Begin typing your search above and press return to search.

కశ్మీర్‌లో 30 ఏళ్ల త‌ర్వాత వేసిన తొలి సినిమా ఇదే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:02 AM GMT
కశ్మీర్‌లో 30 ఏళ్ల త‌ర్వాత వేసిన తొలి సినిమా ఇదే!
X
ఒక‌ప్పుడు ఉగ్ర‌వాదంతో నిత్యం క‌ల్లోల ప‌రిస్థితుల‌తో అతలాకుత‌ల‌మైన జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత అక్క‌డ సినిమా హాళ్లు తెరుచుకోవ‌డం విశేషం. అందులోనూ తొలిసారిగా అక్క‌డ దిగ్ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్ర‌ద‌ర్శించారు.

కాగా దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, శోపియాలలో సెప్టెంబ‌ర్ 18న‌ ఆదివారం మల్టీపర్పస్‌ సినిమా హాళ్లను జమ్ముకశ్మీర్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. ఒక‌దానిలో ఆర్ఆర్ఆర్ సినిమాను, మ‌రో హాళ్లో బాగ్ మిల్కా బాగ్ సినిమాను ప్ర‌ద‌ర్శించారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఆయ‌న‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఆయ‌న కాసేపు సినిమాను వీక్షించ‌డం గ‌మ‌నార్హం.

కాగా ప్ర‌భుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు క‌లిసి ఈ మల్టీప్లెక్సులను నిర్మించాయి. భవిష్యత్‌లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను నెలకొల్పుతామని మ‌నోజ్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా, శోపియా యువతకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల త‌ర్వాత జ‌మ్ముక‌శ్మీర్లో సినిమా హాళ్లు తెరుచుకోవ‌డాన్ని చరిత్రాత్మక ఘటనగా ఆయన అభివర్ణించ‌డం విశేషం.

త్వ‌ర‌లోనే జ‌మ్ముక‌శ్మీర్లో అనంత్‌నాగ్‌, శ్రీనగర్‌, బందిపోరా, గందర్‌బల్‌, దోడా, రాజౌరి, ఫూంచ్‌, కిష్ట్వార్‌, రియాసీలలో సినిమా థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేర‌కు అధికారులు తెలిపారు. కేవ‌లం సినిమాల ప్రదర్శనే కాకుండా ఇన్ఫోటెయిన్‌మెంట్‌, నైపుణ్యాభివృద్ధి కోసం కూడా మాల్స్‌లో ఏర్పాటు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

మ‌రోవైపు వచ్చే వారం కశ్మీర్‌లో తొలి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్‌వార్‌ ప్రాంతంలో దీన్ని సెప్టెంబ‌ర్ 27న‌ ప్రారంభిస్తున్నారు. ఇందులో 520 మంది కూర్చోవ‌డానికి వీలుగా మూడు స్క్రీన్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో మొద‌టి సినిమాగా ఇటీవ‌ల అమీర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

కాగా 1980 వరకు కశ్మీర్‌ లోయలో దాదాపు 12 సినిమా హాళ్లు ఉండేవ‌ని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో క్రమక్రమంగా థియేట‌ర్ల యజమానులు వాటిని మూసివేశారు. 1990 దశకం ప్రారంభంలోనే ఇలా ఉగ్ర‌వాదుల బెదిరింపుల‌కు జ‌డిసి అన్ని సినిమా హాళ్లను మూసేశారు. ఆ త‌ర్వాత‌ 1999లో తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఉన్న రీగల్‌ సినిమాహాల్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి చేశారు. దీంతో ఆ ప్ర‌య‌త్నాల‌కు విఘాతం ఏర్ప‌డింది.

ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదుల‌ను ఏరిపారేస్తుండ‌టంతో మూత‌ప‌డిన సినిమా హాళ్ల‌ను తిరిగి తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ప‌లు తెలుగు చిత్రాలు కూడా క‌శ్మీర్‌లో షూటింగులు జ‌రుపుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన సినిమా విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.