Begin typing your search above and press return to search.

ఇది బాలయ్యతో 'అల్లు'కున్న మెగా అనుబంధం..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:30 PM GMT
ఇది బాలయ్యతో అల్లుకున్న మెగా అనుబంధం..!
X
టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో అల్లు ఫ్యామిలీ అనుబంధం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవికి బాక్సాఫీస్ ప్రత్యర్థిగా ఉన్న బాలయ్యతో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్నేహబంధం మరింత బలపడుతోందనే చర్చలు జరుగుతున్నాయి.

అల్లు అరవింద్ సారథ్యంలో నడిచే 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో ఎలాంటి భావోద్వేగాలను దాచుకోకుండా.. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చూపించే బాలయ్య అయితేనే ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా కరెక్ట్ అని భావించనట్లు నిర్మాత ఆ మధ్య తెలిపారు.

మెగా ప్రొడ్యూసర్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'అన్ స్టాపబుల్' కార్యరూపం దాల్చడంతో అప్పటి నుంచి అల్లు - నందమూరి బంధం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆ తర్వాత 'అఖండ' సినిమా ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. అంతేకాదు 'జై బాలయ్య' అనే స్లోగన్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు.

ఇప్పుడు అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ సమక్షంలో వీరిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. కుదిరితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని హింట్ ఇచ్చారు.

అల్లు వారితో నందమూరి ఫ్యామిలీకి ఉన్న సత్సంబంధాల గురించి మాట్లాడుతూ.. 'ఒకే కుటుంబ సభ్యులం కాబట్టి గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకెళ్లారు అని కాకుండా తీసుకెళ్ళాం అని వస్తోంది' అని బాలయ్య చెప్పడం.. అలానే అల్లు శిరీష్ సైతం 'జై బాలయ్య' అని అరవడం అందరినీ ఆకర్షించింది.

బాలయ్య గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి రెడీ అవ్వడం.. మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ లాంచింగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అల్లు - బాలయ్య మధ్య విడదీయలేని బంధం ఏర్పడిందనే చర్చ జరుగుతోంది.

మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఒకప్పటిలా వారి మధ్య సత్సంబంధాలు లేవనే విధంగా గత కొంతకాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతోంది. అల్లు అరవింద్ ఇటీవల అలీ ఇంటర్వ్యూలో ఈ వార్తలను కొట్టిపారేశారు. తమ రెండు కుటుంబాలు పెరగడంతో చిన్నదైన సినిమా ఇండస్ట్రీలో పోటీ ఏర్పడుతోందని.. ఇది ఆరోగ్యకరమైన పోటీ అని నిర్మాత తెలిపారు.

అయితే మెగా కాంపౌండ్ లో ఒకరిగా ఉన్న అల్లు అరవింద్.. ఇప్పుడు బాలయ్య తో సాన్నిహిత్యం కొనసాగిస్తుండటంతో ఓ వర్గం ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నందమూరి కుటుంబానికి, అల్లు ఫ్యామిలీకి మధ్య అనుబంధం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు.

రెండు ఫ్యామిలీల మధ్య మొదటి నుంచీ సత్సంబంధాలు ఉన్నాయి. మద్రాసులో ఉన్నప్పుడు రామారావు పిల్లలు మరియు రామలింగయ్య పిల్లలు బాల్యంలో కలసి ఆడుకునేవారని చాలా కొద్ది మందికే తెలుసు. 'అన్ స్టాపబుల్' లాంచింగ్ ఈవెంట్ లో బాలయ్య సైతం ఈ విషయాన్ని వెల్లడించారు.

ది గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య అబ్బాయి అల్లు అరవింద్ తో తనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని బాలకృష్ణ తెలిపారు. మా ఇంట్లోకి నేరుగా వెళ్లి, తన అమ్మ తో టీ పెట్టించుకుని, తాగేంత చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉందని.. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదని బాలయ్య చెప్పారు.

ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ - బాలకృష్ణ లతో కలిసి నటించారు రామలింగయ్య. రియల్ లైఫ్ లోనూ రెండు ఫ్యామిలీల మధ్య మంచి స్నేహ బంధమే కొనసాగింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పుడు కొత్తగా వారి మధ్య బంధం ఏర్పడలేదని అంటున్నారు.

వారి మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవాలే కానీ.. బాలయ్యతో బంధం కారణంగా మెగా ఫ్యామిలీకి అల్లు వారు దూరంగా ఉంటున్నారనే వాదన కరెక్ట్ కాదని అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను మెగా అల్లు ఫ్యామిలీ కలిసి జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీని ఉద్దేశిస్తూ చిరంజీవి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.