Begin typing your search above and press return to search.

నా హీరోలందరిలో నేను గమనించింది ఇదే!

By:  Tupaki Desk   |   12 April 2022 10:30 AM GMT
నా హీరోలందరిలో నేను గమనించింది ఇదే!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి .. కొరటాల తరువాత ఇంతవరకూ ఫ్లాప్ అనే మాటను వినని డైరెక్టర్ గా ఆయనకి మంచి పేరు ఉంది. అనిల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టుంది. ఆయన సినిమాలు చూసినవారికి ఈ విషయాన్ని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. తాజా ఇంటర్వ్యూ లో ఆయన ఇంతవరకూ తాను పనిచేస్తూ వచ్చిన హీరోలు .. వాళ్లలో తనకి నచ్చిన అంశాలను గురించి ప్రస్తావించాడు. "నా మొదటి సినిమా హీరో కల్యాణ్ రామ్ గారు .. హార్డ్ వర్క్ చేయడం ఆయనకి ఎంతో ఇష్టం. తాను ఏ సినిమా చేసినా ఎంతో నమ్మకంతో పనిచేయడం నాకు బాగా నచ్చింది.

సక్సెస్ లు ఉన్నప్పుడు ఆ ఉత్సాహంతో కష్టపడటం వేరు. కానీ బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కల్యాణ్ రామ్ ఆ స్థాయిలో కష్టపడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు వెళుతూ ఉంటారు. సాయిధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తను చాలా నాటీ .. అయినా సినిమా విషయంలో చాలా ఫ్యాషన్ తో ఉండటం నేను గమనించాను. ఏదో చేయాలనే తపన ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. రవితేజ గారిని గురించి చెప్పాలంటే, ఆయన ఒక పవర్ హౌస్. తన పక్కన ఎవరున్నా ఆయన వైబ్రేట్ చేసేస్తారు.

రవితేజ గారు తన కోపం .. ఆనందం ఏదైనా సరే లోపల దాచుకోరు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. వెంకటేశ్ గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. 'అబ్బాయి గారు' .. ' ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలను ఆయన ఒక్క చేత్తో ఆడేసుకున్నారు.

అంత సీనియర్ స్టార్ అయినప్పటికీ, ఒకటికి రెండుసార్లు అడుగుతూ తనదైన స్టైల్లో చేసుకుని వెళుతుంటారు. పైకి కనిపించరు గానీ .. ఆయన చాలా ఎఫర్ట్ పెడుతుంటారు. వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఆయన నా డాళింగ్ .. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కోపం వస్తుందిగానీ .. వెంటనే తగ్గిపోతూ ఉంటుంది.

నా లైఫ్ లో మరిచిపోలేని సినిమా .. మహేశ్ బాబుగారితో చేసిన 'సరిలేరు నీకెవ్వరు'. ఒక డైరెక్టర్ ను ఎవరైనా సరే భుజాన పెట్టుకుంటారు. కానీ మహేశ్ బాబుగారు నెత్తిన పెట్టుకుంటారు. ఒకసారి కథ నచ్చేసిందని ఆయన చెప్పిన తరువాత ఇక ఏ విషయంలోను జోక్యం చేసుకోరు.

దర్శకుడు ఏదైతే చెబుతాడో అది చేసుకుంటూ వెళతారు. ఒకసారి మహేశ్ బాబు గారితో సినిమా చేసే ఛాన్స్ వస్తే మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనిపిస్తూ ఉంటుంది. అంతమంచి మనిషి ఆయన" అని చెప్పుకొచ్చాడు.