Begin typing your search above and press return to search.

చంపేస్తామంటూ యువ‌హీరోకి బెదిరింపులు?

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:07 AM GMT
చంపేస్తామంటూ యువ‌హీరోకి బెదిరింపులు?
X
యువ‌హీరో స‌త్య‌దేవ్ కి చంపేస్తామ‌నే బెదిరింపులు ఎదుర‌య్యాయా? అంటే అవున‌నే ఆయ‌న ఓ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అత‌డు తీవ్ర‌వాదం నేప‌థ్యంలో `హ‌బీబ్` అనే హిందీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌చారంలో భాగంగా ఓ చాటింగ్ సెష‌న్ లో స‌త్య‌దేవ్ చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఇంత‌కుముందు హ‌బీబ్ నుంచి ఆఫ్ఘ‌న్ సాహిత్యంతో తెర‌కెక్కించిన సాంగ్ ని లాంచ్ చేయ‌గా అది అంద‌రి మ‌న‌సులు దోచింది. తీవ్ర‌వాదుల చెర‌కు చిక్కిన త‌న‌యుడిని వెతుకుతూ వెళ్లే తండ్రిగా స‌త్య‌దేవ్ ఆహార్యం హృద‌యాల్ని ట‌చ్ చేసింది. ట్యూన్ స‌హా విజువ‌ల్స్ మైండ్ ని బ్లాక్ చేశాయి.

ఇక హ‌బీబ్ షూటింగ్ ఆషామాషీగా సాగ‌లేదు. తీవ్ర ఆటంకాలు ప్ర‌మాదాల న‌డుమ భ‌య‌ప‌డుతూ ఈ సినిమాని చిత్రీక‌రించారు. ఎంచుకున్న క‌థానుసారం ఆఫ్ఘ‌నిస్తాన్ ప‌రిస‌రాల్లో తెర‌కెక్కించాల్సి వ‌చ్చింది. అప్ప‌టికే అమెరిక‌న్ల హ‌స్త‌గ‌తం అయిన తాలిబ‌న్ దేశాన్ని తిరిగి సాధించుకునేందుకు తాలిబ‌న్లు తీవ్ర‌మైన పోరాటం సాగిస్తున్న క్ర‌మంలో ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది ఎంతో రిస్కీ అని తెలిసినా స‌త్య‌దేవ్ త‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం వీడ‌లేదు. ఓ వైపు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రాణాపాయ బెదిరింపులను అత‌డు ఎదుర్కొన్నాడు. చంపేస్తామంటూ బెదిరించార‌ని అత‌డు తెలిపారు. కాబూల్ లో బెదిరింపుల మధ్య సత్యదేవ్ హబీబ్ ను చిత్రీకరించాడు.

ఇక 2017 లో ఆఫ్ఘన్ పార్లమెంట్ ను కదిలించిన జంట పేలుళ్ల‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఈ పేలుళ్ల స‌మ‌యంలో ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు ఆ ప్ర‌దేశంలో ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. నిజానికి నాటి జంట పేలుళ్లకు ఒక రోజు ముందు స‌త్య‌దేవ్ కూడా అక్క‌డే షూటింగుకి అటెండ‌య్యారు. అత‌డితో చిత్ర‌యూనిట్ కూడా అక్క‌డ ఉంది. ఇంకో రోజు షూటింగ్ అక్క‌డే చేయాల్సి వ‌స్తే ఆ ప్ర‌మాదం ఎలా ఉండేదో!

అంతేకాదు ఆర్మీ త‌ర‌హా దుస్తులు ధ‌రించి స‌త్య‌దేవ్ పై చిత్రీక‌ర‌ణ‌ను చేయ‌గా అత‌డి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డార‌ట‌. స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వ‌చ్చింది. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై త‌న‌కు ఉన్న ఫ్యాష‌న్ ని స‌త్య‌దేవ్ వీడ‌లేదు. క‌ష్టం న‌ష్టం దుఃఖం ఏదైనా కానీ అత‌డు సెట్స్ లో గ‌డిపేందుకే సాహ‌సించాడు.

హబీబ్ చిత్రం కాబూల్ లో చిత్రీకరించిన మొదటి దక్షిణ భారతీయ సినిమా కాగా.. రెండవ భారతీయ చిత్రంగా రికార్డుల‌కెక్కుతోంది. సత్యదేవ్ న‌టించిన‌ తిమ్మరుసు త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. స్కైలాబ్ -గుర్తుందా సీతాకాలం స‌హా ప‌లు చిత్రాల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ లూసీఫ‌ర్ రీమేక్ లోనూ స‌త్య‌దేవ్ విల‌న్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ తో క‌లిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తెలుగు-త‌మిళం-హిందీ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

లీగ‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ లోనూ...!

స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగారు స‌త్య‌దేవ్. టాలీవుడ్ ట్యాలెంటెడ్ న‌టుల‌లో ఆయ‌న ఒక‌రు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ల‌తో సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న కెరీర్ కి కొత్త బాట‌లు వేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. అటు వెబ్ సిరీస్ ల్లోనూ న‌టిస్తూ త‌నదైన మార్క్ చూపిస్తున్నారు. ఆ మ‌ధ్య ఓటీటీలో రిలీజ్ అయిన `ఉమామ‌హేశ్వ ఉగ్ర‌రూప‌స్య` సినిమా త‌న‌కు మంచి పేరు తెచ్చింది. న‌టుడిగా తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింతగా ద‌గ్గ‌ర‌య్యారు.

ఈ సినిమా త‌ర్వాత స‌త్య‌దేవ్ కు బాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అక్క‌డ `రామ్ సేతు` లో న‌టిస్తున్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్- జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే రెండు మూడు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. అయితే అందులో `తిమ్మ‌రుసు` లీగ‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్-ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్ల‌పై మ‌హేష్ కోనేరు- య‌ర‌బోలు సృజ‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గిన నేప‌థ్యంలో థియేట‌ర్లు అన్ లాక్ కి రెడీ అవుతున్న ఈ టైమ్ లో నేరుగా థియేర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జులై 30 న రిలీజ్ చేయాల‌ని రెడీ చేస్తున్నారు.