Begin typing your search above and press return to search.
ఈ పాన్ ఇండియా డైరెక్టర్.. తెలుగులోనే సెటిల్ అవుతున్నాడుగా..!
By: Tupaki Desk | 25 May 2021 3:30 AM GMTఈ మధ్యకాలంలో డెబ్యూ మూవీ సొంతభాషలో రూపొందించి రెండో సినిమాకే బాషా పరిమితి లేకుండా పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శకులు. అలా ప్రయోగం చేసి పాన్ ఇండియా వైడ్ నేమ్ అండ్ ఫేమ్ పొందిన వారిలో ఒకరు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ అనే ఒక్క మూవీతోనే ఇండియన్ వైడ్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అటు కేజీఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ హద్దులను కూడా చెరిపేశాడు. కేజీఎఫ్ తోనే సంచలనం సృష్టించిన ప్రశాంత్.. సీక్వెల్ కేజీఎఫ్-2 పై అంచనాలు భారీగా సెట్ చేసాడు. ఇప్పటికే టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్లో కేజీఎఫ్ ఫీవర్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. కేజీఎఫ్ సినిమాతో హీరో యష్ కూడా పాన్ ఇండియా స్టార్డం సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. రాధేశ్యామ్ మూవీ ముగించుకొని ఇప్పటికే సలార్ ఓ షెడ్యూల్ పూర్తిచేసాడు ప్రభాస్. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. డార్లింగ్ ప్రభాస్ ను ఎన్నడూ చూడని మాస్ లుక్కులో చూపించనున్నాడు. సలార్ అనే టైటిల్ తోనే ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ తదుపరి సినిమాల లిస్ట్ చూసుకుంటే ఇకపై కన్నడ వైపు లుక్కు వేసేలా లేడని టాక్. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఆ సినిమా ఇటు సలార్ - అటు కొరటాల మూవీ పూర్తికాగానే పట్టాలెక్కనుంది.
ఆ సినిమా తర్వాత ప్రశాంత్.. మరోసారి ప్రభాస్ తో సినిమా చేయనున్నాడట. ఇప్పటికే మైత్రిస్ వారితో పాటు దిల్ రాజు బ్యానర్ వారికీ కూడా ఓ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సలార్ - ఎన్టీఆర్ సినిమాలు పూర్తి కావడానికే రెండేళ్లు పట్టేలా ఉంది. అలాంటిది లైన్ లో ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు టాక్. ఎందుకంటే ఇటీవలే ప్రశాంత్.. గీతాఆర్ట్స్ ఆఫీస్ లో అల్లు అర్జున్ తో చర్చలు జరిపాడు. మరి ఈ కాంబినేషన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. టాలీవుడ్ మిగతా స్టార్ హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆ జాబితాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా ప్రశాంత్ పై పాజిటివ్ గానే ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే మరోవైపు ప్రశాంత్ ఇకపై తెలుగులోనే సెటిల్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉండగా.. సౌత్ ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ - భారీ రీచ్ - కమర్షియల్ గా బిగ్ స్కేల్ కలిగిన ఇండస్ట్రీ టాలీవుడ్. మరి ఇలాంటి ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ కూడా అదే రేంజిలో ఉంటుందని సమాచారం. అందుకే ప్రశాంత్ కూడా టాలీవుడ్ హీరోలతో మూవీస్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి త్వరలో ప్రశాంత్ మరిన్ని సినిమాలు అనౌన్స్ చేస్తాడేమో!