Begin typing your search above and press return to search.

దర్శకులకే కాదు.. అందరికీ ఇది వార్నింగ్

By:  Tupaki Desk   |   28 July 2022 3:30 PM GMT
దర్శకులకే కాదు.. అందరికీ ఇది వార్నింగ్
X
సామాన్య జనానికి ఉన్నట్లే ఫిలిం సెలబ్రెటీలకు కూడా రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉంటాయి. కానీ మిగతా రంగాల వారితో పోలిస్తే వారి పరిస్థితి చాలా భిన్నం. తమ పొలిటికల్ ఇంట్రెస్ట్‌ల గురించి చెబితే జనాల నుంచి వచ్చే స్పందన భిన్నంగా ఉంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో తమ అభిప్రాయాలు చెప్పి జనాలను ప్రభావితం చేయాలని చూసినా, లేక ఎవరినైనా టార్గెట్ చేయాలని చూసినా.. సీన్ రివర్స్ అవుతోంది. వాళ్ల అభిప్రాయాలకు, సినిమాలకు ముడి పెట్టి దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది.

పరిస్థితులు ఇలా సున్నితంగా మారిపోతున్న నేపథ్యంలో ఫిలిం సెలబ్రెటీలు తమ రాజకీయ ఆసక్తులను వ్యక్తిగత స్థాయికి పరిమితం చేసి, సామాజిక మాధ్యమాల్లో సైలెంటుగా ఉంటే చాలా మంచిదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందులోనూ జనాల మూడ్‌తో సంబంధం లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడిస్తే, ఒకరికి భజన చేస్తే, ఇంకొకరిని టార్గెట్ చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ అనడానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

ఆ మధ్య 'సర్కారు వారి పాట' దర్శకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మీద తన అభిమానాన్ని బయట పెట్టాడు. ఆ చిత్రంలో 'నేను ఉన్నాను నేను విన్నాను' అనే డైలాగ్ పెట్టడం ద్వారా తాను వైసీపీ మద్దతుదారుడినని చెప్పకనే చెప్పాడు. ఐతే వైసీపీ వాళ్లు ఈ సినిమాను ఓన్ చేసుకున్నదానికంటే ఇతర పార్టీల వాళ్లు దూరం పెట్టిందే ఎక్కువ అని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోయింది.

సినిమా మీద సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన నెగెటివిటీ కనిపించడానికి అది కూడా ఒక కారణం. ఇక తాజాగా 'మాచర్ల నియోజకవర్గం' దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పరిస్థితి అందరూ చూస్తున్నారు. అతను కమ్మ, కాపు కులస్థులను బూతులు తిడుతూ పెట్టినట్లుగా ఒక పోస్ట్ వైరల్ అయింది.

అది ఫేక్ అని అతను వాదిస్తున్నప్పటికీ.. గతంలో జగన్ ప్రత్యర్థి పార్టీలను, దాని మద్దతుదారులను దూషిస్తూ, వెటకారాలాడుతూ పెట్టిన పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీని వల్ల అతడి విషయంలో సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ కనిపిస్తోంది.

ఆ ప్రభావం ఇప్పుడు తన సినిమా మీద, అలాగే కెరీర్ మీద పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు అనుభవాలను బట్టి ఒక విషయం స్పష్టం. ఈ దర్శకులనే కాదు.. ఫిలిం సెలబ్రెటీలు ఎవరైనా సరే.. వారికి రాజకీయంగా ఎలాంటి ఆసక్తులైనా ఉండొచ్చు. వారు ఎవ్వరికైనా మద్దతు ఇవ్వొచ్చు. కానీ రాజకీయాల్లోకి అడుగు పెడితే తప్ప.. బయట స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. తమ స్థాయికి తగని విధంగా, హుందాతనం లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అసలే చేయకూడదు.