Begin typing your search above and press return to search.

`సాహో` టిక్కెట్టు రేట్ల పెంపు?

By:  Tupaki Desk   |   22 Aug 2019 6:30 AM GMT
`సాహో` టిక్కెట్టు రేట్ల పెంపు?
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ నిర్మించిన `సాహో` ఆగ‌స్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా దేశ‌విదేశాల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాహోకి సెన్సార్ `ఏ` స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని అయితే నిర్మాత‌లు యుఏ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్ లో ప్ర‌చారం సాగుతోంది.

దీంతో పాటే టిక్కెట్టు రేటు పెంపుపైనా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. ప్ర‌తిసారీ భారీ బ‌డ్జెట్ సినిమా రిలీజయ్యేప్పుడు టిక్కెట్టు రేటు పెంచడం అల‌వాటుగా మారింది. సాహో కోసం రెండు వారాల‌పాటు టిక్కెట్టు పెంపుపై ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ట‌. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారుల్ని.. ప్ర‌భుత్వాల్ని సంప్ర‌దిస్తున్నార‌ట‌. ఏపీ - తెలంగాణ‌లో ఇంకా అనుమ‌తులు రాలేదు. వ‌చ్చే అవ‌కాశం ఉందన్న మాటా వినిపిస్తోంది. మ‌రోవైపు 29వ తేదీన భారీగా ప్రీమియ‌ర్లు.. బెనిఫిట్ షోలు అంటూ హ‌డావుడి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక బెనిఫిట్ షో టిక్కెట్టు ధ‌ర‌లు భారీగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

వాస్త‌వానికి పెద్ద సినిమాల రిలీజ్ ల వేళ ఎగ్జిబిట‌ర్లే టిక్కెట్టు రేట్లు పెంచుకునే వీలుండేలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఎగ్జిబిట‌రే కోర్టు నుంచి అనుమ‌తి తెచ్చుకుంటారు.. నిర్మాత‌ల‌కు సంబంధం ఉండ‌దని దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత గ‌తంలో అన్నారు. 2019 సంక్రాంతి సినిమాల‌కు టిక్కెట్టు ధ‌ర‌ల పెంపున‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. అయితే టిక్కెట్టు పెంపు స‌హా ప్ర‌చారం విష‌యాల్లో నిర్మాత‌ల త‌ర‌పు నుంచి ఎగ్జిబిట‌ర్- డిస్ట్రిబ్యూట‌ర్ వ‌ర్గాల‌కు కావాల్సిన సాయం ఉంటుంది. అలాగే సాహో లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రానికి రిక‌వ‌రీ కోసం ప్ర‌భుత్వాలు అనుమ‌తిచ్చే వీలుందని తెలుస్తోంది. అయితే టిక్కెట్టు రేటు పెంచితే సామాన్య ప్రేక్ష‌కుడికి అది పెనుభారం కిందే లెక్క‌. కుటుంబ స‌మేతంగా చూడాలంటే చేతి చ‌మురు బాగానే వ‌దులుతుంది. అందుకే ఈ పెంపును ప్ర‌తిసారీ ప్రేక్ష‌కులు వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. ఇక సాహోకి టిక్కెట్టు పెంపు అనుమ‌తిస్తే.. ఇదే దారిలో సైరా కోసం ప్లాన్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు.