Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ కు ప్లాన్ చేస్తున్నారా? టికెట్ ఖర్చు ఎంతంటే?

By:  Tupaki Desk   |   20 March 2022 4:30 AM GMT
ఆర్ఆర్ఆర్ కు ప్లాన్ చేస్తున్నారా? టికెట్ ఖర్చు ఎంతంటే?
X
ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే.. తెలుగు రాష్ట్రాల్లో అదో సందడి. అలాంటిది ఏకంగా ముగ్గురు ఆగ్ర హీరోలు (తారక్.. రాంచరణ్.. రాజమౌళి) ప్రాణం పెట్టి తీసిన సినిమా విడుదలవుతుంటే హడావుడి ఎంతన్నది తాజా రచ్చ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తెలుగు ప్రేక్షకుడు కాదు.. ఆలిండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నిఇన్ని కావు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల్ని పెంచేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పటివరకు అమల్లో ఉన్న ధరలు కాకుండా.. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని.. ఆదేశాలు జారీ చేశారు. ఈ టికెట్ల ధరల పెంపు పుణ్యమా అని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమయ్యే ఈ మూవీ దెబ్బకు జస్ట్ ఒక రోజులో రూ.40 నుంచి రూ.50 కోట్ల మధ్య ఆదాయం వస్తుందన్న మాట వినిపిస్తోంది.

అంటే.. ఆలిండియాతో పాటు విదేశాలతో వచ్చే కలెక్షన్ల లెక్క కట్టినప్పుడు భారీ మొత్తం ఖాయమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక అంచనా ప్రకారం.. ఒక రోజులోనే దగ్గర దగ్గర రూ.100 కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన ఇక.. ఈ సినిమా కోసం ఒక్కొక్కరు ఎంతేసి ఖర్చు పెట్టాలన్న దానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

ఏపీలో ఇంతకు ముందే ఈ సినిమా టికెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటే.. తాజాగా తెలంగాణలోనూ 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదలైన మొదటి మూడు రోజులకు భారీగా ధరల్ని డిసైడ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ మూవీ చూడాలంటే.. జేబులో ఉన్న డబ్బుల్ని అభిమానం కోసం బయటకు తీస్తే తప్పించి.. వెండితెర మీద ఆర్ఆర్ఆర్ బొమ్మ చూసే అవకాశం దక్కదని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలకు కాస్తంత ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక టికెట్ల ధరల్ని ఫిక్స్ చేసింది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ధరల తేడా ఎంతన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఏపీలో ఆర్ఆర్ఆర్ మూవీని చూడాలంటే కనిష్ఠంగా ఉన్న టికెట్ ధర రూ.105 అయితే.. గరిష్ఠంగా రూ.325 ఉంది. తెలంగాణ విషయానికి వస్తే కనిష్ఠంగా రూ.80తో మొదలైతే గరిష్ఠంగా రూ.450గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ.. ఏ థియేటర్లో ఎంతేసి చొప్పున టికెట్ల ధరల్ని డిసైడ్ అయ్యారన్నది చూస్తే..

ఆంధ్రప్రదేశ్ లో..

మున్సిపాలిటీల్లో
- ఏసీ థియేటర్లలో రూ.135, రూ.155
- నాన్‌ ఏసీలో టికెట్‌ రూ.105, రూ.125
- స్పెషల్‌ థియేటర్లలో రూ.135, రూ.175
- మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ రూ.200, రూ. 325

కార్పొరేషన్లలో..
- ఏసీ థియేటర్లలో రూ.145, రూ.175
- నాన్‌ ఏసీలో టికెట్‌ రూ.115, రూ.135
- స్పెషల్‌ థియేటర్లలో రూ.175, రూ.200
- మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ రూ.225, రూ. 325

తెలంగాణ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రత్యేక ధరల్ని డిసైడ్ చేశారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు ఇప్పుడు వసూలు చేసే టికెట్ల ధరలకు అదనంగా రూ.50 చొప్పున వసూలు చేశారు. మూడు రోజుల తర్వాత మాత్రం రూ.30 చొప్పున వసూలు చేయనున్నారు.

దీంతో.. సాధారణ ఏసీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.100, రూ.225 మల్టీఫ్లెక్సుల్లో మొదటి మూడు రోజులు రూ.395.. మూడు రోజుల తర్వాత నుంచి రూ.345 చొప్పున వసూలు చేస్తారు. మల్టీఫ్లెక్సుల్లోని రిక్లైనర్లకు మొదటి మూడు రోజులు రూ.450 చొప్పున.. మూడు రోజుల తర్వాత రూ.400 చొప్పున వసూలు చేయనున్నారు.