Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏమి చేయబోతున్నారు..?

By:  Tupaki Desk   |   12 April 2020 6:41 AM GMT
లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏమి చేయబోతున్నారు..?
X
కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద బాగా పడిందని చెప్పవచ్చు. నెలకో పది సినిమాలు.. వారానికో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సందడి చేసే సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో వాటి పేరు ఎత్తకుండా చేసింది కరోనా. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా వేసుకున్నా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. దీని దెబ్బకు థియేటర్లు - మల్టీప్లెక్స్ మూసివేసి ఎప్పుడు ఓపెన్ చేయాలో తెలియక తలలు పట్టుకు కూర్చున్నాయి యాజమాన్యాలు. సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు సెలెబ్రెటీలు. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని లక్షల కుటుంబాలు పనులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఇలాంటి విపత్తులు ఎన్నో సంభవించినా ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ మూసుకొనే పరిస్థితి అయితే ఎప్పుడూ రాలేదు. కరోనా మహమ్మారి వలన సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమాల పరిస్థితి ఏమిటని ఇన్ని రోజులు ఆలోచించిన సినిమా వాళ్లకి లాక్ డౌన్ పొడిగింపుతో ఒక క్లారిటీ అయితే వచ్చిందట. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే అన్ని సర్దుమణగడానికి ఆగష్టు దాకా ఆగాల్సిందే అని సినీ ఇండస్ట్రీ పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారట. ఎందుకంటే లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించిన నేపథ్యంలో ఏప్రిల్ తర్వాత కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. కానీ సినిమా రంగంపై మాత్రం అప్పుడే లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే సినిమా అనేది మానవుడి దైనందిన జీవితంలో భాగం అయిపోయింది. మన లైఫ్ లో కొంత భాగం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమానే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా వల్ల జన సంచారం ఎక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ప్ర‌భుత్వం నుంచి సినిమా ఇండ‌స్ట్రీ పై ఆంక్షాలు ఎత్త‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా సినిమా షూటింగులు కూడా ఎప్పటిలాగే తిరిగి ప్రారంభమవడానికి టైం పడుతుంది. మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌లై.. షెడ్యూల్స్ తిరిగి స్టార్ట్ అయి, ఎప్పటిలాగే సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించాలన్నా సినిమా పెద్ద‌లంతా ఒకే మాట పై నిల‌బ‌డాలి. ఇదంతా జరగడానికి కచ్చితంగా ఆగష్టు వరకు టైం పడుతుంది.

ఇదంతా పక్కన పెడితే సినిమానే న‌మ్మ‌కున్న వేల కుటుంబాలు ఈ దెబ్బ‌కి క‌ఠిక పేద‌రికంలోకి జారుకోవ‌చ్చ‌ని కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పనులు లేక ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికుల కోసం సినీ పెద్దలు 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసారు. ఈ ఛారిటీ కోసం టాలీవుడ్ కి చెందిన హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతుగా ముందుకొచ్చి విరాళాలు అందించారు. ఈ ఛారిటీ తరపున ఇప్పటికే సహాయం చేయడం ప్రారంభించారు కూడా. అయితే ఇప్పుడు సినిమా వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చిన ఫండ్ ఎన్ని రోజులుకి యూజ్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ఆ ఫండ్స్ తో ఎంతమందికి సహాయం చేయగలరు.. ఎన్ని రోజులు సహాయం చేయగలరు.. ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకున్నారా అనే సందేహాలు - ఆందోళ‌న‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఏప్రిల్ 14న ఎత్తేస్తారు అనుకొని ఇప్పటి దాకా కలెక్ట్ చేసిన ఫండ్స్ పేద సినీ కార్మికులకు సహాయానికి ప్లాన్ చేసుకొని ఉంటారు. మరి ఇప్పుడు ఈ నెల చివరి దాకా లాక్ డౌన్ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.