Begin typing your search above and press return to search.

సంక్రాంతి రిలీజులలో మార్పులు చూడబోతున్నామా..?

By:  Tupaki Desk   |   17 Oct 2022 2:25 PM GMT
సంక్రాంతి రిలీజులలో మార్పులు చూడబోతున్నామా..?
X
టాలీవుడ్ లో సంక్రాంతి పండగని బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. సినిమా ఎలా ఉన్నా వసూళ్లకు డోకా ఉండదు కాబట్టి.. ప్రతీ హీరో కూడా తన చిత్రాన్ని రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. పాండమిక్ కారణంగా పెద్ద పండక్కి గత రెండేళ్లుగా సంక్రాంతికి పెద్దగా సందడి కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ చూడబోతున్నాం.

2023 సంక్రాంతికి దాదాపు మూడు నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే విడుదల తేదీ స్లాట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అనేక క్రేజీ చిత్రాలు ఈ హాలిడే సీజన్ ని క్యాష్ చేసుకోవాలని ఆరాట పడుతున్నాయి. అగ్ర హీరోలంతా పండగని లక్ష్యంగా చేసుకొని ప్లాన్స్ వేస్తున్నారు. అందులో ఇప్పటికే కొందరు తమ సినిమాల డేట్స్ ని లాక్ చేసుకున్నారు. అయితే పండుగ రిలీజులలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ డ్రామా "ఆది పురుష్" ను 2023 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. కాకపోతే ఇటీవల వచ్చిన టీజర్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీఎఫ్‌ఎక్స్ టీమ్ గ్రాఫిక్స్‌ వర్క్స్ పై మళ్లీ పని చేస్తోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రకటించిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తెలుగు తమిళ ద్విభాషా చిత్రం "వారసుడు" ఎలాగైనా పొంగల్ కి ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ గా పెట్టుకొని అన్ని పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తున్నారు.

అయితే విజయ్ కు పోటీగా మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన "తునివు" చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశం ఉంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమిళ హీరోల ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఒకవేళ రెండు సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం కోలీవుడ్ లో పొంగల్ కి బిగ్ క్లాష్ గ్యారంటీ అని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కేఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి థియేటర్ అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారని టాక్ వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్ ఉన్న కారణంగా మెగా154 సినిమా పండక్కి విడుదల కాకపోవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా సంక్రాంతి రేసులో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK107 సినిమా మొదట డిసెంబర్‌ లో విడుదలకు ప్లాన్ చేయబడింది. కానీ అనుకున్న విధంగా షూటింగ్ షెడ్యూల్స్ జరగక పోవడంతో ఆలస్యం అయింది. ఒకవేళ బాలయ్య క్రిస్మస్ సీజన్ ని మిస్ చేసుకొని.. పొంగల్ కి రావాలనుకుంటే మాత్రం చిరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు.

తమ సినిమాల విషయంలో క్లాష్ జరగకుండా చూసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు సీనియర్ హీరోలలో ఎవరినో ఒకరిని పండక్కి వారం ముందు తీసుకొచ్చేలా ఒప్పించాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. MEGA154 & NBK107 రెండు సినిమా టైటిల్స్ ను అధికారికంగా ప్రకటించిన్నప్పుడు.. విడుదల తేదీలపై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

పెద్ద సినిమాలలో ఏదైనా వెనక్కి తగ్గిదే సంక్రాంతి బరిలో దిగాలని యూత్ కింగ్ అఖిల్ అక్కినేని చూస్తున్నాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న 'ఏజెంట్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫెస్టివల్ కు మూడు పెద్ద సినిమాలు లేకపోతే మాత్రం.. అఖిల్ కు సౌకర్యవంతమైన రిలీజ్ అవుతుంది. కుదరకపోతే క్రిస్మస్ సందర్భంగా లేదా సంక్రాంతికి వారం ముందో వెనుకో రిలీజ్ చేసుకోవడం మంచిది.

ఏదేమైనా మూడు నెలల ముందుగానే 2023 సంక్రాంతి రిలీజుల గురించి టాలీవుడ్ లో హడావిడి మొదలైంది కానీ.. ఫైనల్ గా ఏ సినిమా రేసులో నిలుస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదంతా చూస్తుంటే పండగ రిలీజుల్లో మార్పులు చేర్పులు ఉంటాయనిపిస్తోంది. కాకపోతే నవంబర్ నాటికి ఈ కొత్త విడుదల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.