Begin typing your search above and press return to search.

రెండు సినిమాలకూ మౌత్ టాక్ కీలకం..!

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:05 AM GMT
రెండు సినిమాలకూ మౌత్ టాక్ కీలకం..!
X
పాండమిక్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి కరువైపోయింది. ఒకప్పుడు కళకళలాడిన సినిమా హాళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రెండు మూడు చిత్రాలు తప్ప మిగిలినవన్నీ ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాయి.

ఓటీటీలకు అలవాటు పడ్డ జనాలు థియేటర్స్ కు రావడం చాలా వరకు తగ్గించేశారు. కరోనా టైంలో నిర్మాతలకు వరంలా మారిన డిజిటల్ వేదికలు.. ఇప్పుడు శాపంగా మారాయి. దీనికి తోడు టికెట్ రేట్స్ కూడా సామాన్యులకు భారంగా మారాయని చెప్పాలి.

హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోయిన నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన ఒక్క తెలుగు సినిమా కూడా సక్సెస్ కాలేదు.

ఈ నేపథ్యంలో ఆగస్ట్ బాక్సాఫీస్ వద్దకు ఈరోజు శుక్రవారం మరో రెండు కొత్త చిత్రాలు బరిలో దిగుతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి.

రెండు సినిమాలూ కూడా ప్రమోషనల్ కంటెంట్ మరియు అగ్రిసివ్ ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాయి. రెండింటికి సమానమైన బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సందడి మొదటి రోజు ఓపెనింగ్స్ గా మార్చగలదా? ఫస్ట్ వీకెండ్ వరకూ ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించగలదా? అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

నందమూరి అభిమానుల కారణంగా 'బింబిసార' పెయిడ్ ప్రీమియర్లు ఫుల్ అయ్యాయి. కానీ సాధారణ 11 am షోల ప్రీ బుకింగ్స్ మాత్రం చాలా మందకొడిగా ఉన్నాయి. మరోవైపు 'సీతా రామం' బుకింగ్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. రెండు చిత్రాలకు ఎక్కడా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అవ్వలేదు.

మౌత్ టాక్ ఆధారంగా ఈ రెండు సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాలి. టికెట్ రేట్లు తక్కువగానే పెట్టారు కాబట్టి.. పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు థియేటర్ల వైపు నడిచే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.

'బింబిసార' చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సోసియో ఫాంటసీ యాక్షన్ మూవీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో హరికృష్ణ నిర్మించారు. ఇందులో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. క్యాథరిన్ - సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

'సీతారామం' సినిమాని హను రాఘవపూడి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది యుద్ధం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ప్రేమకథ. ఇందులో దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది.