Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ట్యాలెంటెడ్ హీరోకి అన్యాయం?

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:18 AM GMT
ట్రెండీ టాక్‌: ట్యాలెంటెడ్ హీరోకి అన్యాయం?
X
ఎంత మంచి సినిమా తీసినా ప్ర‌చారం స‌రిగా లేక‌పోతే ఫ‌లితం కూడా అలానే నిరాశ‌ప‌రుస్తుంది. తెలుగు-త‌మిళం-హిందీ స‌హా చాలా ప‌రిశ్ర‌మ‌ల్లో అద్భుత చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఓపెనింగులు లేక చివ‌రికి ఫ్లాపులుగా మిగిలిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. కొన్నిసార్లు స్టార్ కాస్టింగ్ కొత్త వాళ్లు కావ‌డంతో సినిమా అద్భుతంగా ఉన్నా జ‌నం థియేట‌ర్ల‌కు రారు. ఇలాంటి సినిమాల‌కు ప్ర‌చారం ఇతోధికంగా స‌హాయ‌ప‌డాలి. అగ్ర హీరోలు.. టాప్ హీరోయిన్లు న‌టించే సినిమాల‌కు ఉన్న డిమాండ్ వేరు... కంటెంట్ ఉండీ అంత‌గా రిక‌గ్నైజ్ కాని ఫేస్ ల‌కు ఉండే డిమాండ్ వేరు. ఇక ఇటీవ‌ల డిజిట‌ల్ (ఓటీటీ) లో ఆరంభ‌ వీక్ష‌ణ‌ల ఆధారంగా సినిమా హిట్టు ఫట్టు అన్న‌ది నిర్ణ‌యిస్తున్నారు.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ల‌ను ఎంచుకున్న సినిమాల‌కు గొప్ప రివ్యూలు వ‌చ్చినా కానీ వీక్ష‌ణ‌ల సంఖ్య ప‌రిమితంగా ఉంటోంది. అలా మంచి స‌మీక్ష‌లు పొంది వీక్ష‌ణ‌ల్లో న‌ష్ట‌పోయిన సినిమాగా రాజ్ కుమార్ రావు న‌టించిన తాజా చిత్రం 'మోనికా ఓ మై డార్లింగ్' చేరిపోయింది. డార్క్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవ‌లి కాలంలో వ‌చ్చిన బెస్ట్ సినిమాల్లో ఒక‌టిగా చెబుతున్నారు. ఈ సినిమాకి స‌మీక్ష‌కులు మంచి మార్కులే వేశారు. చిత్రంలో న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అద్భుత ప్ర‌శంస‌లు కురిపించారు. కానీ తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్ర‌క‌టించిన వీక్ష‌ణల గంట‌లు ప‌రిశీలిస్తే ఆడియెన్ ఆద‌ర‌ణ చాలా ప‌రిమితంగా ఉంద‌ని నిరూప‌ణ అయ్యింది.

రాజ్ కుమార్ రావ్- హుమా ఖురేషి- రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 11న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియ‌ర్ అయ్యింది. చ‌క్క‌ని స‌మీక్ష‌లు మౌత్ టాక్ బావున్నా సినిమా స్ట్రీమింగ్ సంఖ్య‌లు నిరాశపరిచాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 చిత్రాల స్ట్రీమింగ్ గంటలను విడుదల చేసింది. మోనికా ఓ మై డార్లింగ్ కేవలం 44.5 ల‌క్ష‌ల‌ స్ట్రీమింగ్ గంటలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్య నెట్ ఫ్లిక్స్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ గంగూబాయి కతియావాడి - RRR -డార్లింగ్స్ కంటే చాలా తక్కువ.

ఉత్త‌మ కంటెంట్ తో వ‌చ్చిన ఈ సినిమాకి తారాగ‌ణం ఓకే. కానీ ఆలియా.. రాజ‌మౌళి వంటి వారి సినిమాల‌ హ‌వా ముందు వీళ్లు క‌నిపించ‌లేద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే కంటెంట్ బావుంది కాబ‌ట్టి మునుముందు స‌న్నివేశం మారుతుంది. వీక్ష‌ణ‌ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఆరంభం ఎలా ఉంద‌న్న‌ది ఇక్క‌డ ముఖ్యం. మంచి కంటెంట్ తో వ‌చ్చి ఆరంభంలో నిరాద‌ర‌ణ పొందిన సినిమాగా మోనికా ఓ మై డార్లింగ్ నిలిచిపోయింది.

స్టార్ కాస్టింగ్ తో ప్ర‌చారం చేయించుకున్నా కానీ అద‌న‌పు బ‌డ్జెట్లు కేటాయించి కొన్నిసార్లు మంచి కంటెంట్ ని పుల్ చేయాల్సి ఉంటుంది. ప‌బ్లిసిటీలో వైవిధ్యం కూడా ఇలాంటి సినిమాల‌కు అవ‌స‌రం. ఇక‌పోతే ఆలియా.. రాజ‌మౌళి- చ‌ర‌ణ్‌-తార‌క్ సినిమాల‌కు చేసిన‌ట్టుగా రాజ్ కుమార్ రావు కోసం నెట్ ఫ్లిక్స్ ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం అన్యాయం. ప్ర‌చారం సరిగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే వీక్ష‌ణ‌ల సంఖ్య ప‌రిమిత‌మైంది త‌ప్ప ఈ సినిమాలో కంటెంట్ లేకపోవ‌డం వ‌ల్ల అయితే కానేకాద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.

ఈరోజుల్లో కంటెంటే కింగ్. అయితే మునుముందు దీని ప్రభావం మ‌రింత విస్త్ర‌తంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. రాజ్ కుమార్ రావుకు హిందీ బెల్ట్ లో అద్భుత ఫాలోయింగ్ ఉంది. అత‌డు ద‌క్షిణాదినా త‌న ఫాలోయింగ్ ని పెంచుకుంటే అత‌డి సినిమాల‌కు ఓటీటీ ఆద‌ర‌ణ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. బాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన యువ‌హీరోల‌కు కొద‌వేమీ లేదు. వీరంతా ఇప్పుడిప్పుడే ద‌క్షిణాది మార్కెట్ అవ‌స‌రం ఏమిటో గ్ర‌హించి పాన్ ఇండియా రిలీజ్ ల‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ కేట‌గిరీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని రాజ్ కుమార్ రావుకు కూడా ద‌క్షిణాది నుంచి ఒక అండ అవ‌స‌రం అన్నది గుర్తించాలి. నెట్ ఫ్లిక్స్ పేలవమైన మార్కెటింగ్ కారణంగా గణాంకాలు తక్కువగా ఉన్నాయి కానీ మోనికా ఓ మై డార్లింగ్ లో ఏదీ త‌క్కువ కాద‌న్న విశ్లేష‌ణ‌లు ప్ర‌స్తుతం మీడియాలో పోటెత్తుతున్నాయి.

క‌నీసం డార్లింగ్స్ - హసీన్ దిల్రూబా త‌ర‌హాలో ప్ర‌చారం చేసినా ఈ సినిమా గొప్ప వీక్ష‌ణ‌ల‌ను పొంద‌గ‌లిగేద‌నేది ఒక వ‌ర్గం విశ్లేష‌ణ‌. అయితే ఇప్ప‌టికే వ‌చ్చిన మంచి మౌత్ టాక్ తో ఈ సినిమా మ‌రింత‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.