Begin typing your search above and press return to search.

సంక్రాంతి త‌ర్వాత ఏపీలో టికెట్ ధ‌ర‌ల పెంపు!?

By:  Tupaki Desk   |   14 Jan 2022 8:59 AM GMT
సంక్రాంతి త‌ర్వాత ఏపీలో టికెట్ ధ‌ర‌ల పెంపు!?
X
ఏపీలో సినిమా టిక్కెట్టు ధ‌ర‌ల మెలిక వెన‌క చాలా సంగ‌తులే ఉన్నాయ‌న్న‌ది ఓ సినీప్ర‌ముఖుడి విశ్లేష‌ణ‌. టికెట్ ధ‌ర‌లు త‌గ్గితే ఏం త‌గ్గుతుంది? అంటే హీరోలు.. ద‌ర్శ‌కుల పారితోషికాల‌కు మాత్ర‌మే త‌గ్గే వీలుంద‌ని ఒక సినీపెద్ద విశ్లేషించారు.

అయితే ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేటు త‌గ్గింపుపై తీసుకున్న నిర్ణ‌యం పై తాజాగా క‌మిటీ స‌మీక్షిస్తోంది. అస‌లు టిక్కెట్ రేట్లు పెంచ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? త‌గ్గింపు ప్ర‌భావం ఏ మేర‌కు ఉంది? అన్న‌ది ఆరా తీస్తే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని తెలిసింది.

ఒక సెక్ష‌న్ నుంచి స్పంద‌న ఒక‌లా ఉంటే వేరొక సెక్ష‌న్ నుంచి వేరొక‌లా ఉంది. నిజానికి టిక్కెట్టు రేటు పెరిగితే దాని వ‌ల్ల భారీ బడ్జెట్ల‌తో సినిమాలు నిర్మించే నిర్మాత‌కు ఎలాంటి లాభం ఉండ‌దు. అలాగే పంపిణీ వ‌ర్గాల‌కు క‌లిసొచ్చేదేమీ ఉండ‌దు. దానివ‌ల్ల లాభంలో వాటాల్ని హీరోలు అడుగుతారు. అదంతా త‌మ‌ను చూసే వ‌చ్చిన లాభం అంటారు. త‌ద్వారా హీరోల పారితోషికాలు పెద్ద‌గా పెరుగుతాయి మిన‌హా ఎవ‌రికీ ఏదీ క‌లిసి రాద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. క‌మిటీ విశ్లేష‌ణ‌ల దృష్టికి వ‌చ్చిన వాటిలో ఇది ఒక‌టి. ప్ర‌ముఖ సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు,.. సీనియ‌ర్ ఫిలింక్రిటిక్ ఓంప్ర‌కాష్ సైతం టికెట్ రేట్ల‌ను సామాన్యుల‌కు అందుబాటులో ఉంచితేనే బ్లాక్ మార్కెట్ త‌గ్గుతుంద‌ని సూచించారు.

పెద్ద హీరోలు.. దర్శకులు టికెట్స్ రేట్స్ పెంచి అమ్ముకోవచ్చు అన్న ఆలోచనతో కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల సినిమా బడ్జెట్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ రేట్స్ కు కొని ఎగ్జిబిటర్స్ ఎక్కువ అడ్వాన్స్ లు ఇచ్చి రిస్క్ లో పడిపోతున్నారు. మనమంతా సామాన్యుల సొమ్ము తీసుకుని హీరోల జేబులు నింపాల్సి వస్తోంద‌ని గ‌తంలో ఓ ప్ర‌ముఖుడు వ్యాఖ్యానించారు. ఈరోజుల్లో నిర్మాత‌కు లాభాలొచ్చాయి అనేది వ‌ట్టి అబ‌ద్ధం అని కూడా ఆయ‌న‌ అన్నారు. టిక్కెట్ల ధర పెంచితే ప్రధానంగా హీరోలకే లాభం. రేటు పెరిగేకొద్దీ హీరోల రెమ్యునరేషన్‌ కూడా పెరుగుతుంది. కొందరు లాభాల్లో వాటాలు అడుగుతారు. ఇక అద‌న‌పు ధ‌రతో టికెట్ కొనేది మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. పేద ప్ర‌జ‌లే. వాళ్లే సినిమాల‌కు వెళ‌తారు. ఇక పెద్ద సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర పెంచాల్సిన ప‌ని లేకుండానే జ‌నం ఆద‌రిస్తారు. అదే చిన్న సినిమాల‌కు ఆద‌ర‌ణ ఉండ‌దు. హీరోల పారితోషికాలు పెరిగితే నిర్మాత‌ల‌కు న‌ష్టం. చిన్న నిర్మాత‌ల‌కు మ‌నుగ‌డ ఉండ‌దు అని మ‌రో ప్ర‌ముఖుడు విశ్లేషించారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ఈ అభిప్రాయాల‌న్నిటినీ ప‌రిశీలిస్తోంద‌ని స‌మాచారం. ప‌రిశ్ర‌మ త‌ర‌పున చిరంజీవి - నాగార్జున స‌హా బాల‌కృష్ణ కూడా ఇప్పుడున్న ధ‌ర‌ల్ని ప‌రిశీలించి పునఃస‌మీక్షించాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరారు. పెంచుతార‌నే అంతా భావిస్తున్నారు. దీని ప్ర‌కారం.. సంక్రాంతి త‌ర్వాత జ‌రిగే స‌మావేశంలో కొత్త టికెట్ ధ‌ర‌ల్ని ప్ర‌క‌టిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.