Begin typing your search above and press return to search.

నాగార్జునతో తిరుమల పూజారులు ఏమన్నారు?

By:  Tupaki Desk   |   16 Feb 2017 10:28 AM GMT
నాగార్జునతో తిరుమల పూజారులు ఏమన్నారు?
X
అక్కినేని నాగార్జున ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. అన్నమయ్య.. శ్రీరామదాసు లాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రాఘవేంద్రరావు. తిరుమల నేపథ్యంలో ‘అన్నమయ్య’తో సహా చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో చూడని ఎన్నో కొత్త విషయాల్ని ‘ఓం నమో వేంకటేశాయ’లో చూపించారు. తిరుమలలో వరాహమూర్తినే ఎందుకు ముందు దర్శించుకోవాలి.. శ్రీవారికి వెన్నతో నైవేద్యం ఎందుకు పెడతారు.. శ్రీవారికి పళ్లు.. పూలు ఎక్కడి నుంచి వస్తాయి.. లాంటి ఎన్నెన్నో విశేషాలు.. కొత్త విషయాలు ఈ సినిమాలో చూపించారు. ఈ విషయాలు జనాలపై బాగానే ప్రభావం చూపినట్లున్నాయి.

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా విడుదలయ్యాక తిరుమలకు వచ్చే భక్తుల్లోనూ మార్పు వచ్చిందని తనకు పూజారులు చెప్పినట్లు అక్కినేని నాగార్జున తెలిపాడు. గత కొన్ని రోజులుగా వరాహమూర్తిని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగిందని.. ఇదంతా ‘ఓం నమో వేంకటేశాయ’ ఫలితమేనని అక్కడి పూజారులు తనకు చెప్పినట్లు నాగ్ వెల్లడించాడు. ‘ఓం నమో..’ యూనిట్ సభ్యులతో కలిసి తిరుమలను దర్శించుకున్న అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. వెంకన్న ఆశీస్సులతోనే ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఘనవిజయం సాధించిందని.. ఈ సినిమాను చక్కటి సమన్వయంతో రూపొందించామని నాగ్ అన్నాడు. పురాణాల ప్రకారం వేంకటేశ్వర స్వామివారిని దర్శించే ముందు వరాహస్వామి వద్దకు వెళ్లాలన్న విషయం ఈ సినిమా చేస్తున్నపుడే తనకూ తెలిసిందని.. అప్పట్నుంచి తాను కూడా తిరుమల వస్తే ముందు వరాహస్వామినే దర్శించుకుంటున్నానని నాగ్ తెలిపాడు. ఇలాంటి సినిమాలో నటించడం పూర్వ జన్మ సుకృతమని నాగ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/