Begin typing your search above and press return to search.

ఇది నిజమైన బయోపిక్‌ అంటున్న నాగ బాబు

By:  Tupaki Desk   |   13 Nov 2019 9:47 AM GMT
ఇది నిజమైన బయోపిక్‌ అంటున్న నాగ బాబు
X
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో 'జార్జ్‌ రెడ్డి' చిత్రం గురించి ప్రముఖం గా చర్చ జరుగుతోంది. ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారం గా రూపొందిన ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌ గా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్‌ నాగ బాబు కూడా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ మాట్లాడారు.

జార్జ్‌ రెడ్డి చిత్రం గురించి నాగ బాబు తన యూట్యూబ్‌ ఛానెల్‌ లో మాట్లాడుతూ.. జార్జ్‌ రెడ్డి ఉస్మానియా విద్యార్థి అనే విషయం నాకు తెలుసు. ఆయన గురించి సినిమా వస్తుందని పోస్టర్లు చూసిన తర్వాత తెలిసింది. ట్రైలర్‌ చూసిన తర్వాత జార్జ్‌ రెడ్డి పాత్రకు సందీప్‌ మాధవ్‌ చక్కగా సెట్‌ అయ్యాడనిపించింది. నాకు జార్జ్‌ రెడ్డి అంటే చాలా అభిమానం. నేను 10వ తరగతిలో ఉన్న సమయం లో అతడు హత్య కాబడ్డాడు. నేను డిగ్రీ కి వచ్చిన తర్వాత జార్జ్‌ రెడ్డి గురించి పూర్తి గా తెలుసుకున్నాను.

ఆ తర్వాత చాలా సార్లు తమ్ముడు పవన్‌ లేదా మా అబ్బాయి తో ఆ పాత్రను చేయించాలని ఆశ పడ్డాను. కాని ఏదీ కుదరలేదు. జార్జ్‌ రెడ్డి పాత్ర కు కొత్త వారు అయితేనే బాగుంటుందనుకున్నాను. కాని సందీప్‌ మాధవ్‌ ను చూసిన తర్వాత కొత్త వారు ఈ పాత్ర కు సెట్‌ అవ్వరేమో అనిపిస్తుంది. ఫిజిక్స్‌.. మ్యాథ్స్‌ లో బంగారు పథకాలు సాధించిన ఒక గొప్ప విద్యార్థి. అలాగే ఒక గొప్ప విద్యార్థి నాయకుడు గా పీడీఎస్‌ ను స్థాపించాడు. జార్జ్‌ రెడ్డి ఒక రియల్‌ ఫైటర్‌.. రియల్‌ హీరో అంటూ నాగ బాబు ప్రశంసించారు.

చిన్న వయసు లోనే జార్జ్‌ రెడ్డి సాధించిన గొప్ప విజయాల గురించి చాలా విన్నాను. అతడి ఆవేశం మరియు ఉద్యమ స్ఫూర్తి నాకు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ లో కనిపిస్తాయి. అందుకే నాకు తమ్ముడు పవన్‌ అంటే ఇష్టం. తన కోసం కాకుండా ఇతరుల కోసం పోరాడే వ్యక్తి జార్జ్‌ రెడ్డి అన్నాడు. అతడి గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ చిత్రం నిజమైన బయోపిక్‌ అనిపిస్తుందంటూ నాగ బాబు అభిప్రాయపడ్డారు.