ఒప్పుకోవాలి.