Begin typing your search above and press return to search.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కానీ..

By:  Tupaki Desk   |   20 Dec 2022 2:30 PM GMT
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కానీ..
X
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు కానీ ఈ మ‌ధ్య ఆ గోల్డ్ నే మ‌స‌క‌బారుస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. స్టార్ హీరోల కెరీర్ లో మైల్ స్టోన్ లుగా నిలిచిన సినిమాల‌కు అభిమానుల్లో ప్ర‌త్యేక స్థానం వుంటుంది. అలాంటి సినిమా గురించి అభిమానులు ప్ర‌త్యేకంగా చెప్పుకుంటుంటారు. ప‌లానా సినిమా మా హీరో కెరీర్ ని మ‌లుపు తిప్పింద‌ని, ఆ సినిమా మ‌ళ్లీ వ‌స్తే థియేట‌ర్ల‌లో చూసి మ‌ళ్లీ ఆనాటి మ‌ధురానుభూతుల్ని నెమ‌రు వేసుకోవాల‌ని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని చూస్తుంటారు. ఈ వీక్ నెస్ ని క్యాష్ చేసుకోవాల‌నే తంతు ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ ఎక్కువైపోతోంది.

స్టార్ హీరోల కెరీర్ ని మ‌లుపుతిప్పి వారి కెరీర్ లో మ‌ర‌పురాని సినిమాలుగా నిలిచిపోయిన ఎవ‌ర్ గ్రీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని స్టార్ హీరోల పుట్టిన రోజు కానుక‌లుగా రీ మాస్ట‌ర్ చేస్తూ ఈ మ‌ధ్య రీ రిలీజ్ చేసే ట్రెండ్ మొద‌లైంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ 'పోకిరి'తో ఈ ట్రెండ్ కు శ్రీ‌కారం చుట్టారు. ఆ త‌రువాత ఇదే పంథాని అనుస‌రిస్తూ చాలా వ‌ర‌కు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి. స్పెష‌ల్ షోలుగా ప్ర‌ద‌ర్శించిన ఆయా సినిమాల‌తో భారీ స్థాయిలోనే నిర్మాత‌లు డ‌బ్బులు దండుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే వుంది కానీ ఈ ట్రెండ్ పోను పోను అభిమానుల‌కు ఇబ్బందిక‌రంగా మారడం, క్రేజీ క్లాసిక్ సినిమాల‌కు అవ‌మానంగా ప‌రిణ‌మించ‌డం మొద‌లైంది. పోకిరి, జ‌ల్సా త‌రహాలో ప్ర‌భాస్ న‌టించిన 'వ‌ర్షం' మూవీని కూడా 4కెలోకి రీమాస్ట‌ర్ చేసి రిలీజ్ చేశారు. బాగానే ఆడింది. కానీ ఇదే ట్రెండ్ ని మ‌రింత‌గా క్యాష్ చేసుకోవాల‌ని కొంత మంది నిర్మాత‌లు అత్యాశ‌కు పోయి డిజాస్ట‌ర్ సినిమాల‌ని కూడా రీ మాస్ట‌ర్ చేస్తూ రిలీజ్ చేస్తుండ‌టంతో ఈ ట్రెండ్ కాస్తా క్లాసిక్ సినిమాలని కిల్ చేస్తూ వాటికున్న క్రేజ్ ని మ‌రింత‌గా మ‌స‌క‌బారేలా చేస్తోంది.

న‌చ్చిన బిర్యాని ఒక రోజు తింటే తృప్తిగా వుంటుంది. కానీ ప్ర‌తీ రోజు బిర్యానీ కావాలని ఎగ‌బ‌డిమ‌రీ వ‌డ్డిస్తే అది వెగ‌టు పుట్టిస్తుంది. రీ రిలీజ్ ల విష‌యం కూడా ఇలాగే మారుతోంది. ఎప్పుడో స్టార్ హీరో బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని స‌ద‌రు హీరో ఎవ‌ర్ గ్రీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రీ రిలీజ్ చేస్తే అభిమానులు, ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి చూస్తారు.. మ‌ళ్లీ ఆనాటి రోజుల్ల‌ని గుర్తు చేసుకుంటారు. ఒకటి రెండు సినిమాల‌కు పొలోమ‌ని జ‌నం వ‌చ్చారు క‌దా అని ఈ ట్రెండ్ ని క్యాష్ చేసుకోవాల‌నే దురాశ మ‌రీ మితిమీరి పోతే రీ రిలీజ్ ల‌ని ప‌ట్టించుకునే నాధుడే వుండ‌డు.

అలా రిలీజ్ చేసిన ప్రేమ దేశం, మాయాబ‌జార్ లాంటి ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్ హిట్ ల‌ని దురాశ‌తో రి రిలీజ్ చేస్తే థియేట‌ర్ల‌ల‌కు ఒక్క‌రు కూడా రాలేదు. దీంతో ఆ క్లాసిక్ ల‌కు తీర‌ని అవ‌మానం జ‌రిగింది. ఇప్పుడు ఇదే పంథాలో ప‌వ‌న్ న‌టించిన 'ఖుషీ' మూవీని డిసెంబ‌ర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇర‌వై ఏళ్ల కింద‌ట విడుదలైన ఈ మూవీ ప‌వ‌న్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. డిసెంబ‌ర్ 31న విడుద‌ల‌వుతుంది కాబ‌ట్టి కొంత వ‌ర‌కు ఈ మూవీకి ప్రేక్ష‌కులు వ‌చ్చే అవ‌కాశం వుంది. అదే ప‌నిగా ఇలాంటి సినిమాల‌ని క్యాష్ చేసుకోవాల‌నే దురాశ‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ రిలీజ్ చేస్తే అవ‌మానం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఈ విష‌యంపై ఒరిజిన‌ల్ ప్రొడ్యూస‌ర్స్ దృష్టి పెట్టి క్లాసిక్ ల‌కు అవ‌మానం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.