Begin typing your search above and press return to search.

'విరాటపర్వం' విడుదల గురించి పునరాలోచిస్తున్నారా..?

By:  Tupaki Desk   |   7 Sep 2021 6:30 AM GMT
విరాటపర్వం విడుదల గురించి పునరాలోచిస్తున్నారా..?
X
విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న 'దృశ్యం 2' మరియు 'విరాటపర్వం' చిత్రాలు కూడా ఓటీటీ బాట పట్టనున్నాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే ఓటీటీ డీల్స్ కూడా పూర్తయ్యాయని అన్నారు. కానీ ఇప్పటి వరకు దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'టక్ జగదీష్' 'మాస్ట్రో' వంటి క్రేజీ చిత్రాల ఓటీటీ విడుదల తేదీలను ప్రకటించినా.. నిర్మాత సురేష్ బాబు తన సినిమాల గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడమే మెల్లగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. దసరా తర్వాత అంతా సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'విరాటపర్వం' డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి సురేష్ బాబు పునరాలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. కాకపోతే 'దృశ్యం 2' సినిమా గురించి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా 'నారప్ప' చిత్రాన్ని విడుదల చేయడంపై పలువురు ఎగ్జిబిటర్స్ సురేష్ బాబు నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు 'విరాటపర్వం' 'దృశ్యం 2' చిత్రాలపై చివరకు ఎలాంటి డెసిజన్ తీసుకుంటారో చూడాలి.

ఇకపోతే 'విరాటపర్వం' చివరి షెడ్యూల్ సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పెండింగ్ వర్క్ ని కేవలం ఐదు రోజుల్లో చిత్రీకరించేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. దాదాపు 200 మంది జూనియర్ ఆరిస్టులతో షూట్ చేయాల్సిన సీన్స్ కావడంతో.. కోవిడ్ నేపథ్యంలో ఆ భాగాన్ని షూట్ చేయలేదట. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'విరాటపర్వం' సినిమా 1990స్ నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇందులో రానా ఒక నక్సలైట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్ - నవీన్ చంద్ర - ఈశ్వరీరావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - 'కోలు కోలు' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.